సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మధురకవి మల్లవరపు జాన్

1 గంట క్రితం

jhon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 06:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

"సృష్టి ఎప్పుడూ మట్టినుంచే పుడుతుంది. మట్టినారాధించే రైతు కూలీలే నిజమైన సృష్టికర్తలు. ప్రతిభ మట్టి వంటిది. పాండిత్యం కార్ఖానా వంటిది. ఎప్పటికప్పుడు సహజమైన ప్రతిభను చంపేస్తూ, కార్ఖానాలను పోషించుకుంటూ వచ్చారు సంప్రదాయకులు, పండితులు.” (పాలేరు నుంచి పద్మశ్రీ వరకు, పేజీ 607) అంటూ బోయి భీమన్న సాహిత్య మూలాలను గురించి శాస్త్రీయంగా సూత్రీకరించాడు. రైతు కూలీలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన కవులు అనుభవ జనితమైన స్పృహతో సజీవ కవిత్వాన్ని సృష్టించారు. ఆ కోవకు చెందిన కవిగా, ‘మధురకవి’గా ప్రసిద్ధి చెందిన మల్లవరపు జాన్ నాలుగు దశాబ్దాల పాటు పద్యకవిత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. మహాకవి జాషువా మార్గంలో పయనించిన కవుల్లో ఆయన ఒకరు.

​మల్లవరపు దావీదు, రత్నమ్మ దంపతులకు 1927 జనవరి 22న ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జాన్ జన్మించాడు. అంటరానితనం, పేదరికం కారణంగా అనేక ప్రతికూల పరిస్థితులను, అవమానాలను ఎదుర్కొన్నాడు. కఠోర శ్రమతో సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి తెలుగు పండితునిగా ఎదిగాడు. “తేనెలూరు తెలుగు తీరు కనుంగొన కోర్కె వొడమువారు” అంటూ తుమ్మల సీతారామమూర్తి మల్లవరపు జాన్ కావ్యాలను పరిశీలించాలని భాషాభిమానులకు సూచించాడు. మల్లవరపు జాన్ పద్యం మాధుర్యగుణ భూయిష్ఠమైనదని దాశరథి పేర్కొన్నాడు.

“పనులు జేయకుండ పంచభక్ష్యములను

తేరగా భుజించి తిరుగువారు

కష్టజీవి సొమ్ము కాజేయు గజదొంగలు” అని అభ్యుదయ కవిలా జాన్ తీర్పు చెప్పాడు. “సామ్రాజ్యవాదుల సాహచర్యంబున, స్వార్థ జీవనుల హస్తముల జిక్కి” మాతృదేశం విలవిల్లాడుతుందని అన్నా, “కుల పటాటోపలకుల ముందు కళల కెట్లు విలువ గల్గు” అని ప్రశ్నించినా, “పురుషుల్ జేసిన పుణ్యమెట్టిదియె యెపుడున్ మానభంగాలకున్ ఎగురియైపోయిన జాడలేదు” అని ఆవేదన వ్యక్తం చేసినా, జాన్ మానవతా దృక్పథాన్నే ప్రతిబింబించాడు. ఛందోబందోబస్తుల రహదారుల్లో సునాయాసంగా ప్రయాణం చేస్తూనే, ప్రజా సమస్యలకు స్పందిస్తూ జనరంజకమైన పద్యకవిత్వాన్ని సృష్టించాడు.

​ప్రారంభ దశలో మల్లవరపు జాన్ ముత్యాల సరాల శైలిలో గేయకవిత్వం రాశాడు. 1967లోనే తన జీవన ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ‘కొండడు’ పేరుతో లఘుకావ్యం వెలువరించాడు. ఒంగోలులోని శఠగోపనాచార్యుని సహకారంతో సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి పద్యరచన వైపు దృష్టి సారించాడు. క్రైస్తవ కథాంశం నేపథ్యంలో జాన్ రాసిన ‘సాంసన్ డెలీలా’ (1967) పద్యనాటకం ఆయనకు గుర్తింపు తెచ్చింది. ‘విశ్వప్రకాశం’ (1973), ‘అతుకుల బ్రతుకులు’ (1981), ‘కాంతిరేఖలు’ (1987), ‘సూక్తి శతకం’, ‘సరస వినోదిని’ (1991), ‘భావ విపంచి’ (1996), ‘పుణ్య పురుషుడు’ (2005) వంటి ఖండకావ్యాలతో మల్లవరపు జాన్ తెలుగు సాహిత్యంలో పద్యకవిగా తన స్థానాన్ని స్థిరపరచుకున్నాడు.

