కూటమి నేతలు ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యేలను ప్రశ్నించండి
ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపు
ప్రభుత్వ చర్యలు అహంకారపూరితంగా ఉంటున్నాయి
స్థానిక సమస్యలపై 90 శాతం హామీలు అమలు జరగలేదు
రాష్ట్రంలో 30ఏ పోలీసు యాక్టు, 144 సెక్షన్లు ఎత్తేయాలి
అడవిని ధ్వంసం చేయడం రాష్ట్రానికి నష్టం
ప్రభుత్వమే ఉచిత పంటల బీమా చేయాలి
కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి
మిగిలిన పొగాకును ప్రభుత్వమే కిలోకు రూ.200తో కొనుగోలు
ధర వ్యత్యాసం రూ.50 చెల్లించాలి
విజయవాడ : ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వ నేతలు స్థానిక సమస్యలపై ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు జరగలేదని, దీనిపై ప్రజలు ఇంటింటికీ వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం ఉదయం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, కరువు పరిస్థితులు, డేటా సెంటర్, పొగాకు కొనుగోళ్లు, ప్రజలపై పోలీసు నిర్బంధం తదితర అంశాలపై మాట్లాడారు. రెండేళ్లకాలంలో ప్రజలకు చేసిందేమీ లేకపోయినా ఇంటింటికీ టిడిపి పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టారని, ఏమి సాధించారని ఈ కార్యక్రమం చేపట్టారని పశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు జరగలేదని, మహిళలకు పెన్షన్, నిరుద్యోగ భృతి, గిట్టుబాటు ధరలు వంటి కనీస హామీలు కూడా చేయలేదని విమర్శించారు. ఉన్న భూములన్నీ కార్పొరేట్లకు పందేరం చేస్తూ బిడ్డలే ఆస్తి అని సిఎం చంద్రబాబు నాయుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారని తెలిపారు. మంగళగిరిలో లోకేష్ 30 వేల ఇళ్లపట్టాలు ఇస్తానని చెప్పి 2000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. ఇంటింటికీ తిరిగే సమయంలో నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవాలని, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజలు తమ ఇబ్బందులను టిడిపి నాయకులకు ధైర్యంగా చెప్పాలని సూచించారు. అంతా చేస్తున్నామనే పేరుతో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, ఇప్పుడు జెన్‌జెడ్ కాలం నడుస్తోందని యువత చూస్తూ ఊరుకోరని అన్నారు. ప్రధానమంత్రి అంతటి వ్యక్తే జెన్ జెడ్ ఉద్యమం దెబ్బకు ఒకేరోజు రెండుసార్లు మీడియాలో మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి పాలనలో 10 నుండి 15 శాతం మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాత్రమే అంతో ఇంతో నిజాయితీగా హామీలు అమలు చేస్తున్నారని, అత్యధిక మంది దారితప్పి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇదే పద్ధతి కొనసాగితే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.
30, 144 సెక్షన్లు ఎత్తేయాలి : వి.శ్రీనివాసరావు
రాష్ట్రంలో ఎక్కడకెళ్లినా 30, 144 సెక్షన్లు అమలు చేస్తున్నారని, దాదాపు అన్ని పట్టణాలు నిర్బంధంలో ఉన్నాయని, ఇదేనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తీరని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో అవి అమల్లో ఉన్నాయంటే అక్కడ ప్రశ్నించే హక్కు లేదని చెప్పేలా ఈ చట్టాలను ప్రయోగిస్తున్నారని అన్నారు. ఒకవైపు సుప్రీం కోర్టు ఆందోళనలను ప్రాథమిక హక్కని చెబుతున్నా రాష్ట్ర పాలకుల చెవికి అవి ఎక్కడం లేదన్నారు. వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండు చేశారు. అభివృద్ధి జరిగి ప్రజలకు ఇబ్బంది లేదని చెబుతున్న ప్రభుత్వం ఈ చట్టాలను ఎందుకు అమలు చేస్తుందని ప్రశ్నించారు. పాలనావైఫల్యంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, దీన్ని కప్పి పెట్టేందుకు పోలీసు నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని తెలిపారు. విశాఖలో డేటా సెంటర్‌ను పరిశీలించేందుకు వెళుతున్న సిపిఎం, లెఫ్ట్ పార్టీల నాయకులు ఎప్పుడు వెళ్లినా నిర్బంధం ప్రయోగిస్తున్నారని అన్నారు. తర్లువాడ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తప్పుకు తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిపిఎం నాయకులు వారి ఇబ్బందులు తెలుసుకునేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, గృహ నిర్బంధాలకు దిగుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు పార్టీ నాయకులకు ఉందని, వారిపై నిర్బంధం ప్రయోగించడం మానుకోవాలని హెచ్చరించారు.
