జూలై 11, 12 తేదీలు శని, ఆదివారాల్లో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి, ఎంబీవీకే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం ఎంతో ప్రగతిశీల ధోరణిలో, చైతన్యవంతంగా సాగింది. ఈ రెండు రోజుల సాహిత్య సమ్మేళనం కేవలం కవిత్వం, కథ, సాహిత్య ప్రక్రియలపై చర్చలకే పరిమితం కాలేదు. సాహిత్యానికి సమాజంతో ఉన్న సంబంధం, రచయిత బాధ్యత, అధ్యయనం అవసరం, ప్రశ్నించే స్వభావం, సమకాలీన రాజకీయ–సామాజిక పరిణామాలపై రచయితలు తీసుకోవాల్సిన వైఖరి వంటి అనేక అంశాలను విస్తృతంగా చర్చకు తెచ్చింది. యువ రచయితలకు అనుభవజ్ఞులైన సాహితీవేత్తల ఆలోచనలు మార్గదర్శకంగా నిలవగా, 'సృజనకారుల స్వరం' కార్యక్రమం కొత్త తరపు రచయితల అనుభవాలను, ఆలోచనలను పరస్పరం పంచుకునే వేదికగా నిలిచింది. సాహిత్యం సమాజానికి దూరంగా ఉండకూడదని, ప్రశ్నించే స్వరాలను బలపరచాలని, విస్తృత అధ్యయనంతోనే మెరుగైన సృజన సాధ్యమవుతుందని దాదాపు అన్ని ప్రసంగాలు ఉద్ఘాటించాయి. సాహిత్యాన్ని ప్రజల జీవితాలతో ముడిపెట్టి, ప్రజాస్వామిక–ప్రగతిశీల విలువలను బలపరిచే దిశగా ఈ రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం సాగింది.
మొదటి రోజు ఉదయం ప్రారంభ సభకు సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి సభాధ్యక్షులుగా వ్యవహరించగా, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘ఇది చాలా కీలకమైన సందర్భం. ఆనాడు జాషువా గబ్బిలాన్ని కవితా వస్తువుగా స్వీకరిస్తే, ఇప్పుడు బొద్దింకలు తిరగబడుతున్న ఈ సందర్భంలో బొద్దింకలు, వాటి తిరుగుబాటు కవితా వస్తువులు కాబోతున్నాయి. ప్రశ్నించడాన్ని కూడా నియంత్రిస్తూ, ఏ ప్రశ్న వేయాలో కూడా పాలకులే చెప్పే స్థితి ఎదురవుతున్న ఈ సందర్భంలో ప్రశ్న, ప్రతిఘటన మరింత బలపడాల్సిన సమయం సమీపించింది’’ అని తెలకపల్లి రవి అన్నారు. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి తమ ప్రారంభోపన్యాసంలో సాహిత్యంలో భావవాద–భౌతికవాదాల మధ్య ఉండే వైరుధ్యాన్ని ఉదాహరణలతో సహా వివరించారు. ‘‘నన్నయ, తిక్కన, శ్రీనాథాది కవులు రాజాశ్రయాన్ని పొంది, ఆ రాజులకు ఇష్టమైన రచనలు చేశారు. ప్రజలను వాళ్లకు విధేయుల్ని చేశారు. కానీ పాల్కురికి సోమన, వేమన, అన్నమయ్య, పోతులూరి వీరబ్రహ్మం, గురజాడ వంటి కవుల్లో ఒక విధమైన తిరుగుబాటు, ప్రశ్నించడం కనిపిస్తుంది. చనిపోయిన పెద్దల పేరుతో కాకులకు పిండం పెట్టటాన్ని విమర్శించిన వేమన ‘పెంట దినెడు కాకి పితరుడెట్లాయెరా?’ అని కూడా ప్రశ్నిస్తాడు. అన్నమయ్య ‘తందనాన ఆహి! తందనాన భళా’ అనే కీర్తనలో ఈ ఎండ, వాన, గాలి అనేవి అన్ని ప్రాణుల మీదా ఒకేలా ప్రసరిస్తాయని, ప్రకృతి దృష్టిలో అందరూ సమానమే అంటూ నిష్కర్షగా చెబుతాడు. గురజాడ ‘మనిషి’ అనే గేయంలో, ‘మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మ్రొక్కుతు, మనిషంటే రాయి రప్పకన్న కనిష్ఠంగా చూస్తావేలా బేలా?’ అంటూ మనిషినే ప్రశ్నిస్తాడు. నేటి కవులు తమకు ముందున్న కవుల సాహిత్యాన్ని తప్పక అధ్యయనం చేయాలి. తద్వారా కవిత్వాన్ని మరింత అందంగా వ్యక్తీకరించవచ్చు. ఆయా కవులను మించిన శిల్పాన్ని మరింత అద్భుతంగా పోషించవచ్చంటూ వర్ధమాన కవులకు సూచనలు ఇచ్చారు రాచపాళెం.