తన కాలం నాటి సామాజిక ఉద్యమాలతో జాన్ కవికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, వాటి మౌలిక ప్రశ్నలు ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. సాధారణంగా పద్యకవుల్లో అరుదుగా కనిపించే అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహన కూడా ఆయన కవిత్వంలో దర్శనమిస్తుంది. 'కువైట్'ను కబళించిన అమెరికా ఆధిపత్యం, గల్ఫ్ యుద్ధాల దుష్ప్రభావం వంటి అంశాలను తన ‘సూక్తి శతకం’లో ప్రస్తావించాడు.

“సాకు మోపి గర్వమున ‘నిరాకు’ ప్రజల

అసువులను దీయు నమెరికా నడ్డగించు

పరమ ధీరులు లేరా?” అని విశ్వ నాయకులను ప్రశ్నించాడు.

మహిళాభ్యుదయ చింతన కూడా జాన్ పద్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ‘స్త్రీ జనావేదన’ వంటి ఖండికల్లో స్త్రీల స్థితిగతులను ఆర్ద్రంగా చిత్రించి, మహిళా ప్రగతిని ఆకాంక్షించాడు. ప్రతి నిత్యం మానభంగాల పీడను ఆడవాళ్లకు ఎందుకు కల్పించావని బ్రహ్మను ప్రశ్నిస్తూ, ఈ విధమైన ‘నీచపు వికారాలను’ సత్యలోకంలో సాగిస్తే అక్కడివారు కూడా తిరగబడతారని హెచ్చరించాడు. భారతదేశంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న వరకట్న సమస్యను అర్థం చేసుకొని, దాని పర్యవసానాలను తన పద్యాల్లో విస్తృతంగా చర్చించాడు.

“పేచీలు బెట్టి కట్నము

దోచెడి నీచులను న దేశద్రోహుల క్రిందన్

పూచీలీయక జైలు పాలు’’ చేయాలని ప్రతిపాదించాడు. కట్నం కోసం వేధించే వారిని దేశద్రోహ నేరం కింద అరెస్టు చేయాలని సూచించాడు.

“పురుషులతో సమానంగా

సర్వకార్యములు నెరపిడి

శక్తియుక్తులు నేర్చిన” ఆధునిక స్త్రీలను అణచివేయడం సభ్యసమాజానికి సిగ్గుచేటని ఎలుగెత్తి చాటాడు. “లోకపరివర్తన దృక్పథమున్న గొప్ప సన్యాసి”, “మానవాభ్యుదయ ద్రష్ట” అని బుద్ధుడిని కీర్తించాడు. ‘విజ్ఞాన భాస్కరునిగా’, ‘ధర్మరహితమైన మనుస్మృతిని దగ్ధం చేసిన మహర్షిగా’ అంబేద్కర్‌ను అభివర్ణించాడు.​

జాన్ కవిత్వ స్వరూప స్వభావాలను నిశితంగా పరిశీలించినప్పుడు కవిగా ఆయన జాషువా అడుగుజాడల్లో నడిచినట్లు స్పష్టమవుతుంది. ఆయన కావ్యాలకు పీఠికలు రాసిన ప్రముఖ కవిపండితులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. "మీ ఝరీ కవితను గమనిస్తూ ఉంటే ఎంత ఆనందం కలిగిందో చెప్పనా? ఆత్మీయుడు జాషువా వచ్చి నా గుండెను తడుతున్నాడా అనిపించింది" అంటూ సి. నారాయణరెడ్డి ‘అతుకుల బ్రతుకులు’ కావ్యానికి ముందుమాట రాస్తూ జాషువా, జానుల రచనా సామ్యాన్ని ప్రస్తావించాడు. పద్యాన్ని వస్తుపరంగా ఆధునికం చేసిన వారిలో అగ్రగణ్యుడు జాషువా. "వీరిదీ అదే బాట, అదే మాట" అని డా. బేతవోలు రామబ్రహ్మం కూడా (‘భావ విపంచి’ ఉపశృతి) పేర్కొన్నాడు.

