mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాహితీ మదింపు - సమకాలీన చర్చలు

2 గంటల క్రితం

literature
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సమాజమూ, సాహిత్యమూ పరస్పర ప్రభావితాలు. మానవులు తమ స్వీయ అనుభవాల ద్వారా నిర్మించుకున్న సమాజంలో నివసిస్తూ, తాము మారుతూ సమాజాన్ని కూడా మారుస్తారు. ఇది నిరంతరం కొనసాగుతుంటుంది. సమకాలీన ప్రపంచం అనేక కొత్త లక్షణాలను సంతరించుకుంది. ఆధునిక సమాచార వ్యవస్థ ప్రపంచం మొత్తాన్ని కుగ్రామంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సమాచారం, సంస్కృతి, విజ్ఞానం పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం విస్తృతంగా పెరిగింది. మరోపక్క మానవ సంబంధాల అల్లకల్లోలం. గత సమాజపు దుర్మార్గమైన సాంఘిక అసమానతలు కొనసాగుతున్నాయి. వర్తమాన ప్రపంచంలో దేశాల మధ్య, దేశాలలోని ప్రజల మధ్య విపరీతంగా పెరిగిన ఆర్థిక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పేదరికం, నిరుద్యోగం, తీవ్రవాదం, మాదకద్రవ్యాల వినియోగం వంటి అనేక సమస్యలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి.

​తెలుగు సాహిత్యం నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. రచయితలు వర్తమాన సంక్లిష్ట సమాజాన్ని తమ రచనల్లో విశ్లేషించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటి అక్షరాస్యతా శాతంతో పోలిస్తే పుస్తకాలు చదివే వారి సంఖ్య నామమాత్రం అయ్యింది. కొత్తతరం ఇంగ్లీషు చదువుల బారిన పడి తెలుగు భాషకు దూరమవుతున్నారు. గ్రామీణ భారతం తన రూపు మార్చుకుని నగర భారతంగా మారింది. గ్రామాల నుండి చదువుకున్న తరం నగరబాట పట్టింది. గ్రామీణ సంస్కృతి స్థానంలో క్రమంగా నగర సంస్కృతి కోరలు చాస్తున్నది. గత సమాజపు భూస్వామ్య సంస్కృతి క్రమంగా పెట్టుబడిదారీ సంస్కృతి లక్షణాలను సంతరించుకుంటున్నది. పాత ఆచారాలు, మూఢనమ్మకాలు అనేక రూపాలలో కొనసాగుతూనే ఉన్నాయి. పెరిగిన ఆర్థిక వ్యత్యాసాలు మానవ సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. ఒకపక్క వేల కోట్లతో ఆడంబరంగా వివాహ ఉత్సవాలు జరుగుతున్నాయి. మరోపక్క పేదరికం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై హత్యాచారాలు వంటి సమస్యలు తీవ్రంగా ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి.

​ఈ నేపథ్యంలో సమకాలీన సమాజాన్ని రచయితలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? దీని మూలాలను, ప్రభావాలను నేటి రచనలు ప్రతిబింబిస్తున్నాయా? ఇంకా పాత భావాలను, సామాజిక వికాసానికి ఆటంకంగా ఉండే మూఢనమ్మకాల వంటివాటిని సదరు రచయిత తన రచనల్లో వ్యక్తం చేస్తున్నాడా? అలా చేస్తే అవి సమాజానికి మేలు చేస్తాయా? హాని చేస్తాయా? అంతిమంగా అవి సమాజాన్ని ఎటువంటి మార్పులకు గురిచేస్తాయి? రచయితలకు ఇటువంటి అంశాల పట్ల స్పష్టత ఉండాలి. తమ రచనల్లో ఉండాల్సిన అంశాలేమిటి? ఉండకూడని అంశాలేమిటి? అవి పాఠకులకు సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్నాయా? లేక నిరాశా, నిస్పృహల్లోకి నెట్టేస్తున్నాయా? అనే ఎరుక రచయితకు ఉండాలి. తన అక్షరాలు సమాజాన్ని మరింత ముందుకు పోయేందుకు దోహదం చేసేలా రచయితలు జాగ్రత్తలు తీసుకోవాలి. రచయితలు తమ రచనా ప్రస్థానంలో ఈ విషయాలన్నీ అవగతం చేసుకుంటారు. సాధన చేసే క్రమంలో తాము నమ్మిన భావాలను శక్తివంతంగా వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో సమకాలీన సమాజంలో రచయితల సమ్మేళనాలు, అప్పటికే వచ్చిన సాహిత్యం ఇవన్నీ ఆయా రచయితలను ప్రభావితం చేస్తాయి.

మన తెలుగు సాహిత్య క్షేత్రంలో ప్రస్తుతం అనేక సాహిత్య మథనాలు జరుగు తున్నాయి. అనేక రకాల ధోరణులు, సిద్ధాంతాలు, దృక్పథాలు విడివిడిగా తమ తమ వాదనలు, విశ్లేషణలు చేస్తూ సాగుతున్నాయి. అవన్నీ కూడా సమాజానికి మేలు చేసేవే. రచయితలకు కూడా ప్రయోజనాన్ని కలిగించేవే. వర్తమాన కాలపు పరిణామాలను రచయితలు తమ రచనల్లో ఎలా వ్యక్తం చేయాలి? అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందాలంటే సమాజంలో ఎటువంటి మార్పులు రావాలి? అనే ప్రశ్నను రచయితలు వేసుకుని తీరాలి. ఇటువంటి అంశాలను చర్చించే వేదికలు రచయితలకు ఎంతో ఉపయోగపడతాయి. లోతుగా ఆలోచించేలా చేస్తాయి. ఇటువంటి మరెన్నో అంశాలను సాహిత్య వేదికలు చర్చించాల్సి ఉంది. అందుకోసం జూలై 11, 12 తేదీలలో శని, ఆదివారాలలో రెండు రోజుల పాటు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి సంయుక్తంగా విజయవాడలో సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సాహిత్య సమ్మేళనానికి సాహిత్యరంగంలో అనుభవజ్ఞులతో పాటు ముఖ్యంగా యువ రచయితలు ఎక్కువ మంది భాగస్వాములవుతున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ రచయితలు, కవులు నడిచిన సాహిత్య ప్రస్థానంలోని అనుభవాలను వివరిస్తారు. ఇప్పుడు రాస్తున్న తరం కూడా తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనానికి యువ కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రచయితలు ఎందుకు రాస్తున్నారు? రచయితల లక్ష్యాలేమిటి? ఇకముందు ఏం రాయాలనుకుంటున్నారు? వంటి అంశాలపై చర్చా కార్యక్రమం ఉంటుంది. ఆసక్తి కలవారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


- వొరప్రసాద్

సాహిత్య సమ్మేళనం నిర్వహణా కమిటీ

94900 99059


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్