కవిత్వ ప్రస్థానం
ఆ తరువాత జరిగిన సెషన్‌కు సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అధ్యక్షత వహించగా, గుంటూరు లక్ష్మీనరసయ్య, డాక్టర్ కోయి కోటేశ్వరరావు ముఖ్య ప్రసంగాలు చేశారు. గుంటూరు లక్ష్మీనరసయ్య ‘కవిత్వ నిర్మాణం’పై సోదాహరణంగా ప్రసంగం చేశారు. గొప్ప భావాలున్నంత మాత్రాన అది కవిత్వం కాదని, అది కవిత్వం కావాలంటే దాన్ని కవిత్వ మాధ్యమంలోకి తీసుకువెళ్లాలని, అప్పుడే అది కవిత్వమవుతుందని అన్నారు. ఆధునిక కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో కనిపించే విభిన్న అంశాలను సోదాహరణంగా వివరించారు. కవిత్వంలో తాను చెప్పాలనుకున్న విషయానికి తగిన ఒక నిదర్శనాన్ని చూపిస్తూ రాయడం వల్ల అది మంచి కవిత్వమవుతుందన్నారు. అందుకు శివసాగర్ కవిత్వాన్ని ఉదాహరించారు. ‘‘నువ్వు ఉద్యమం చేయాలన్నా, మంచి పని చేయాలంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని చెబితే అది కవిత్వం కాదు. ‘‘పులి గుహలోకి వెళ్లగలిగినవాడే పులి పిల్లను తేగలడు; వేయి కత్తి వేట్లకు దడవనివాడే రాజును పదవీభ్రష్టుణ్ణి చేయగలడు’’ అంటేనే అది మంచి కవిత్వమవుతుందని అన్నారు. డాక్టర్ కోయి కోటేశ్వరరావు ‘వర్తమాన సాహిత్యం – వివిధ వాదాలు’ అనే అంశంపై మాట్లాడారు. భారతీయ సాహిత్యంలో 30వ దశకాన్ని ‘హంగ్రీ థర్టీస్’ అన్నట్లే, 80వ దశకాన్ని ‘యాంగ్రీ ఎయిటీస్’ అనవచ్చని, ఈ దశకంలో ఆధునిక తెలుగు సాహిత్యం ఒక గుణాత్మకమైన మలుపు తీసుకుందని, అనేక అస్తిత్వ ఉద్యమాలకు కేంద్రబిందువైందని అన్నారు. అప్పటివరకు సాహిత్యానికి, కవిత్వానికి దూరం చేయబడ్డ స్త్రీలు, దళితులు, ముస్లింలు, బీసీలు కవిత్వంలోకి ప్రవేశించి తమ తమ బలమైన స్వరాలను వినిపించారని అన్నారు.
