- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు సిపిఎం బహిరంగ లేఖ
- ప్రలోభాలను ఎదిరించాలని వి. శ్రీనివాసరావు పిలుపు
- కేరళ తరహాలో పంచాయతీలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాడేవారికి పంచాయతీ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలకు సిపిఎం రాష్ట్ర కమిటీ రాసిన బహిరంగ లేఖను శ్రీనివాసరావుతో పాటు, కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావు, ఎవి నాగేశ్వరరావు, బి బలరాం, వి రాంభూపాల్, కె సుబ్బరావమ్మ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 26, 29, డిసెంబరు 2వతేదీన జరిగే స్థానిక ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన అభ్యర్థులను, నిజాయతీ పరులను గెలిపించి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. మతాన్ని ఉపయోగించుకుని రాజకీయాలు చేయాలనుకునేవారిని ఓడించాలని కోరారు. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. సిపిఎం గెలిచిన చోట నిబద్ధతతో పనిచేస్తామని, సిపిఎం అధికారంలో ఉన్న సమయంలో కేరళ, బెంగాల్, త్రిపురలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి బలోపేతం చేశామని, బడ్జెట్లో 40 శాతం నిధులు పంచాయతీలే ఖర్చు చేసే విధంగా చూశారని తెలిపారు. ఇప్పటికీ కేరళ పంచాయతీ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో పంచాయతీరాజ్ బలమైన వ్యవస్థ అని, నిజాయితీ పరులను ఎన్నుకుంటే మార్పు వస్తుందని తెలిపారు. కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో గ్రామాల్లో సమస్యలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయని తెలిపారు. వాటికి రావాల్సిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని, సర్పంచులు కూడా నిధుల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ కేరళ నుండి అధికారిని తెచ్చుకుని పంచాయతీలను బలోపేతం చేస్తామని చెప్పి ఆ దిశగా మార్పు తీసుకురాలేకపోయారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సిపిఎం బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవడం ద్వారా నిజాయితీతో సుపరిపాలన అందిస్తారని అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి : వైవి
రాష్ట్రంలో గత మూడు, నాలుగు సంవత్సరాల కాలంగా రూ.4500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు డిమాండ్‌చేశారు. ఫీజులు చెల్లించలేదనే పేరుతో కళాశాలల యాజమాన్యం పిల్లలపై ఒత్తిడి తెస్తోందని, దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇటీవల ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందని తెలిపారు. వీటిపై విద్యార్థి సంఘాలు జరుపుతున్న ఆందోళనకు సిపిఎం తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే హాస్టళ్లలో సదుపాయాలపై ఇటీవల జరిపిన సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని, కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఎక్కువ మంది అనారోగ్యాల పాలవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన హాస్టళ్లను సందర్శించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. జనసేన కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్లు వసూలు చేశారనే వార్తలు వచ్చాయని, వాటిపై విచారణ జరిపి నిందితులను పట్టుకోవడంతోపాటు బాధితులకు డబ్బు రికవరీ చేయాలని కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండు చేశారు.
అత్యాచార నిందితులకు రక్షణ కల్పించే చర్యలు : రమాదేవి
గుజరాత్లో బిల్కిస్‌బానో కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడంతో ఆమె కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని, వారి నుండి అమెకు ప్రాణభయం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి అన్నారు. అత్యాచార నిందితులకు శిక్షలు వేయాల్సింది పోయి బిజెపి పాలనలో రక్షణ లభిస్తోందని పేర్కొన్నారు. ఒకవైపు సనాతన ధర్మం అంటూనే మహిళలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచార కూపాలకు తరలించడంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 32 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారని, ఎన్నికల ముందు చెప్పిన ప్రస్తుత డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ దానిపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. అచూకీ లేకుండా పోయిన మహిళలు ఏమయ్యారో తేల్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.









కామెంట్లు (0)