మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టాలిన్‌‌పై విజయ్‌ ‘బాడీ షేమింగ్‌’ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం

1 గంట క్రితం

CPM leader Shanmugam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిపిఎం నేత షణ్ముగం

​చెన్నై : అసెంబ్లీ సాక్షిగా డిఎంకె అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌‌పై తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ ‌విజయ్‌ ‌చేసిన ‘బాడీ షేమింగ్‌’ వ్యాఖ్యలను సిపిఎం నాయకులు, ఆ రాష్ర్ట పార్టీ కార్యదర్శి పి.షణ్ముగం తీవ్రంగా ఖండించారు. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమెర్జెన్సీ) విధించిన సమయంలో స్టాలిన్‌‌ను మీసా చట్టం కింద నిర్భంధించినప్పుడు పోలీసుల దాడులకు గాయపడ్డ దవడ విషయంలో విజయ్‌ ‌చేసిన వ్యాఖ్యలను షణ్ముగం తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఎక్స్‌‌లో ఒక పోస్టు చేశారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగిన పోరాటాల చరిత్ర, అలాగే ఎమర్జెన్సీ సమయంలో సాగిన అణచివేత చర్యలు, అరాచకాల గురించి దేశానికి తెలుసు. అప్పట్లో పోలీసులు స్టాలిన్‌పై పాశవికంగా దాడి చేయడంతో ఆయన దవడ విరిగింది. ఎలాంటివారైనా, ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్‌‌ను ఎగతాళి చేయడం ఖండించదగిన చర్య. ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు బాధ్యతారాహిత్య మైనది" అని షణ్ముగం ఈ పోస్టులో తెలిపారు. పోలీసు, అగ్నిమాపక-రక్షణ సేవల శాఖలకు సంబంధించిన నిధుల కేటాయింపులపై విజయ్ సమాధానం ఇచ్చినప్పటికీ, ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సరైన సమాధానం ఇవ్వలేదని షణ్ముగం విమర్శించారు. "ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి బదులుగా, ముఖ్యమంత్రి విజయ్‌ ప్రధాన ప్రతిపక్ష పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజాస్వామ్య సంస్థలన్నీ ఇడి పంజాలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ సంస్థ చేసే ఆరోపణలనే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రస్తావించడం సముచితం కాదు" అని షణ్ముగం తన పోస్టులో తెలిపారు. వ్యక్తులను కీర్తించడానికి లేదా వ్యక్తిగత విమర్శలు చేయడానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవడం అసెంబ్లీ విధానాలకు విరుద్ధమని విమర్శిం చారు. "తీవ్రమైన వ్యక్తిగత విమర్శలను అసెంబ్లీ బయటకే పరిమితం చేయాలి. ప్రజలు చెల్లించే పన్నుల డబ్బుతో నడిచే అసెంబ్లీ సమయాన్ని వృథా చేయడం ఆమోదయోగ్యం కాదు" అని షణ్ముగం తన పోస్టులో స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్