సాహిత్య గమనం
భోజనానంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు జరిగిన రెండో సెషన్‌కు చీకటి దివాకర్ అధ్యక్షత వహించగా, "సాహిత్య చరిత్ర – వివిధ దృక్పథాలు లేదా ధోరణులు" అనే అంశంపై శ్రీ తెలకపల్లి రవి ప్రసంగించారు. ఇప్పుడు కాషాయ ప్రభావం సాహిత్యంపై ప్రగాఢంగా పడబోతోందని, దాని నుంచి రక్షించుకోవాలని అన్నారు. రచనలు చేసేటప్పుడు కవులకు విశాల దృక్పథం కావాలని, సాహిత్య చరిత్రలో సామాజిక కోణం ఉండితీరాలని చెప్పారు. రచన సమాజం కోసమే గానీ, వ్యక్తుల కోసం, రాజకీయ నాయకుల కోసం కాదన్నారు. రాబోయే రోజుల్లో కొత్త గొంతుకలు రావడం అనివార్యమని, సమకాలీనతను అర్థం చేసుకుంటే తప్ప మంచి సాహిత్యం అలవడదని, సాహిత్యకారులు తమలో తాము పరిమితం కాకుండా విస్తృతపరచుకోవాలని, పాలకవర్గాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళుతున్నప్పుడు సాహిత్యకారులు ప్రశ్నించి తీరాలని అన్నారు. తరువాత "ప్రపంచీకరణ – ప్రతిఘటన సాహిత్యం" అనే అంశంపై పవన్ కుమార్ మాట్లాడారు. ప్రపంచీకరణ సాహిత్యం పరిమాణంలో చాలా పెద్దదని, దాన్ని ప్రతిఘటిస్తూ ఇంకా విరివిగా సాహిత్యం రావాల్సి ఉందన్నారు.

కథారచన
రెండో రోజైన 12వ తేదీ ఉదయం మొదటి సభకు జంధ్యాల రఘుబాబు అధ్యక్షులుగా వ్యవహరించగా, అట్టాడ అప్పలనాయుడు "తెలుగు కథ – సామాజిక చింతన", ఆర్. సీతారాం "కవులు, రచయితలు – అధ్యయనం ఆవశ్యకత" అనే అంశాలపై ప్రసంగించారు. తెలుగు కథ – సామాజిక చింతన అనే అంశంపై ప్రసంగిస్తూ అట్టాడ అప్పలనాయుడు సాహిత్యానికి జన్మస్థానమూ, గమ్యస్థానమూ సమాజమేనని అన్నారు. ఈ సమాజం ఏయే ఉద్యమాలను నడిపిందో, ఏయే సంఘర్షణలకు గురైందో అవన్నీ కథల్లో ప్రతిబింబిస్తూనే వచ్చాయని చెప్పారు. తొలిదశలో సంస్కరణవాద కథలు వచ్చాయని, సుమారు ముప్పై సంవత్సరాలపాటు సంస్కరణ భావజాలంతోనే కథాసాహిత్యం నడిచిందన్నారు. ఆ తరువాత జాతీయోద్యమ ప్రభావం మాత్రం పెద్దగా కథాసాహిత్యంలో కనిపించదని, ఆపై వామపక్ష భావజాలం ప్రవేశించాక ప్రజాపోరాటాలు కథలోకి ప్రవేశించాయని చెప్పారు. ప్రశ్న లేని సమాజం లేదని, ప్రశ్న వల్లే సమాజం పురోగమిస్తుందని తెలిపే అంశాలతో కథాసాహిత్యం వెలువడిందన్నారు. ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరిస్తూ, వ్యతిరేకిస్తూ రాసిన కథలూ వచ్చాయని, ఈ విధంగా కథ అడుగడుగునా సామాజిక చింతనే ప్రధానంగా సాగిందని అట్టాడ అప్పలనాయుడు అన్నారు. కథారచన గురించి ప్రముఖ కథారచయిత ఖదీర్ బాబు మాట్లాడుతూ, కథలు రాయడం ఒక ఉత్సుకత మాత్రమేనని, ఎవరైతే ఏఐ రాయనిది, రాయలేనిది రాయగలరో వారే గొప్ప కథకులు అవుతారని అన్నారు. ఆర్. సీతారాం "కవులు, రచయితలు – అధ్యయనం ఆవశ్యకత" అనే అంశంపై ప్రసంగించారు. వక్రీకరణకు వ్యతిరేకంగా, చాలా సంయమనంతో కవిత్వం చెప్పడం కోసం చదవాలి, చదివించాలి. ఇది అనివార్యమన్నారు. మొత్తంగా ఈ ప్రసంగం చదవడం, అధ్యయనం మధ్య తేడాను గుర్తుచేస్తూ, కవులు, రచయితలు తప్పుడు చైతన్యాలకు, ఏకరీకరణలకు, ఆధిపత్యాలకు ఎదురు నిలిచే స్పష్టమైన దృక్పథాన్ని ఎలా నిర్మించుకోవాలనే దానిపై నడిచింది.
