బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమం...

2 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 11:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నేడు సామూహిక నిరాహార దీక్ష‌

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ పేప‌ర్ లీక్‌, సిబిఎస్ఈ అవ‌క‌త‌వ‌క‌లు వంటి విద్యా రంగ వైఫల్యాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ గత 18 రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ సోనమ్ వాంగ్‌చుక్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, ఆందోళ‌న‌లో లేవనెత్తిన డిమాండ్లను పట్టించుకునేందుకు ముందుకు రాకుండా కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ దోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తుంది. ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులు, విద్యావేత్తలు, 1,800 మందికి పైగా పౌరుల విజ్ఞప్తులను పక్కనపెట్టి, ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతూ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించడానికి నిరాకరించారు. ఆయ‌న మొక్క‌వోని దీక్ష‌తో ముందుకు సాగుతున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ చాలా బలహీనంగా ఉన్నారని, ఆయ‌న‌ను ప్ర‌తిక్ష‌ణం పర్యవేక్షిస్తున్నామ‌ని వైద్య బృందం తెలిపింది. వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా, సిజెపి గురువారం సామూహిక నిరాహార దీక్షను ప్రకటించింది. ఎస్ఎఫ్ఐ కూడా గురువారం నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించింది. దీక్ష ప్రారంభించినప్పటి నుంచి వాంగ్‌చుక్ బరువు సుమారు తొమ్మిది కిలోలు తగ్గింది. వాంగ్‌చుక్‌తో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించిన కొందరు విద్యార్థి నేత‌ల‌ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న సిజెపి శాంతియుత ఆందోళ‌న‌ను భగ్నం చేయడానికి సంఘ్ పరివార్ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆందోళ‌న‌ను దేశద్రోహంగా చిత్రీకరించేందుకు సంఘ్‌ప‌రివార్‌ గూండాలను జంతర్ మంతర్‌కు పంపుతున్నారని సిజెపి అధికార ప్రతినిధి అశుతోష్ రంగ అన్నారు. 25వ రోజు కొన‌సాగిన ఈ ఆందోళ‌న‌కు సంఘీభావం తెలిపేందుకు రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు బుధవారం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. స్టాండప్ హాస్యనటుడు, రాజకీయ వ్యంగ్య రచయిత కునాల్ కమ్రా, కాంగ్రెస్ ఎంపి ప్రశాంత్ పడోలే, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ ఈ ఆందోళ‌న‌కు మద్దతు తెలుపుతూ బహిరంగ లేఖ రాశారు.

​వాంగ్‌చుక్ కు అందించిన వైద్య సహాయం, తీసుకున్న చర్యలేంటీ?

ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం, కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆయనకు ఇప్పటివరకు అందించిన వైద్య సహాయం, తీసుకున్న చర్యలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని, ఇప్పటికే సుమారు తొమ్మిది కిలోల బరువు తగ్గారని, పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని పిల్‌ దాఖలైంది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని, అవసరమైతే ద్రవాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ అంశాన్ని హైకోర్టు అత్యవసరంగా విచారించింది. వాంగ్‌‌చుక్‌‌కు తక్షణ వైద్య సాయం అందించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై కూడా వివరణ కోరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్