అమరావతిలో ఫ్రీడం పార్కు పెట్టాలి : వి.శ్రీనివాసరావు
విజయవాడ ప్రాంతంలో నిరసనలు వ్యక్తం చేసేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదని, అసలు ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా రాజధాని అమరావతిలోనూ ఫ్రీడం పార్కు ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావు కోరారు. అక్కడ ప్రజలకు నిరసన వ్యక్తం చేసేందుకు వీలు కల్పించడంతోపాటు సమస్యలు నివేదించేందుకు వీలుగా ఒకలైజాన్ ఆఫీసరును కూడా నియమించాలని కోరారు. ఇప్పుడున్న పద్ధతిలో ప్రజలు స్పందన కార్యక్రమంలో విన్నవించుకుంటున్న వాటిలో 90 శాతం కూడా పరిష్కారం కావడం లేదని, అదొకమోసపూరిత ఈవెంట్‌గా జరుగుతోందని అన్నారు. పరిష్కరిస్తే అవేమిటో లిస్టు బయటపెట్టాలని కోరారు.
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు : వి.శ్రీనివాసరావు
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని, 249 మండలాల్లో తీవ్ర వర్షపాతలోటు ఉందని తెలిపారు. ఇప్పటి వరకూ 225 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవాల్సి ఉండగా 104 మిల్లీమీటర్లు మాత్రమే పడిందని తెలిపారు. వరినాట్లు 34 శాతం మాత్రమే పడ్డాయని వివరించారు. రాయలసీమలో వేరుశనగ వేయలేదని, మొక్కజొన్న ఎండిపోతోందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కరువు మండలాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వమే ఉచిత పంటల బీమా చేయాలని కోరారు. రైతులు తీసుకున్న అప్పులు రద్దు చేయాలని, దీనిద్వారా వారిని కొంత ఆదుకున్నట్లు అవుతుందని తెలిపారు.
డేటా సెంటర్లు, అడవి ధ్వంసంతో పర్యావరణ ముప్పు : వి.శ్రీనివాసరావు
విశాఖపట్నంలోని అరిలోవలో నీరు అట్టడుగుకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. అయినా అక్కడ డేటా సెంటర్ పెడుతున్నారని విశాఖపట్నం ప్రజలు మొత్తం వినియోగించే నీటిని ఒక్క డేటా సెంటర్ వినియోగిస్తుందని తెలిపారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు వస్తాయని, డేటా సెంటర్ ఏర్పాటును వెనక్కు తీసుకోవాలని కోరారు. పవన్ కల్యాణ్ చెట్లు నరకొద్దని చెబుతున్నా ఆచరణలో ఏజెన్సీలో అటవీ ప్రాంతం మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలు, మైనింగ్, పంప్డ్ స్టోరేజీ, టూరిజం పేరుతో ధ్వంసం చేయడానికి ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని శ్రీనివాసరావు విమర్శించారు. దీనిపై డిప్యూటీ సిఎం ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. అడవిని ధ్వంసం చేయడం అంటే మొత్తం రాష్ట్ర పర్యావరణాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. దీనివల్ల వర్షాలు తగ్గిపోయి తీవ్ర కరువు పరిస్థితులు వస్తాయని అన్నారు. ఇప్పటికే ఎల్‌నినో దెబ్బకు వర్షాలు లేవని, ఉన్న అడవులను కూడా ధ్వంసం చేస్తే భవిష్యత్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. రాయలసీమలో సోలార్ పేరుతో భూములు లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల వద్దే 64 శాతం పొగాకు : వి.శ్రీనివాసరావు
ప్రభుత్వం పొగాకు కొంటామని చెబుతున్నా ఆచరణలో అమలు చేయడం లేదని, ఐటిసి కంపెనీ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ కనీస మద్దతు ధర అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కిలో రూ.200 వెచ్చించి కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా మార్కెట్లో రూ.150 కంటే తక్కువకే కొంటున్నారని తెలిపారు. ధర్య వ్యత్యాసం కింద ముఖ్యమంత్రి చెప్పిన రూ.20 ఏ మూలకూ చాలదని, రూ.50కి పరిహారం పెంచాలని డిమాండు చేశారు. నోబిడ్స్ పెరిగిపోయాయని దీంతో పంటలో 64 శాతం పొగాకు ఇప్పటికీ రైతుల వద్దే ఉందని తెలిపారు. అలాగే నిల్వ పొగాకును కూడా ప్రభుత్వం కనీస మద్దతు ధర కిలోకు రూ.200 ఇచ్చి కొనుగోలు చేయాలని ఆయన డిమాండు చేశారు.

కూటమి నేతలు ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యేలను ప్రశ్నించండి : శ్రీనివాసరావు పిలుపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 04:01 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)