- స్థానిక అంశాలు, సంస్కృతి, ఆకాంక్షలపై అవగాహన పెంచుకోవాలి
- మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : పల్లె సీమలు, ప్రత్యేకించి దేశ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల రూపురేఖలు మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. అభివృద్ధి చెందిన దేశం దిశగా పయణించాలంటే గ్రామీణ ప్రాంతాల కేంద్రంగానే ముందుకు సాగాలని ఆయన అన్నారు. దేశ యువతరం మూలాలకు వెళ్లి ఆయా ప్రాంతాల వాస్తవిక అంశాలను తెలుసుకోవాలని, వికసిత్ భారత్ వాస్తవ రూపు దాల్చడానికి సహకరించాలని కోరారు. ఆకాశవాణిలో నెలవారీ ప్రసారమయ్యే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. జాతి నిర్మాణంలో యువతరానిది కీలక పాత్ర అని ఆయన తెలిపారు. ఈ క్రమంలో యువత స్థానిక ప్రజల సమస్యలను, సంస్కృతిని, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. మారుమూల ప్రజలతో యువతరం అనుసంధానమైనప్పుడే అభివృద్ధి చెందిన భారత్ ఉద్దేశపు విస్తృతి పెరుగుతుందని తెలిపారు. అదే సమయంలో సౌకర్యాలు కంటే దేశమే ముందు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.
రక్షణ ఉత్పత్తి, రక్షణ ఎగుమతులు, మిత్ర దేశాలతో రాజకీయ సహకారం వంటి రంగాలలో భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని తెలిపారు. ఆదివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి ప్రవేశాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఆధునిక యుద్ధనౌకను స్వదేశంలోనే రూపకల్పన చేసి, నిర్మించారని, దీని నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రిలో 75 శాతానికి పైగా దేశానికి చెందినదే అని వెల్లడించారు. జులైలోనే పినాక దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించామని, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సమిష్టి కృషిని అభినందించారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇటీవల జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన పివి సింధును చూసి యావత్ దేశం గర్విస్తోందని తెలిపారు. లార్డ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు విజయాన్ని కూడా మోడీ ప్రస్తావించారు. భౌతికశాస్త్ర ఒలింపియాడ్‌లో ఐదుగురు విద్యార్థులు స్వర్ణ పతకాలు గెలుచుకోగా, భారత్ టాప్ ర్యాంకును కైవసం చేసుకుందని మోడీ కొనియాడారు.








కామెంట్‌లు (0)