మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసభకు రావాల్సిందే.. సమాధానమివ్వాల్సిందే

1 గంట క్రితం

parliament
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 12:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విద్యార్థులపై దాడి..విరాళాల దోపిడీపై ప్రతిపక్షాల డిమాండ్‌

  • కేంద్రం తీరుపై విమర్శలతో హోరెత్తిన పార్లమెంట్‌

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి దశలోనూ ప్రతిపక్షాల ఆందోళనలతోనే సభ హోరెత్తింది. విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల అమానవీయ దాడులపైనా..అయోధ్యలో రామమందిర విరాళాల దోపిడీపైనా కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా సమాధానం చెప్పితీరాలని ప్రతిపక్షాల సభ్యులు మంగళవారం పార్లమెంటు ఉభయసభల్లోనూ, ఆ తర్వాత పార్లమెంటు ప్రాంగణంలోనూ ఆందోళన చేపట్టారు. గైర్హాజరుతో ఎన్నాళ్లు తప్పించుకుతిరుగుతారు? అమిత్‌ ‌షా.. సభకు రావాల్సిందే.. సమాధానమివ్వాల్సిందేనని నినదించారు. అయితే పార్ల‌మెంట్ ఉభ‌య సభల‌కు గైర్హాజరైన ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఎన్‌డిఎ ఎంపిలు మంగళవారం నాడు సాధారణ సమావేశానికి (మంగళ్ మిలన్) హాజరయ్యారు. ​లోక్‌స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్ర‌శ్నోత్త‌రాల నిర్వ‌హించడానికి ప్ర‌య‌త్నించగా..ప్రతిపక్షాల సభ్యులు వెల్‌‌లోకి దూసుకెళ్లి.. విద్యార్థులపై పోలీసుల దాడి..అయోధ్య విరాళాల దోపిడీపై చర్చకు పట్టుబట్టారు. సభకు అంతరాయం కలిగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పీకర్‌ తిరస్కరించగా..విద్యార్థులపై క్రూర‌మైన దాడి, విరాళాల‌ దోపిడీ చాలా ముఖ్యమైన అంశాలని, చర్చ చేపట్టాల్సిందేనని నినదించారు. సభకు అమిత్‌ ‌షా వచ్చి స‌మాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ ‌చేశారు.

‘కేరళం’ బిల్లుకు ఆమోదం..

కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును స‌భ‌లో హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెడతార‌ని తొలుత ప్రకటించినప్పటికీ, ఆయన గైర్హాజరు కారణంగా సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ప్ర‌తిపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును సభలో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించారు. రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతూ కేరళం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్ర అధికారిక పేరును మలయాళంలో ‘కేరళం’గా ఉపయోగిస్తున్న నేపథ్యంలో అదే పేరును రాజ్యాంగపరంగానూ అమలు చేయాలని గత వామపక్ష ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన సంగతి తెలిసిందే. అలాగే, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లును కూడా లోక్‌సభ చర్చ లేకుండానే ఆమోదించింది. రాజ్య‌స‌భ‌లో కూడా ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగింది. పలు వాయిదాల అనంత‌రం ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్