సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
పునర్విభజన బిజెపి రాజకీయ కుట్ర
మూడు నెలలుగా ఏకాభిప్రాయం కోసం ఏమిచేశారో సిఎం చెప్పాలి
రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దలేదు
రాష్ట్ర ఎంపీలు బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి
రూ.150 కోట్లు చొప్పున ఎంపిలను కొన్నారనే ఆరోపణలు
ప్రజాశక్తి - విజయవాడ : రాజకీయ భౌగోళిక పటాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బిజెపి డీలిమిటేషన్ బిల్లును ముందుకు తెచ్చినందని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఈనెల 30వ తేదీన సిపిఎం ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం విజయవాడ బాలోత్సవభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్‌ను మహిళా రిజర్వేషన్‌తో ముడిపెట్టడం వల్ల అన్యాయం జరుగుతోందని అన్నారు. తనకు అనుకూలమైన విధంగా నియోజకర్గాలను ఏర్పాటు చేసుకుని మోడీ శాశ్వత ప్రధానిగా ఉండేందుకు బిజెపి కుట్ర చేస్తోందని, దీనికి టిడిపి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాగస్వామి కావడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రొరేటా ప్రకారం 50 శాతం సీట్లు పెరుగుతాయని సిఎం జనాన్ని నమ్మిస్తున్నారని, ఏకాభిప్రాయం కావాలని చెబుతున్నారని, రెండురోజుల్లో పార్లమెంటు సమావేశాలు పెట్టుకుని పార్టీలతో చర్చించకుండా ఏకాభిప్రాయం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మూడు నెలల నుండి చర్చింకుండా ఇప్పుడు చిత్తశుద్ధిలేని మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. దీనివల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
2006 పునర్విభజనకు ముందు ఆంధ్రప్రాంతంలో 27 పార్లమెంటు స్థానాలు ఉంటే వాటిని 25కు తగ్గించారని, అక్కడే రెండు స్థానాలు తగ్గిపోయాయని అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీలో 225 సీట్లు కల్పించాల్సి ఉండగా పదేళ్ల నుండి పెంచలేదని విమర్శించారు. 225 అసెంబ్లీ సీట్లకు 50 శాతం పెంచితే ఇప్పుడు అసెంబ్లీ సీట్లు 288 కావాల్సి ఉందని, కానీ ఇప్పుడు 263 మాత్రమే వస్తున్నాయని, 25 సీట్లు ఎపి కోల్పోతుందని అన్నారు. 2014లో జరిగిన అన్యాయాన్ని ఇప్పటి వరకూ సరిదిద్దలేదని, టిడిపి, వైసిపి ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో సీట్లు పెంచుకోవడం కోసం ఆఘమేఘాల మీద రాజ్యాంగ సవరణ చేస్తున్నారని పదేండ్లుగా మన రాష్ట్ర హక్కును ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. ఏకాభిప్రాయం సాధించాలన్న చిత్తశుద్ధి ఉంటే తన పలుకుబడిని ఉపయోగించి బిల్లును వాయిదా వేయించి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబుకి శ్రీనివాసరావు సూచించారు. అక్కడ 403 అసెంబ్లీస్థానాలు ఉంటే దాన్ని 650 చేస్తున్నారని, 500 సీట్లకు మించకూడదని ఉన్న చట్టాన్ని మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు దీన్ని లింకు పెడుతున్నారని, దీనివెనుక కుట్ర ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు సీట్లు పెంచుతామని చెప్పినా డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసిన తరువాత బిజెపి తనకు అనుకూలంగా నియోజకవర్గాల రాజకీయ భౌగోళిక రూపాన్ని మార్చి తనకు అనుకూలంగా చేసుకుంటుందని తెలిపారు. పైగా అదనంగా పెరిగే సీట్లు కూడా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత తగ్గి రైతుకూలీలకు గుర్తింపు లేకుండా పోతుందని అన్నారు. బిజెపి తన అధికారబలంతో టిఎంసిని విడగొట్టిందని, అలాగే శివసేన, ఎన్‌సిపిని ముక్కలు చేసిందని తెలిపారు. డిఎంకె, బిజెడి, వైసిపిలను లొంగదీసుకుందని అన్నారు. వైసిపి వైఖరి స్పష్టం చేయాలని కోరారు. భవిష్యత్‌లో ఈ వైఖరి టిడిపి, వైసిపిని కూడా ముక్కలు చేస్తుందని అన్నారు. డీలిమిటేషన్ బిల్లు కోసం బిజెపి నాయకత్వం అవసరమైన ప్రతి ఎంపికి రూ.150 కోట్లు ఇస్తుందని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.
రుషికొండ ప్యాలెస్‌ను సైన్స్ మ్యూజియంగా ఏర్పాటు
విశాఖపట్నంలోని రూ.450 కోట్లతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌లో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రుషికొండ ప్యాలెస్‌ను తవ్వేయడం వల్ల ప్రకృతి పర్యావరణం దెబ్బతింటోందని నివేదిక ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికీ దీన్ని ప్రైవేటు పరం చేసి కొండ క్రింద, పైనా అదనపు భూమి ఇస్తామంటున్నారని విమర్శించారు. డేటాసెంటర్ల పేరుతో మరో మూడు కొండలు బోడిగుండ్లు అవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేసిందని విమర్శిస్తున్న టిడిపి ఇప్పుడు ప్రస్తుతం ఏకంగా దీన్ని ప్రైవేటుకు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను సైన్స్ & టెక్నాలజీ మ్యూజియం చేయడం ద్వారా పిల్లలో ఆలోచనాశక్తిని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మోడీ, సిఐఐ సదస్సుల పేరుతో రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులతో మెడికల్ కళాశాలలు పూర్తి చేయొచ్చని, రాయామపట్నం పోర్టు నిర్మించొచ్చని తెలిపారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటు పరం చేయడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.
అమరావతిలో పెరుగుతున్న నిర్మాణ ఖర్చు
అమరావతి రాజధానిలో భవనాలు పూర్తి కాకపోయినా ఖర్చు మాత్రం విపరీతంగా పెంచేస్తున్నారని శ్రీనివాసరావు తతెలిపారు. సెక్రటేరియట్ నిర్మాణానికి రూ.2000 కోట్లు పెంచారని అన్నారు. అదే సమయంలో కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని, సిఎం సైతం దీన్ని ఒప్పుకోకతప్పలేదని, కాంట్రాక్టు సంస్థలను హెచ్చరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కార్మికులు చనిపోతున్నా రక్షణ కల్పించడం లేదని పేర్కొన్నారు. కేంద్రం నుండి నిధులు తీసుకుని నిర్మించాల్సిన అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలపై భారం వేయడాన్ని సిపిఐ(యం) వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇప్పటికే రాజధాని నిర్మాణ వ్యయంపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో అంచానాలు పెంచడం కాంట్రాక్టర్ల కోసమేనని రుజువవుతున్నట్లు పేర్కొన్నారు.








కామెంట్లు (0)