పారిస్ : గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రపంచ నైపుణ్యాల బదిలీ యంత్రాంగం, ఆర్థిక కారిడార్ అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. జి-7 దేశాల భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల సమావేశంలో మోడీ మంగళవారం మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేశారు. ‘అందరికీ సమతూకంతో కూడిన, ఉమ్మడి, సుస్థిర ఆర్థికాభివృద్ధిని పునరుద్ధరించడం’ అనే అంశంపై చర్చలు సాగాయి. భారత్, పశ్చిమాసియా ఆర్థిక కారిడార్ (ఐఎంఇసి) తరహాలో గ్లోబల్ సౌత్‌కు ఆర్థిక కారిడార్ వుండాలని పేర్కొన్నారు. ఐఎంఇసి దార్శనికత తరహాలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ దీవుల దేశాలతో అనుసంధాన ప్రాజెక్టులపై మనం పనిచేయగలమా?’’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఐఎంఇసి ప్రాజెక్ట్ పశ్చిమాసియాలో అనేక ఘర్షణలు, అశాంతుల కారణంగా తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఇంతకుముందు గాజా యుద్ధం, తాజాగా అమెరికా, ఇరాన్ యుద్ధం వంటి పరిణామాలు అడ్డం పడుతున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన జి-20 సదస్సులో 2023 సెప్టెంబరులో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. సంపన్న జి-7 దేశాల నుండి మూల ధనం, భారత్ నుండి నైపుణ్యాలు, ప్రతిభ, గ్లోబల్ సౌత్ దేశాల నుండి యాజమాన్యం కలిసి ఇంటర్నేషల్ మొబిలైజేషన్ పార్టనర్‌షిప్ ఫర్ యాక్సిలరేటింగ్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్ (ఇంపాక్ట్)ను ఏర్పాటు చేయాలని మోడీ సూచించారు. వృద్ధులు ఎక్కువైపోతున్న తరుణంలో భారత్‌లో, గ్లోబల్ సౌత్ దేశాల్లో యువ ప్రతిభ వుందని మోడీ పేర్కొన్నారు. గ్లోబల్ స్కిల్స్ పార్టనర్‌షిప్ (ప్రపంచ నైపుణ్యాల భాగస్వామ్యం) గనక ఏర్పాటు చేసినట్లైతే ఈ ప్రతిభా నైపుణ్యాలను పరస్పరం ప్రయోజనాలు కలిగించే రీతిలో ఉపయోగించుకుంటుందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల పేద దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని, ఆ ఇబ్బందుల్లేకుండా వుండేలా చూస్తూ, తమ తమ ఆర్థిక వ్యవస్థలను సజావుగా నిర్వహించుకునేలా సాయపడేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు తోడ్పాటు వ్యవస్థలను అభివృద్ధిపరచాలని మోడీ సూచించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరా గొలుసుల్లో తలెత్తిన అడ్డంకులు ఇంకా మరికొంత కాలం పాటూ గ్లోబల్ సౌత్ దేశాలను ఇబ్బంది పెడతాయన్నారు. అంతర్జాతీయ సంఘీభావాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తే ఆ సంక్షోభాల భారాన్ని పేద దేశాలకు వదిలివేయరాదని మోడీ పేర్కొన్నారు.
ప్రపంచ నైపుణ్యాల బదిలీ అవసరం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 18, 2026, 01:26 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)