బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా మిట్టల్ పోర్టుకు అనుమతులివ్వొద్దు : వి.శ్రీనివాసరావు

1 గంట క్రితం

Do not grant permissions for the Mittal Port without considering public opinion: V. Srinivasa Rao.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బకొట్టే మిట్టల్ పోర్టుకు ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా అనుమతులివ్వొద్దు.. సిపిఐ(యం) నేత అప్పలరాజుపై గృహ నిర్బంధాన్ని ఎత్తివేయాలి అని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ప్రతిపాదించిన గ్రీన్‌పీల్డ్ క్యాప్టివ్ పోర్టు ప్రాంతంలో సిపిఐ(యం) బృందం పర్యటించిన వెంటనే రైతు సంఘం జిల్లా కార్యదర్శి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజును ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళనీయకుండా మూడు రోజుల ముందే పోలీసులు గృహ నిర్భంధం చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదన్నారు. ఎం.అప్పలరాజు పై వెంటనే గృహ నిర్భందం ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజాభిప్రాయాలను స్వేచ్ఛగా తెలుసుకోవడం తప్ప, పోలీసుల నిర్బంధాల మధ్య తంతుగా నిర్వహించడం కాదు అని స్పష్టం చేశారు. ప్రజలు తమ అభ్యంతరాలను వెల్లడించకుండా అడ్డుకోవడం, ప్రజల పక్షాన నిలిచే నాయకులను గృహనిర్బంధంలో ఉంచడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనన్నారు. మిట్టల్ పోర్టు నిర్మాణంతో సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల ఉపాధికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. మత్స్యకారులు తమ జీవనోపాధి, చేపల వేటకు ఎదురయ్యే ఇబ్బందులు, తీరప్రాంత పర్యావరణంపై పడే ప్రభావాల గురించి ఇఐఎ రిపోర్టులో ఎక్కడా ప్రస్తావించలేదు అని చెప్పారు. పోర్టు నిర్మాణం జరిగితే 3 కిలోమీటర్ల వరకు తీర ప్రభావం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారని వివరించారు. అభివృద్ధి పేరుతో తరతరాలుగా సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలను బుగ్గిపాలు చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. గతంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి ఇచ్చిన హామీల్లో అనేకం అమలుకాలేదనీ, ఇప్పుడు మరో ప్రాజెక్టుతో ప్రజలకు కొత్త సమస్యలు సృష్టించడం తగదు అని అన్నారు. పోర్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ఇఐఎ లోపాలున్నాయని, ప్రభావిత గ్రామాల వాస్తవ పరిస్థితులు, మత్స్యకారుల జీవనోపాధి సమస్యలు సమగ్రంగా ప్రతిబింబించేలా నివేదికను సరిదిద్ది ప్రజలకు పూర్తి సమాచారం అందించి వారి ఆమోదంతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరారు. ఎం.అప్పలరాజుపై విధించిన గృహనిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలన్నారు. అక్టోబర్ 15న జరగనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రాజకీయ పార్టీల నాయకులను, ప్రజలను స్వచ్చందంగా అనుమతించాలని కోరారు. ఎలాంటి పోలీసు ఆంక్షలు లేకుండా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ కల్పించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
cpim letter


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్