మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శివాని మృతిపై ఉన్నత స్థాయి విచారణ

27 జులై, 2026

Meeting in Vijayawada tomorrow demanding Dharmendra Pradhan's resignation: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గిరిజన విద్యార్థిని శివాని మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీకి చెందిన గిరిజన విద్యార్థిని ముర్రం శివాని (15) అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని కలిగించిందని తెలిపారు. బాలిక మృతి అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటీవల రంపచోడవరంలో జరిగిన ‘మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్‌’లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి, తన వాక్చాతుర్యంతో అందరి ప్రశంసలు అందుకోవడమే గాక, ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా ఫొటోలు దిగిన ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న గిరిజన బాలిక ఇంతలోనే మృతి చెందడం బాధాకరమని అన్నారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రితో సహా అందరితో ప్రశంసలు పొంది, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఒక విద్యార్థిని ఉన్నట్టుండి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అంతటి ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో పాల్గొన్న చిన్నారిని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులు ఏమిటి? ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడికి కారణాలు ఏమిటి? అనే అంశాలపై సమగ్రంగా, నిష్పాక్షికంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు పరామర్శలకు మాత్రమే పరిమితం కాకుండా, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఇతర ప్రతికూల పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముర్రం శివాని మృతి వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టడానికి ఉన్నత స్థాయి నిపుణులు, విద్యావేత్తలతో విచారణ జరిపించాలని, శివాని కుటుబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఆ కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గిరిజన, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించేందుకు, ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. శోకసంద్రంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు, సహచర విద్యార్థులకు సిపిఎం పూర్తి నైతిక మద్దతు ఇస్తుందని వి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

శివాని మృతిపై సమగ్ర దర్యాప్తు : సిపిఐ, ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

గిరిజన విద్యార్థిని శివాని మృతి పట్ల ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి, ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శివాని హఠాన్మరణం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యార్థిని మృతి ఒక ప్రశ్నగా మిగిలిపోకూడదని పేర్కొన్నారు.

రూ.25 లక్షలు పరిహారం అందించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

శివాని మృతి తీవ్ర విచారాన్ని కలిగించిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్న కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, తక్షణమే రూ.25 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గిరిజన, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించేందుకు, ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్