ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ మెహర్బానీ కోసం విద్యార్థుల్ని బలిచేయొద్దు : సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ

1 రోజు క్రితం

Do not sacrifice students to curry favor with Modi: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 02:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : ఆగష్టు 1వ తేదీ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పేందుకు గోదావరి, ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో అన్ని స్కూళ్ళకు 2 రోజులు సెలవులు ప్రకటించి వేలాదిమంది విద్యార్థులను తరలించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనికి సంబంధించి శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని కోసం విద్యార్థులను, పిల్లలను ఇబ్బందులపాలు చేయడం తగదన్నారు. ధింసా నృత్యం పేరుతో ఆదివాసీ బాలికలను తరలించారని, ఆర్టీసి బస్సులన్నీ ఈ పనికి కేటాయించడంతో ప్రజలు కూడా రవాణాకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పైగా గత రెండు మాసాలుగా విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసిన పాలకులకు ఇలా అట్టహాసంగా స్వాగతం చెప్పడం యువతను అవమానించడమేనన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తెచ్చిన విద్యార్థినీ, విద్యార్థులు ఆహారం, మంచినీళ్ళ కోసం కూడా గురువారం నాడు తీవ్రంగా ఇబ్బందులు పడినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. జూలై 31, ఆగష్టు 1 తేదీలలో వివిధ పాఠశాలలు, కాలేజీల వాహనాలను సైతం ప్రభుత్వమే తీసుకున్నందున ఆయా విద్యాసంస్థలకు అనధికారికంగా సెలవులు ప్రకటించారని, కొన్ని విద్యాసంస్థల నుండి పిల్లలను కూడా సభకు తరలిస్తున్నారని చెప్పారు. గతంలో యోగా పేరుతో ఇలాగే విశాఖకు తరలించారని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలన్నింటి మూలంగా విద్యార్థులు తమ చదువును నష్టపోతున్నారనీ, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. విద్యార్థులు, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, వందలకోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం గర్హనీయమన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయివేటు యాజమాన్యంలోనిదని, దాని ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ప్రణాళికలు రచించి అందుకోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అధికార దుర్వినియోగం అవుతుందని స్పష్టం చేశారు. అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పదుల సంఖ్యలో ఉన్నతాధికారులను, వందల సంఖ్యలో ఉద్యోగులను ఆ ప్రయివేటు కార్యక్రమానికి తరలించడం ప్రజలకు అసౌకర్యంగా మారిందన్నారు. ప్రధాని మెప్పుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడడం అభ్యంతరకరమని ధ్వజమెత్తారు. సంవత్సరానికి రెండు, మూడు సార్లు ఏదో ఒక ప్రాంతానికి ప్రధానిని ఆహ్వానించి తిరునాళ్ళ మాదిరిగా ప్రజాధనంతో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గానీ, ప్రధాని మాత్రం ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. జిఒ 3 రద్దు, 1/70ని బలహీనపర్చడం సహా ఆదివాసీ యువత భవిష్యత్తును దెబ్బతీస్తూ వారినే రాజకీయ సాధనంగా మార్చడం తగదు అని చెప్పారు. ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సీ ఊసు లేదని అన్నారు. యువతీ, యువకులు ఆశగా ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదా ఊసే మర్చిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విభజన హామీలు, ఉన్నతస్థాయి విద్య, వైద్య, పరిశోధనా సంస్థల ఏర్పాటు, అభివృద్ధి గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు రోడ్డెకుతున్నా ప్రధానికి, ముఖ్యమంత్రికి పట్టలేదు అని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని తెలిపారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత కాగా, అమరావతి నిర్మాణానికి అప్పులు ఇప్పిస్తామని కేంద్రం చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎంతమాత్రమూ నెరవేర్చని ప్రధాని పర్యటనల కోసం విద్యార్థినీ, విద్యార్థులను, అధికార యంత్రాంగాన్ని ఇబ్బందులపాలు చేయడం, కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేయడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నదని, ఇలాంటి ఆర్భాటపు కార్యక్రమాలకు వెంటనే స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

cpim


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్