విజయవాడ వాసులకు మరోసారి "సురభి" ప్రదర్శనలను తనివితీరా ఆనందించే అవకాశం కలిగింది. 2026 జూన్ 26–30 తేదీల్లో స్థానిక దుర్గాపురంలోని పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య, సంగీత కళాశాల ఆవరణలో "సురభి" నాటక ప్రదర్శనలు జరిగాయి. మరో ప్రదర్శన రాజధాని ప్రాంతంలోని వెంకటేశ్వరస్వామి ప్రాంగణంలో జరిగింది. ఇటీవల కాలంలో నాటకాలకు, మరీ ముఖ్యంగా పౌరాణిక ప్రదర్శనలకు ప్రేక్షకాదరణ కొరవడుతోందన్న ఓ బలమైన అభిప్రాయం వినిపిస్తుంటుంది. దాన్ని తోసిరాజన్నాయి ఈ ప్రదర్శనలు. సీనియర్ కళాకారుడు, దర్శకుడు, పలు అవార్డుల గ్రహీత ఆర్. వేణుగోపాలరావు నేతృత్వంలోని శ్రీ వినాయక నాట్యమండలి సంస్థ ఆధ్వర్యంలో మాయాబజార్, భక్త ప్రహ్లాద, శ్రీనివాస కల్యాణం, భూ కైలాస్ నాటకాలను ప్రదర్శించారు. ప్రేక్షకాదరణ ఉండడంతో సాంస్కృతిక శాఖ వారు మాయాబజార్ నాటక ప్రదర్శనకు మళ్లీ అవకాశం కల్పించారు.
సాధారణంగా సురభి సంస్థలు పౌరాణిక, ఇతిహాస నాటకాలనే ప్రదర్శిస్తాయి. ఇతివృత్తం దాదాపు అందరికీ పూర్తిగా తెలుసు. అయినా, ప్రత్యేకించి సురభి ప్రదర్శనల పట్ల ఆదరణకు ఓ అతి ముఖ్య కారణం వారు ఉపయోగించే "ట్రిక్స్". సన్నివేశం, సందర్భాన్ని బట్టి మాయాబజార్‌లో పక్షులు, జింకలు తారట్లాడతాయి. ఉద్యానవనంలో వాటర్ ఫౌంటైన్ ముచ్చట అనిపిస్తుంది. నారదుడు గగనతలం నుంచి భువికి దిగడాన్ని కళ్లార్పకుండా చూస్తాం. సుభద్ర, అభిమన్యులు ద్వైతవనానికి రథంలో పయనమై వెళ్లడం వేదిక మీదనే చూడొచ్చు. ఘటోత్కచుడి విన్యాసాలకు కొదవే ఉండదు. శయనించిన తల్పం చూస్తుంటే కళ్లార్పడం మానేస్తాం. లడ్డూలు గుటకాయ స్వాహా దృశ్యం ఎంత మెప్పించిందో! సూర్యోదయం, ఘటోత్కచుడు–అభిమన్యుల యుద్ధం, గగనంలో బాణం, గద ఢీకొనడం, మంటలు చెలరేగడం, మంటల్ని వర్షం ఆర్పడం మొదలగు ట్రిక్స్ ఆకట్టుకున్నాయి. ఒకే పాటలో శశిరేఖ, అభిమన్యుడు వేరువేరుగా విరహగీతం పాడుకోవడం ఏకకాలంలో (లైట్స్ ఆఫ్, ఆన్‌లో) చూపడం బాగుంటుంది. శశిరేఖను పడుకున్న మంచం సహా గగనతలం మీదుగా హిడింబి ఆశ్రమానికి తరలించడం నప్పింది. అలాగే, శ్రీనివాస కల్యాణం నాటకం కూడా వివిధ ఘట్టాలతో ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి నల్ల ఆవు (బ్రహ్మ) క్షీరమివ్వడం... ఓ... సూపర్. భక్త ప్రహ్లాదలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో ట్రిక్స్ ప్రారంభమవుతాయి. తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విష్ణు మహిమల్ని వింటూ ఊ కొట్టే సన్నివేశాన్ని మైమరచి ఆనందిస్తాం. ప్రహ్లాదుడికి ఉరిని తప్పించడం, సముద్రంలో పడేస్తే విష్ణువు పైకి తీసుకొచ్చే దృశ్యం, సర్పంతో కరిపించే యత్నాన్ని గరుత్మంతుడు వమ్ము చేయడం వంటి ట్రిక్స్ ఆకర్షిస్తాయి. ప్రహ్లాదుడిగా చేసిన చిన్నారుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పోర్షన్ కోసం తడుముకోవడం లేదు. అతి చిన్న వయసులో సైతం వారు అంతగా పాత్రలో ఒదిగిపోయారంటే ఎంతైనా హర్షణీయమే. భూకైలాస్‌లో కూడా సైకత లింగం (సముద్రం ఒడ్డున ఇసుకతో చేసిన శివలింగం), సముద్ర అలలు చెరిపేసి తనలో కలుపుకోవడం, రావణాసురుడు ఘోర తపస్సులో ఉన్నప్పుడు గడ్డం, పుట్ట పెరగడం, సర్పాలు తిరగడం, సముద్రం ఒడ్డున కూరుకుపోయిన శివలింగాన్ని లేపే కొద్దీ పెద్దదవడం సహా అనేక ఘట్టాలు ఆకట్టుకుంటాయి. అందుకే ట్రిక్స్ (వైర్ వర్క్)కు పెట్టింది పేరు "సురభి".
