శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ను తొలగించాల్సిందే...

2 గంటల క్రితం

left
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 11:45 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- పది వామపక్ష పార్టీల డిమాండ్‌

- నేటి నుంచి అక్టోబర్ 2 వరకూ రాష్ట్రమంతా నిరసనలు

- 28న ‘యూత్‌ఫర్ డెమొక్రసి

- 2న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చెదలుపట్టించిన ఆయనను తక్షణం తొలగించాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పది వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. అనంతరం బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో మిగిలిన ఇద్దరు చెప్పిన ఏ విషయాన్నీ జ్ఞానేష్‌ కుమార్ వినలేదని, ఏకపక్షంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని తెలిపారు. 14 సార్లు క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాసినా స్పందించలేదని వివరించారు. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థకు పనికిరారని, సిఇసిగా తొలగిస్తే తప్ప ప్రజాస్వామ్యం బతకదని అన్నారు. గతంలో ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్లో 17 లక్షల ఓట్లను తొలగించి ఎన్నికలు పూర్తయిన తరువాత వాటిని కొనసాగించారని, ఇది అక్కడి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. ప్రధాని మోడీ, అమిత్‌షా ఆదేశాలతో జ్ఞానేష్‌ కుమార్ భారత ఎన్నికల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని అన్నారు. తొలుత సిఇసి ఎంపిక కమిటీలో ఉన్న సుప్రీం కోర్టు జడ్జిని తొలగించి క్యాబినెట్ ర్యాంకు మంత్రిని పెట్టారని, అనంతరం ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు. ఓట్లు తగ్గించే విధంగా సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి ఇసిఐ ని తన గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్ర అధికారులు కూడా ఏమీ చేయలేని విధంగా డేటా మొత్తాన్ని మోడీ చేతిలో పెట్టారన్నారు. ఓటర్ల డేటాబేస్ క్రమంగా కేంద్రీకృతం కావడం, రాష్ట్ర నియోజకవర్గ స్థాయిలో చట్టబద్ధమైన అధికారుల ప్రమేయంపై ఆంక్షలు విధించడం వంటి విషయాలను ఆ ఇద్దరు కమిషనర్లు ప్రత్యేకంగా ఎత్తి చూపారని తెలిపారు. ఇప్పటి వరకూ సర్ ప్రక్రియపై తాము చెప్పిందే నిజమైందని శ్రీనివాసరావు వివరించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల సంఘం విశ్వసనీయత కోల్పోయిందని పేర్కొన్నారు. క్యాబినెట్ సెక్రటరీ కూడా పట్టించుకోలేదని, ఐటి సెక్రటరీ సీమా ఖన్నా కూడా మొత్తం ఓటర్ల వివరాలన్నీ మోడీ, అమిత్‌షా కాళ్ల దగ్గర పెట్టారని వివరించారు. బిజెపి రాజకీయ లక్ష్యం మేరకే ఇది జరిగిందన్నారు. ఇప్పటి వరకూ ఓటర్లు పాలకపక్షాన్ని ఎన్నుకుంటున్నారని, ఇప్పుడు పాలకపక్షమే ఓటర్లను ఎంపిక చేస్తోందని విమర్శించారు. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పొలారి మాట్లాడుతూ ఇటీవలకాలంలో ఎన్నికల కమిషన్ ఓటర్లను తీవ్ర ఇబ్బందుల పాల్జేసిందని అన్నారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత, స్వతంత్రత ఇంతగా పడిపోవడం మునుపెన్నడూ జరగలేదని పేర్కొన్నారు. వ్యవస్థను తారుమారు చేసి, సంస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసినందుకు సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను జవాబుదారీగా చేయాలన్నారు. ఎంసిపిఐయు నాయకులు ఖాదర్ భాషా మాట్లాడుతూ సిఈసి తీరుతోనే ఓట్ చోరీ జరిగిందని అన్నారు. దీనివెనుక బిజెపి రాజకీయ కుట్ర ఉందని పేర్కొన్నారు. ఎస్‌యుసిఐసి నాయకులు సుధీర్ మాట్లాడుతూ ఇసిఐ స్వతంత్ర, ప్రజాస్వామ్యయుత పనితీరును పునరుద్ధరించాలని కోరారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు శ్రీనివాసరావు స్పందిస్తూ ముగ్గురు కమిషనర్లు ప్రజాస్వామ్యయుతంగా పని చేయాలని అన్నారు, సిఇసి ఎన్నిక కమిటీలోకి సుప్రీం కోర్టు జడ్జిని తీసుకోవాలని, మెజార్టీ నిర్ణయం మేరకు ఎలక్షన్ కమిషన్ కార్యాచరణ ఉండాలని తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, ఎంసిపిఐయు నాయకులు కాసాని గణేష్ సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్‌ఎస్‌‌పి, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సిపిఐ(ఎంఎల్) నాయకులు సమావేశంలో పాల్గొనకపోయినప్పటికీ సమావేశ నిర్ణయాలను ఆమోదించారు.

26 నుండి నిరసనలు

ప్రజాస్వామ్యం లౌకికవాదం కోసం నిరంతరం పోరాడిన షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ జయంతి సెప్టెంబర్ 28వ తేదీన యూత్ ఫర్ డెమోక్రసీ పేరుతో యువత నిరసనలు చేపతారని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు. అలాగే అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి నేపథ్యంలో, సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు వారం రోజుల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో చేరాలని బిజెపియేతర, లౌకిక, ప్రజాస్వామ్య ప్రతిపక్ష పార్టీలకు, పౌర సమాజ సంస్థలకు ఆసక్తిగల పౌరులందరికీ విజ్ఞప్తి చేశారు.


వామపక్షాలు


వామపక్ష పార్టీల డిమాండ్లు ...

జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి.

ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయండి.

ఓటర్ల జాబితా నుండి అన్యాయంగా తొలగించబడిన వారందరి ఓటు హక్కులను పునరుద్ధరించండి.

ఈసీఐ స్వతంత్ర, ప్రజాస్వామ్యయుత పనితీరును పునరుద్ధరించండి.

ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన, సుప్రీంకోర్టు ప్రతిపాదించిన ఎంపిక కమిటీ ఆధారిత యంత్రాంగంతో, ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఉన్న ప్రస్తుత వ్యవస్థను భర్తీ చేయండి.


ఈ వామపక్ష పార్టీల సమావేశంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, సిపిఐ ఎ.వనజ, సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ కె.పోలారి, ఎస్‌యుసిఐ(సి) సుధీర్, యంసిపిఐ(యు) ఖాదర్ భాషా, కాసాని గణేష్, సిపిఐ(యంఎల్) లిబరేషన్ డి.హరినాథ్, ఉదయ్ కిరణ్, ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్ఎస్‌పి, సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ, సిపిఐ(యంఎల్) పార్టీలు సమావేశంలో పాల్గొనకపోయినప్పటికీ సమావేశ నిర్ణయాలను ఆమోదించాయి.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్