ముగింపు సభ
సాయంత్రం జరిగిన ముగింపు సభలో ఖాదర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ, రాయడమంటేనే ఒక ప్రతిఘటనా చర్య అని అన్నారు. ఇలాంటి సమ్మేళనాలు మరిన్ని జరగాలని, కొత్త భాష, కొత్త ఉత్సాహం, కొత్త డిక్షన్ ఈ కాలానికి అవసరమని పేర్కొన్నారు. ప్రముఖ సాహిత్యవేత్త ఉమ్మడిశెట్టి రాధేయ మాట్లాడుతూ, యువ రచయితలకు సామాజిక బాధ్యతతో కూడిన ఒక దృక్పథం ఉండాలని అన్నారు. సాహిత్యం నిరంతరం సమాజాన్ని ప్రతిబింబిస్తుందని, అది సమాజం మరింత మెరుగ్గా మారడానికి అవసరమైన ప్రేరణను, ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఉంటుందని చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, రెండు రోజుల సాహిత్య సమ్మేళనం విజయవంతమైందని, ఇలాంటి ప్రయత్నాలు రాష్ట్రంలో మరో రెండు మూడు చోట్ల కూడా నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో కవులు, రచయితలు ఏకమై ఇంకా బలమైన సాహిత్య ఉద్యమాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి.ఎస్. శర్మ మాట్లాడుతూ, సమాజం ముందు ఒక పెద్ద సవాలు ఉందని, ప్రజల మధ్య విభజన, ద్వేషాన్ని వెదజల్లుతున్నారని, దానిని ఎదుర్కోవడానికి కవులు, రచయితలు ఏకమవాలని అన్నారు. తొంభై ఏళ్ల క్రితం లండన్‌లో సమావేశమైన భారతీయ రచయితలు రూపొందించిన అభ్యుదయ రచయితల ప్రణాళికను ఇప్పుడు మరింత మెరుగుపరుచుకొని, అలాంటి విశాలమైన ఐక్యతా భావనతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఈ తరం రచయితలు, కవులు, కళాకారులపై ఉందని అన్నారు. రెండు రోజుల సాహిత్య సమ్మేళనాన్ని సమీక్షిస్తూ సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని చెప్పడానికి రెండు రోజుల పాటు ఎంతో క్రమశిక్షణతో పాల్గొన్న కవులు, రచయితలే సాక్ష్యమని అన్నారు. కొత్త సంకల్పాలకు ప్రారంభమే ఉంటుందని, ముగింపు ఉండదని, ఈ సమ్మేళనం కూడా అలాంటిదేనని చెప్పారు. భవిష్యత్తులో మరింత వికేంద్రీకరణతో, మరింత విస్తృతంగా, విశాలంగా పనిచేయడానికి సాహితీ స్రవంతి కృషి చేస్తోందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో సాహితీ స్రవంతి, విజ్ఞాన కేంద్రాలు, అభ్యుదయ సాహిత్య సంకల్పంతో కలిసి ఈ కార్యాచరణను మరింత ముందుకు తీసుకెళ్తాయని చెప్పారు.