“హరిపదాల బుట్టి అరుగుదెంచిన గంగ

పాపజనుల శుద్ధి పరచుచుండ

అజుని పాదజనితులు స్పృశ్యులెట్లయిరి?” అని పౌరాణిక పద్ధతిలోనే ప్రశ్నించాడు. విష్ణు పాదాల నుంచి పుట్టిన గంగ పవిత్రమైనదైతే, బ్రహ్మ పాదాల నుంచి జనించినట్లు చెప్పబడుతున్న దళితులు అంటరానివారెందుకయ్యారని ప్రశ్నించాడు. సమాజ అభివృద్ధికి ఆటంకమైన అసమానతను విమర్శిస్తూనే, దళితుల్లోని అంతర్గత విభేదాలను కూడా జాన్ ఎత్తిచూపాడు.

“మాలయతడు, నేను మాదిగ కులజుడనను

భేదముండునంత దనక

కలిసి తిరగలేము కదా కులీనులతోడ

ఇంట గెలిచి రచ్చకేగుమయ్య” (విశ్వప్రకాశము)

అని పేర్కొన్నాడు. ఈ ఆలోచనలను ఆచరణాత్మకంగా నిజం చేయాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది.

“పరరాజన్యులు లేరు, నేడు ప్రజలే పాలించు రాజ్యంబులో,

తరుగే మున్నది? సర్వహక్కుల సమానత్వము నీ సొమ్మురా

తిరిపెమ్మె ఎత్తేదవేల? సంఘటిత శక్తిన్ జూపలే లెమ్ము,

నీ యరచేతన్ పరిపాలనా చరణ భాగ్యంబెన్నడో దోచె” (విశ్వప్రకాశము)

అంటూ దళితులకు సంఘటిత శక్తి అవసరాన్ని గుర్తుచేశాడు.

కులాధిపత్యం, పేదరికం, మద్యపానం, అధిక జనాభా, కుటుంబ నియంత్రణ, అవినీతి, లంచగొండితనం, సాంఘిక సంక్షేమం, వరకట్నం, స్త్రీల అణచివేత, దళితాభ్యుదయం, కులాంతర వివాహం, అవిద్య వంటి అనేక అంశాలను తడిమి, వాటి తీరుతెన్నులను చర్చించి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కవిత్వాన్ని సాధనంగా ఉపయోగించాడు. మల్లవరపు కవిత్వంలో భావపరమైన సమతౌల్యం, భాషాపరమైన సంయమనం కనిపిస్తాయి. సామాన్య మానవుడి వ్యవహారానికి దగ్గరగా తెలుగు పద్యాన్ని నడిపించిన కవిగా ఆయన నిలిచాడు. పండితుల మెప్పుకోసం కాకుండా, సమస్యలతో సతమతమవుతున్న సగటు మనిషిలో కనువిప్పు కలిగించాలనే సంకల్పంతో ప్రయోజనాత్మకమైన పద్యకవిత్వం రాశాడు.

“తెలుగు అధికారభాషయని తేల్చియు, బ్రహ్మరథమ్ము పట్టియున్

కులికిరిగాని, ఆచరణకున్ తలయొగ్గిరే” అని జాన్ కవి వేసిన ప్రశ్న అధికార భాష అమలులోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. సుతిమెత్తని ఎత్తిపొడుపు, మర్యాదపూర్వకమైన మందలింపు, ఆర్ద్రమైన ఆవేదన, సంభాషణాత్మకమైన పద్యధార వల్ల జాన్ కవిత్వం పాఠకులకు చేరువైంది. జాన్ పద్యం చిటారు కొమ్మన మిఠాయి పొట్లం లాంటిది కాదు; చౌరస్తాలోని చలివేంద్రంలో దొరికే చల్లని మంచినీరు వంటిది. అందుకే ఆయన కవిత్వంలో మధురత్వంతో పాటు సజీవత్వం కూడా కనిపిస్తుంది.

(జూలై 12న ఒంగోలులో మల్లవరపు జాన్ శతజయంతి సదస్సు జరుగుతుంది.)


- ఆచార్య కోయి కొటేశ్వరరావు

94404 80274​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్