సాహితీ స్రవంతి, ఎంబీవీకే విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం ఆడిటోరియంలో శనివారం ప్రారంభమైన సాహిత్య సమ్మేళనం ఆద్యంతం ఉత్తేజపూరితంగా, స్ఫూర్తిదాయకంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఎంబీవీకే విజ్ఞానకేంద్రం బయట ఏర్పాటు చేసిన అభ్యుదయ సాహితీవేత్తల పోస్టర్లు, పుస్తకాల ప్రదర్శన, సెల్ఫీ స్టాండ్ కవులు, రచయితలను ఆకట్టుకున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభ సభ మొదలై, రాత్రి 8.20 గంటలకు 'సృజనకారుల స్వరం' సెషన్ ముగిసే వరకు ప్రతినిధులు క్రమశిక్షణతో వక్తల ప్రసంగాలు విన్నారు. ఉత్తేజకరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు హర్షధ్వానాలతో స్పందించారు. కవులు, రచయితలు అనధికార శాసనకర్తలని, సమాజంలోని మంచి-చెడ్డలను వందలాది ఏళ్లుగా ప్రస్తావిస్తూనే ఉన్నారని వక్తలు పేర్కొన్నారు. చారిత్రకంగా అనేక ఉదాహరణలను, సందర్భాలను ప్రస్తావించారు. ఏ కాలంలో నివసించే కవి, రచయిత ఆ కాలానికి సంబంధించిన స్పృహతో తమ బాధ్యతను నెరవేర్చాలని అన్నారు.
ప్రారంభ సభలో రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, తెలకపల్లి రవి మాట్లాడుతూ రెండు రోజుల సమ్మేళనానికి ఒక చర్చను, ఉద్దేశాన్ని ప్రతిపాదించారు. తర్వాత జరిగిన మొదటి సెషన్‌లో 'కవిత్వం: వస్తు-శిల్పాలు, వివిధ ధోరణులు' అంశంపై మాట్లాడిన గుంటూరు లక్ష్మీనరసయ్య, డాక్టర్ కోయి కోటేశ్వరరావు ఏ కాలంలో కవిత్వం ఎలా వచ్చిందో, సాధారణ వస్తువులు కూడా కవిత్వంగా మారాక ఎంత గొప్పగా ధ్వనించాయో వివరించారు. రెండో సెషన్‌లో 'సాహిత్య చరిత్ర – దృక్పథాలు' అంశంపై తెలకపల్లి రవి మాట్లాడుతూ, ఏయే కాలాల్లో ప్రజా కవిత్వం ఎలా విస్తరించిందో, ఎలాంటి పునాదులు నిర్మించిందో వివరించారు. 'ప్రపంచీకరణ ప్రతిఘటన కవిత్వం' గురించి పవన్ కుమార్ సోదాహరణంగా మాట్లాడారు. జీవితాన్ని విధ్వంసం చేసే ప్రపంచీకరణపై మొదటి నుంచీ తెలుగు కవులు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారని చెప్పారు.
స్ఫూర్తిదాయకంగా సృజనకారుల స్వరం
మూడో సెషన్‌లో 'సృజనకారుల స్వరం' కార్యక్రమంలో 14 మంది కవులు, రచయితలు తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు. సత్యాజీ, శాంతిశ్రీ సమన్వయం చేశారు. తాము చూసిన జీవితం, ఎదుర్కొన్న సంఘర్షణలే తమ కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్మించాయని సృజనకారులు పేర్కొన్నారు. తమవైన అనుభవాలను వివరించారు. సంఘర్షణ, ఆవేదన లేనిదే మంచి రచన రాదని చెప్పారు. తాము కాలక్షేపం కోసం రాయడం లేదని, రాయలేనితనంలోంచే రాస్తున్నామని సుంకర గోపాల్, తంగిరాల సోనీ, వైష్ణవి శ్రీ, సాంబమూర్తి లండా తదితరులు పేర్కొన్నారు. సమాజం గురించి రాసే కవిత్వం తమకు వ్యక్తిగతంగా గొప్ప ఊరటను, బాధ నుంచి విముక్తిని కూడా ఇస్తుందని కవి దాసు, సిరికి స్వామినాయుడు అన్నారు. ఆదివాసీ జీవితాలు ఇప్పటికీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, వాటిని అనుభవిస్తూ, చూస్తూ వాస్తవిక జీవితం నుంచే తాను రాస్తున్నట్టు మల్లిపురం జగదీష్ చెప్పారు. కవికి, రచయితకు స్పష్టమైన దృక్పథం ఉండాలని, ఆ దిశగా పరిణామం చెందాలే తప్ప వెనక్కి వెళ్లకూడదని శ్రీరామ్ పుప్పాల, నాస్తిక్ అన్నారు. ఇంకా చింతా అప్పలనాయుడు, సిద్ధార్థ, కంచరాన భుజంగరావు, పెళ్లూరు సునీల్ తమ అనుభవాలను వివరించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సెషన్ సభికులకు అనేక అనుభవాలను పరిచయం చేసింది. వివిధ రూపాల్లో, వివిధ కోణాల్లో వ్యక్తమవుతున్న నిరసన, ఆర్తి ఐక్యశక్తిగా మారాలని, సాహిత్యకారులు ఏకమై ఉమ్మడి ప్రతిఘటన చూపాల్సిన చారిత్రక సందర్భంలో మనం ఉన్నామని ఈ సెషన్‌కు సమన్వయం వహించిన సత్యాజీ అన్నారు. ఈ సమ్మేళనం ఆ దిశగా ప్రేరణను, స్ఫూర్తిని ఇస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.
సమ్మేళనంలో నేడు
ఆదివారం ఉదయం 9 గంటలకు కథారచనపై నాలుగో సెషన్ ప్రారంభమవుతుంది. ఈ సెషన్‌లో అట్టాడ అప్పలనాయుడు, మహమ్మద్ ఖదీర్‌బాబు మాట్లాడతారు. కవులు, రచయితలకు అధ్యయనం ఆవశ్యకతపై ఆర్. సీతారాం ప్రసంగిస్తారు. ఐదో సెషన్‌గా 'సృజనకారుల స్వరం' కార్యక్రమం నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సాహిత్య ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అనంతరం ముగింపు సభ జరుగుతుంది.








కామెంట్‌లు (0)