సృజనకారుల స్వరం - 1
శనివారంసాయంత్రం 5.30 గంటలకు "మేమెందుకు రాస్తున్నాం?" అనే అంశంపై సృజనకారుల స్వరం కార్యక్రమాన్ని సత్యాజీ, శాంతిశ్రీ సమన్వయకర్తలుగా నిర్వహించారు. ఈ సెషన్‌లో వర్ధమాన కవులు తామెందుకు కవిత్వం రాస్తున్నారో వివరించే ప్రయత్నం చేశారు. డాక్టర్ సుంకర గోపాల్ తాను స్పందన కలిగినప్పుడే రాయగలనని, ఏదో కవితా సంపుటిలో ప్రచురణ కోసమో లేదా ఏ పురస్కారం కోసమో రాయలేనని అన్నారు. ఉత్తరాంధ్ర కథకుడు మల్లిపురం జగదీష్ కథ రాయడం తనకు కాలక్షేపం కాదని, అది ఒక సీరియస్ ఫీల్ అని, "ఇది నేనే రాయాలి, నేను తప్ప ఇంకెవ్వరూ రాయలేరు" అన్నప్పుడు మాత్రమే రాస్తానని, అందుకే తన కథలు చాలా తక్కువని అన్నారు. కవి సిరికి స్వామినాయుడు తాను కళింగాంధ్ర అస్తిత్వం కోసం రాస్తున్నానని, ఆ నేల మీద నిలబడ్డ తనకు అక్కడి వేదన, అక్కడి ప్రజలు, అక్కడి విధ్వంసకర దృశ్యాలే కవితా వస్తువులయ్యాయని అన్నారు. కట్టా సిద్ధార్థ మాట్లాడుతూ, రాయాల్సిన అవసరం ఉండి రాయకపోవడం, రాయగలిగి ఉండి రాయకపోవడం తప్పనిపించి రాస్తున్నానన్నారు. అనిల్ డ్యానీ తన పూర్వికుల అనుభవాల నేపథ్యం నుంచి రాస్తున్నానన్నారు. శవపేటికలు తయారుచేసేవారు, ఫంక్షన్లలో భోజనాలయ్యాక ఆకులు తీసేవారు తన దృష్టిపథంలో పడి తనకు కవితా వస్తువులయ్యారని అన్నారు. వైష్ణవిశ్రీ స్త్రీలపై జరిగే వివక్షను, దౌర్జన్యాలను ప్రశ్నించడం కోసం కవిత్వం రాస్తున్నానన్నారు. మనిషిగా మానవత్వంతో జీవించడం కోసం కవిత్వం రాస్తున్నానని, అది కన్నతల్లిలా తనను ఓదారుస్తుందని కవిదాసు అన్నారు. అలజడి నుంచి ఉపశమనం కోసం రాస్తున్నానని కంచరాన భుజంగరావు అన్నారు. లండా సాంబమూర్తి మాట్లాడుతూ, "నేను మా ప్రాంతంలోని శోకాన్ని గురించి రాస్తున్నాను. అభివృద్ధి ముసుగులో మా ప్రాంతం ఎంత కుమిలిపోతోందో రాస్తున్నాను. మా ప్రాంతపు కిడ్నీ బాధితుల గురించి రాస్తున్నాను. ప్రపంచం దాన్ని కవిత్వమంటోంది" అన్నారు. ఏమి రాసినా నన్ను నాలోంచి విముక్తం చేసుకొని అది ఎదుటివాళ్లకు చేరడం కోసం రాస్తున్నానని పుప్పాల శ్రీరామ్ అన్నారు. స్త్రీల రెక్కల కష్టాన్ని గురించి రాయాలనిపించి రాస్తున్నానని చింతా అప్పలనాయుడు అన్నారు. తనకు, తనవాళ్లకు, వాళ్లకు జరిగిన అనేకానేక అవమానపు సంఘటనలే తన కవితా వస్తువులయ్యాయని తంగిరాల సోని అన్నారు. సామాజిక వికాసం కోసం రాస్తున్నానని పతివాడ నాస్తిక్ అన్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడం కోసమే కవిత్వం రాస్తున్నానని పెళ్లూరు సునీల్ అన్నారు. అనంతరం సత్యాజీ సృజనకారుల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ, మతతత్వం–మార్కెట్‌వాదం చెరోవైపు నుంచి చెంపచెల్లుమనిపిస్తున్న ఈ తరుణంలో కవులు ప్రశ్నించాలని, వారే సమాజం మారటానికి ప్రేరణ అవుతారని ముగించారు.
