విజయవాడ : రాష్ట్రంలో ఈరోజు యంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కూటమి పార్టీలు అధికార బలంతో దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలకు పాల్పడటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండించింది. దీనికి సంబంధించి గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడిన ప్రాంతాల్లో రీ పోలింగ్ జరపాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. రిగ్గింగ్‌కు పాల్పడిన వారిపై, వారికి వత్తాసు పలికిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో అధికార పార్టీ కార్యకర్తలు ఒక పథకం ప్రకారం బూత్‌లలోకి ప్రవేశించి ప్రతిపక్షాల ఏజెంట్లను బలవంతంగా బయటకు తరిమేసి, ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. అందుకూరు గ్రామానికి చెందిన 43,44 పోలింగ్ బూత్‌లలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బూత్‌లలోకి చొరబడి పోలింగ్ ఆఫీసర్ల వద్ద ఉన్న బ్యాలెట్ పేపర్స్ లాక్కొని తెలుగుదేశం అభ్యర్థికి అనుకూలంగా దొంగ ఓట్లు వేయడం ప్రారంభించారని, వారికి స్థానికంగా ఉన్న టిడిపి కార్యకర్తలు సహకరించారని వివరించారు. ఈ రెండు బూత్‌లలో రిగ్గింగ్ జరిగినందున పోలింగ్ని రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నకరికల్లు మండలం జెడ్పిటిసి స్థానంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సిపిఐ(యం) ఏజెంట్లను అందరినీ బయటకు తరిమివేసి, బూత్‌లలో ఉన్న సిసి కెమెరాలు ఆఫ్‌చేసి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ రెండు స్థానాలలో రీ పోలింగ్ జరపాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. అలాగే కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో సిపిఐ(యం) అభ్యర్థిని పోలీసులు లాక్కొని వెళ్ళి జీపులో పడేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని, ఇదే గ్రామంలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 17,18,19 లలో తెలుగుదేశం పార్టీ వారు బూత్‌లు ఆక్రమించి రిగ్గింగ్ చేసేందుకు సన్నాహలు చేస్తున్నారని, పై ఘటనలపై ఇంతకుముందే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్య తీసుకోలేదని చెప్పారు. దానితో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయి మరిన్ని అరాచకాలకు, ఆగడాలకు పాల్పడుతున్నారని అన్నారు. అధికార పార్టీ ఒక పథకం ప్రకారం ఇలా అక్రమాలకు పాల్పడుతుంటే పోలీసు యంత్రాంగం వాటిని నివారించాల్సింది పోయి వారికి తోడ్పడే పద్దతిలో వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రిగ్గింగుకు తోడ్పడిన పోలీసు, పోలింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. రిగ్గింగ్ జరిగిన స్థానాలలో రీపోలింగ్ జరపాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అధికార పార్టీ అక్రమాల పై సిపిఐ(యం) ఖండన
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 05:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)