విజయవాడ : "నవంబర్ 26 నుండి డిసెంబర్ 2 వరకు మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని సిపిఐ (యం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ భవనంలో సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ .... ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ రాజకీయ విధానాలు ఉంటాయన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరగడానికి, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజలు గట్టిగా నిలబడాలని కోరారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి పోరాడే వారికి ఓట్లు వేసి ఎన్నుకోవాలన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలనైనా స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేటట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నదన్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తటస్థంగా ఉండి స్వేచ్ఛగా, శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు తోడ్పడాలని వి.శ్రీనివాసరావు కోరారు.
విభజనానంతరం రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు పంచాయతీ వ్యవస్థకు నిధులు, విధులు బదలాయించకుండా నీరుగార్చాయని శ్రీనివాసరావు విమర్శించారు. పెత్తనమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే కేంద్రీకరించుకున్నాయన్నారు. ఊళ్ళో వీధి లైట్లకు కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుస్థితిలో పంచాయతీలున్నాయన్నారు. ఇసుక, మైనింగ్, ఎంటర్టైన్మెంట్, షాప్స్ వగైరా పన్నుల్లో పంచాయతీల వాటా ఇవ్వడం లేదనీ, పైగా ఆస్తి, నీళ్ళు, చెత్తపన్నులను పెంచి భారాలు మోపారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఆస్తులను ప్రయివేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. నీళ్ళ పంపులకు మీటర్లు బిగిస్తామంటున్నారని, ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయని కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదని మండిపడ్డారు. ఆస్తి పన్ను పెరగడం వల్ల ప్రజలపై పడే భారాల గురించి కించిత్తు కూడా వారికి విచారం లేదని, పైగా ఆదాయం అంతా వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీ డబ్బులు డ్రా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలని, సర్పంచ్ల కాలమంతా ఆఫీసుల చుట్టూ తిరగడానికే సరిపోయిందని, చివరికి సంఘాలు పెట్టుకొని పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారాలు మాత్రమే పెంచి సౌకర్యాలు కల్పించని వారు మరలా ఏ పేరుతో వచ్చినా ప్రజలు అధికారం అప్పజెప్పకుండా తిరస్కరించాలని వి.శ్రీనివాసరావు ఉద్ఘాటించారు.
సిపిఐ(యం), వామపక్షాలు రాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయాత్మక స్థానంలో లేనప్పటికీ ఉన్న పరిమితులలో పంచాయతీల అధికారం కోసం పోరాడాయని శ్రీనివాసరావు తెలిపారు. సిపిఐ (యం) గెలిచిన చోట అవినీతి జరగకుండా ప్రజల సొమ్ము ప్రజల కోసమే నిజాయితీగా ఖర్చుపెట్టిందని స్పష్టం చేశారు. హామీలు ఇచ్చిన మేరకు గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుందని చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి తప్పుడు పద్ధతులు అనుసరించలేదని అన్నారు. ''డబ్బులు పంచలేదు. ప్రలోభాలు పెట్టలేదు. అబద్దపు వాగ్దానాలు చేయలేదు. మోసపు మాటలు చెప్పలేదు. వీటివల్ల తాత్కాలికంగా పదవులు రాకపోయినా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా సమాజ అభివృద్ధికి సిపిఐ (యం) తోడ్పడుతోంది`` అని అన్నారు. అలాంటి వ్యక్తులు గెలిస్తేనే ప్రజలకు, గ్రామాలకు మేలు జరుగుతుందన్నారు. వామపక్షాలు బలంగా ఉన్న కేరళ, బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోనే స్థానిక సంస్థలు బలంగా ఉన్నాయని తెలిపారు. మన రాష్ట్రంలోని పార్టీల్లాగా పార్టీ నాయకుల వారసులు అక్కడ రాలేదని చెప్పారు. ప్రజలు, పోరాటాల్లో నుండే నాయకులు పుట్టుకొచ్చారన్నారు. సామాన్య కుటుంబాల్లో నుండి స్థానిక సంస్థలకు ఎన్నికయ్యారని తెలిపారు. కేరళలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు స్థానిక సంస్థల ద్వారానే ఖర్చవుతున్నాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ సభల ద్వారా నిర్ణయించుకుంటున్నారని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తికనుగుణంగా పంచాయతీలు పూర్తి అధికారాలతో నడుస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుచిత జోక్యం ఉండదు అని స్పష్టం చేశారు. అందువల్లనే ఎల్డీఎఫ్ పాలనలో కేరళ పంచాయతీ రాజ్ వ్యవస్థ దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచిందని, ఇలాంటి వ్యవస్థ కోసం మన రాష్ట్రంలోనూ పోరాడాలని పిలుపునిచ్చారు. అందుకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలు వారి పంచాయతీల్లో పోటీ చేస్తున్న సిపిఐ (యం) అభ్యర్థిని బలపరిచి వారికి ఓటేసి గెలిపించాలని కోరారు. అవినీతిపరులు, అక్రమాలకు పాల్పడేవారిని, ప్రజల సొమ్మును కొల్లగొట్టేవారిని పంచాయతీ సర్పంచ్‌లుగా, సభ్యులుగా ఎన్నుకోవద్దని సిపిఐ (యం) విజ్ఞప్తి చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.








కామెంట్లు (0)