న్యూఢిల్లీ : మీరు పార్లమెంటు గొంతుకను అణచివేయలేరని ఆదివారం సిజెపి ప్రతినిధి సౌరవ్‌దాస్ కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. నీట్ - యుజి ప్రశ్నాపత్రాల లీకేజీ, యువత ఆందోళనలపై పార్లమెంటు జవాబుదారీగా వ్యవహరించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు విద్యార్థుల నిరసనలు, నీట్-యుజి 2026 పరీక్షకు సంబంధించిన మూడు సెట్ల ప్రశ్నలను లోక్‌సభ సమావేశాల్లో అనుమతించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పాలనలో 'ప్రశ్నోత్తరాల సమయం' ఒక కీలకమైన స్తంభం అని సౌరవ్‌దాస్ పునరుద్ఘాటించారు. నిరసనలు జరిగిన వారాల్లో పోలీసుల చర్యల గురించి హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో నేరుగా ఎందుకు వివరణ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితి "ఆందోళనకరమని అన్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ సమావేశాల్లో, సిజెపి నేతృత్వంలోని యువత నిరసనలకు సంబంధించిన మూడు సెట్ల ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అనుమతించలేదని అన్నారు. లోక్‌సభ ఎంపీ మథేశ్వరన్ వి.ఎస్. మూడు సెట్ల ప్రశ్నల ద్వారా (నోటీసు రిఫరెన్స్ నంబర్లు 101799 మరియు 101801) కేంద్ర హోం శాఖ , కేంద్ర విద్యా శాఖల నుండి సమాధానాలను కోరారని అన్నారు. ఈ ప్రశ్నలను పార్లమెంటులో అడగలేకపోతే, ప్రభుత్వాన్ని ఎలా జవాబుదారీగా చేయాలి, నిరసనల ద్వారానా అని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల్లో హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు ముందుకు వచ్చి, నిరసనకారులపై పోలీసుల చర్యకు సంబంధించిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. తిరస్కరించబడిన ప్రశ్నలు నీట్-యూజీ 2026 అభ్యర్థులకు రీఫండ్‌లు, పేపర్ లీక్ ఆందోళనలు, ఢిల్లీలో నిరసనకారులకు నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను నిరాకరించడం, శాంతియుత ఆందోళన పట్ల ప్రభుత్వ వైఖరి వంటి కీలక సమస్యలను పరిష్కరించే ప్రశ్నలను లోక్‌సభ తిరస్కరించిందని అన్నారు. ఈ ప్రశ్నలను తిరస్కరించేందుకు పార్లమెంటరీ అధికారులు రూల్ 41(2) కింద అనేక నిబంధనలను ఉటంకించారని అన్నారు. ఈ చర్య కార్యనిర్వాహక వర్గాన్ని ప్రజా పరిశీలన నుండి రక్షించడానికి ఎంచుకున్న ‘వింత సమర్థనలు’గా ఆయన అభివర్ణించారు.
1. నీట్-యూజీ 2026 దరఖాస్తు ఫీజుల రీఫండ్ 2. ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అపనమ్మకం 3. ఢిల్లీలో సిజెపి నిరసనకారులకు తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలను నిరాకరించడం 4. నిరసన చేస్తున్న విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వ వైఖరి 5. విద్యార్థుల సంక్షేమం, పేపర్ లీక్‌లు, విద్యా సంస్కరణలు 6. శాంతియుత నిరసన తెలిపే తమ ప్రాథమిక హక్కును వినియోగించుకుంటున్న పౌరుల పట్ల కేంద్రం వైఖరి గురించి ప్రశ్నలను సంధించారని అన్నారు. అయితే పార్లమెంట్ అధికారులు ఈ ప్రశ్నలను రూల్ 41(2) ను ఉటంకిస్తూ, (i), (iv) , (v), (xviii), (xxii) క్లాజుల కింద అనుమతించేందుకు నిరాకరించిందని అన్నారు. ఈచర్య న్యాయబద్ధమైన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా తప్పించుకునేందుకు తీసుకున్న వింత సమర్థనగా ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య సంస్థలు సభలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరాకరించినప్పుడు, పౌరులకు తమ నిరసనలను వీధుల్లోకి తీసుకువెళ్లడం తప్ప మరో మార్గం ఉండదని దాస్ పునరుద్ఘాటించారు. ఎంపిలను ప్రశ్నలు అడగకుండా అడ్డుకోవడం, కేంద్ర ప్రభుత్వం, ప్రజల మధ్య మధ్యవర్తిగా పార్లమెంట్ పోషిస్తున్న పాత్రను బలహీనపరుస్తుందని, దానిని కార్యనిర్వాహక నిర్ణయాలకు ఒక నిష్క్రియాత్మక 'రబ్బర్ స్టాంప్'గా మారుస్తుందని అన్నారు. మీరు యువతను విస్మరించలేరని, ఇది తమ దృష్టిలో ప్రజాస్వ్యాయుత దేశం కాదని అన్నారు. పోటీ పరీక్షలలో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకులు మరియు విస్తృత విద్యా సంబంధిత ఆందోళనలపై సీజేపీ నేతృత్వంలో నెలల తరబడి జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ ఆరోపణలు వచ్చాయి. ఆ సంస్థ జూన్‌లో దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించింది. ఈ నిరసనలు మొదట ఢిల్లీలో ప్రారంభమై, ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి.








కామెంట్‌లు (0)