- అత్యాచారాలు, హింసపై జంతర్‌మంతర్ వద్ద ప్రజాసంఘాల ఆందోళన
- కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నా బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని మహిళా, యువజన, విద్యార్థి, కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం జంతర్‌మంతర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళలపై పెరుగుతున్న నేరాలు, ముఖ్యంగా అత్యాచారాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆందోళనకారులు నినదించారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ప్రజలకు ఏం భద్రత కల్పిస్తాయంటూ ప్రశ్నించారు. నేరాలు జరిగిన తరువాత స్పందించడం కాకుండా, ముందస్తు నివారణ చర్యలు చేపట్టి మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఐద్వా కార్యదర్శి కవితా శర్మ మాట్లాడుతూ మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలు, హింసకు గురవుతున్న మహిళలకు తక్షణ న్యాయం అందించడంతో పాటు నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐద్వా ఢిల్లీ అధ్యక్షురాలు ఆశా యాదవ్ మాట్లాడుతూ మహిళల భద్రతపై ప్రభుత్వాల ప్రకటనలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. మహిళలు స్వేచ్ఛగా, భయంలేకుండా జీవించే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్‌ఐ కోశాధికారి రాహుల్ కిరాడ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాగర్ సింఘాల్, ఐద్వా సంయుక్త కార్యదర్శి ఆశా శర్మ, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పుష్పేంద్ర సింగ్ తదితరులు ప్రసంగించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులు, మహిళల గౌరవం, భద్రతను పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని నాయకులు తెలిపారు. మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటాలను మరింత విస్తృతం చేస్తామని నేతలు ప్రకటించారు.







కామెంట్‌లు (0)