సృజనస్వరాలు - 2
ఆదివారం నాటి సృజనకారుల స్వరంలో సుమారు 25 మంది కవులు, కథకులు పాల్గొన్నారు. దీన్ని గంటేడ గౌరునాయుడు ప్రారంభించగా, ఎం. ప్రగతి, ఉషారాణి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. మొదటిగా వేంపల్లి షరీఫ్ మాట్లాడుతూ, ఎప్పుడూ ఒకే దానికోసం రాయమని, ఎదురయ్యే సందర్భాలను బట్టే మన అభిప్రాయాలు రచనాపరంగానూ మారుతుంటాయని అన్నారు. గుజరాత్ మత అల్లర్ల సందర్భంలోనే తాను కథలు రాయడం మొదలు పెట్టానన్నారు. పాయల మురళీకృష్ణ ఆకలే తనను రాయడానికి ప్రేరణ అయిందని, ఉత్తరాంధ్ర వలస కార్మికుని దుఃఖం గురించి రాస్తానన్నారు. సుబ్బు ఆర్.వి. పనిని దైవంగా భావించేవారి కోసం, మనిషిని మనిషిగా గౌరవించడం కోసం రాస్తానన్నారు. వడ్లమూడి పద్మ "మనిషిని కాబట్టి రాస్తున్నాను" అన్నారు. జర్నలిస్టుగా ప్రతి వార్తను పాఠకుడికి బలంగా చేరవేయడంలోనూ కవితాత్మకతను చొప్పించడానికి ప్రయత్నించానన్నారు. విజయనగరం నుంచి వచ్చిన వెంకట్రావు ఒక టైలర్‌గా తనకు ఎదురైన అనుభవాలే కథలుగా మారాయని వివరించారు. నీలం వెంకటేశ్వర్లు సమాజంలోని వ్యక్తుల సంఘర్షణలను గురించి రాస్తానని, మనసు పొడిచేటప్పుడల్లా రాస్తానని అన్నారు. అనుభవాలు శరీరాన్నీ, మనసునీ గాయపరిచినప్పుడు రాస్తానని, తనను తాను నిరంతరం సంస్కరించుకోవడం కోసం రాస్తున్నానని రత్నాజయ్ అన్నారు. తాను ఒక బాల కార్మికురాలిగా ఉన్న సందర్భాన్ని గురించి, తన అమ్మను గురించి రాశానని నాగమణి అన్నారు. ప్రశ్నించడం కోసం, అందరూ బాగుండడం కోసం రాస్తున్నానని, తల్లి ప్రోత్సాహం, తండ్రి ప్రోద్బలం వల్ల రాయడం ప్రారంభించానని ఫ్రాన్సిస్ అన్నారు. కొండారెడ్డి తాను రాసిన కథల నేపథ్యాన్ని వివరించారు. కొత్త శివ ఇంటర్, డిగ్రీ చదువుతున్న రోజులలోనే స్పెషల్ తెలుగు పాఠాలు తనను కవిత్వం వైపు లాగాయని, తరువాత సాహితీ స్రవంతి పెద్దాపురం శాఖ తనలోని కవిని వెలికి తీసిందని అన్నారు. మందరపు హైమవతి స్త్రీల అసమానత్వాన్ని ప్రశ్నించడమే తాను రాయడానికి నేపథ్యమని చెప్పారు. మంత్రి కృష్ణమోహన్ "నా అనుభవాలను, నా అనుభూతులను, నేను అధ్యయనం చేసిన అంశాలను మీతో పంచుకోవడం కోసమే రాస్తున్నాను" అన్నారు. ఇంకా శాంతికృష్ణ, వినోద్ కె., కలమట దాసుబాబు, ప్రత్తిపాటి రమేష్ నాయుడు, సోమేపల్లి శ్రీ వశిష్ట, ఎల్. శాంతి తదితరులు తామెందుకు రాస్తున్నామో వివరించారు.
నివేదిక : డాక్టర్ జోస్యుల కృష్ణబాబు







కామెంట్‌లు (0)