- ఎన్ఎల్ఎస్ఐయు స్నాతకోత్సవంలో సిజెఐ జస్టిస్ సూర్యకాంత్
బెంగళూరు : న్యాయవిద్య పూర్తి చేసుకుని వృత్తిలోకి అడుగుపెడుతున్న విద్యార్థులపై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలని, వ్యక్తుల స్వేచ్ఛను కాపాడాలని సూచించారు. శనివారం నాడు బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయు) 34వ స్నాతకోత్సవంలో సిజెఐ ప్రసంగించారు. న్యాయవిద్య అంటే చట్టాలను చదివి తెలుసుకోవడం మాత్రమే కాదని, విభిన్న అభిప్రాయాలను అర్థం చేసుకోవడం, సమాజానికి సేవ చేయడం కూడా అందులో భాగమని ఆయన పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన ఉండటంతో పాటు, న్యాయం కోసం నిలబడే ధైర్యం కూడా న్యాయవాదులకు ఉండాలని చెప్పారు. తమ సమస్యలను చెప్పుకోలేని వారి మాటలను కూడా ఓపికగా వినాలని ఆయన సూచించారు. న్యాయవృత్తి అంత సులభమైనది కాదని, చట్టాలు, గత తీర్పులపై పట్టు సాధించడంతో పాటు, సరైన విషయాల కోసం ధైర్యంగా పోరాడాలని చెప్పారు. ఇతరుల బాధలను అర్థం చేసుకునే గుణం కూడా ఉండాలని సూచించారు. న్యాయవాద వృత్తి ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చని సూర్యకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్ తదితరులు ప్రసంగించారు.








కామెంట్లు (0)