అయితే, ఇంతటి ఆకర్షణలు, మైమరిపింపులూ ఉన్న ప్రదర్శనల్లో అపశృతులు దొర్లటం పంటికింద రాయిలా ఉంటుంది. లంకేశ్వరుడి ప్రవేశానికి ముందు వరకూ కళ్లార్పకుండా ఆసక్తిగా చూస్తుంటే, రావణుడి ప్రవేశాన్ని ప్రకటించే బంట్లుగా ఎవరెవరినో వేదికెక్కించడం ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది. ఉన్న ఒకటీ అరా డైలాగ్స్ కూడా వారు సరిగ్గా పలకలేకపోయారు. అమ్మలక్కలు ఐదారుగురు కూడినప్పుడు వేదిక మీద ఎవరు ఏం చెబుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రేక్షకులకు అర్థం కాలేదు. నాటకం అంటే పాత్రధారులందరూ తమ తమ పాత్రలకు (పూర్తి) న్యాయం చేయాల్సిందే. కొందరు, లేదా ఎక్కువ మంది బాగానే చేశారు అని సంతృప్తి చెందలేరు ప్రేక్షకులు. దినకర: శ్రీకృష్ణ (మాయాబజార్), శ్రీనివాసుడు (శ్రీనివాస కల్యాణం), హిరణ్యకశిపుడు (భక్త ప్రహ్లాద), రావణబ్రహ్మ (భూకైలాస్); శుభకర (అవే నాటకాల్లో వరుసగా అభిమన్యుడు, భృగుమహర్షి, ఇంద్రుడు, విరూపాక్షుడు), శాంతి (సుభద్ర, వకుళాదేవి, లక్ష్మి, లీలావతి, పార్వతి), పరిమళ: నారదుడు, మంజుమోహిని (శశిరేఖ, పద్మావతి, రంభ), శివశంకర్ (ఘటోత్కచుడు, ఆకాశరాజు, నరసింహ, శివుడు), మానసవీణ (సత్యభామ, భూదేవి, ఊర్వశి, మండోదరి) తదితరుల అభినయ కౌశలాన్ని మెచ్చుకుతీరాల్సిందే!
వైర్ వర్క్, ముఖ్యపాత్రల విషయంలో మాత్రమే చిత్తశుద్ధిగా ఉంటే చాలదు. అన్ని పాత్రల్నీ కచ్చితంగా పట్టించుకోవాల్సిందే. వాస్తవానికి సురభి సంస్థలు, మరీ ముఖ్యంగా ఈ వేణుగోపాలరావు సంస్థలో అన్ని వయసుల ఆడ, మగ కళాకారులకు కొదవేలేదు. మొత్తం సమాజంలో 45 మంది వరకూ ఉన్నారు. ఆయన ఒక్కరి ఉమ్మడి కుటుంబంలోనే 28 మంది. ఏ పాత్రకైనా తగిన వారు రెడీగా, గ్యారెంటీగా ఉంటారు. నాన్-సీరియస్‌నెస్ జాడ్యం కొనసాగడం ప్రేక్షకుల్ని, మరీ ముఖ్యంగా "సురభి" ప్రేమికుల్ని ఎంతైనా వేధిస్తుంది. పర్ఫెక్షన్ విషయంలో కూడా సురభీయులు పట్టించుకోవాలి. ప్రదర్శన బాగున్నప్పుడు ప్రేక్షకులు మరింతగా ఆనందిస్తారు. రోజూ వచ్చే వారు మరి కొంతమందిని కూడా తీసుకొస్తారు. ప్రధాన పాత్రల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో, వేదికెక్కే ప్రతి పాత్ర పట్ల కూడా అన్ని విషయాల్లో అంతే శ్రద్ధ తీసుకోవాలి. సన్నివేశానికి తగునా అనే విషయాన్ని పట్టించుకోకుండా పిల్లల్ని సైతం మేకప్, అరకొర డ్రెస్ చేసి వేదికెక్కించడం భావ్యంగా లేదు. ప్రధాన పాత్రధారులు కూడా పద్యం, పాట విషయంలో మరింత మెరుగవ్వాల్సిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఏమైనా నాటకాన్ని బతికించుకోవాలి. "సురభి"ని కాపాడుకోవాలి, సాకాలి. ఇలాంటి విషయాల్లో సమాజం మరింత సానుకూలంగా స్పందించాలి. ప్రధానంగా ప్రభుత్వాలు మరింతగా పట్టించుకోవాలి.
– జి.వి. రంగారెడ్డి, సీనియర్ విశ్లేషకులు
99126 15747







కామెంట్‌లు (0)