శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశాంతంగా నీట్‌ రీ గ్జామ్

21 జూన్, 2026

neet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 09:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

5400కు పైగా కేంద్రాల్లో నిర్వహణ

22 లక్షల మంది అభ్యర్థులు హాజరు

న్యూఢిల్లీ : నీట్‌ ‌యుజి 2026 రీ ఎగ్జామ్‌ ఆదివారం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగింది. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాల్లోనూ, విదేశాల్లోని 14 కేంద్రాల్లోనూ ఈ రీ టెస్టును నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌‌టిఎ) నిర్వహించింది. ఈ పరీక్షకు 22.79 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌ ‌లీక్‌‌ కారణంగా మే 3న జరిగిన నీట్‌ ‌యుజి 2026 పరీక్షను రద్దు చేసి, సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు నీట్‌ ‌రీ టెస్టు జరిగింది. వికలాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాయడానికి అనుమతించారు. ఈ పరీక్షను ఇంగ్లీష్‌తో సహా 12 భారతీయ భాషలలో నిర్వహించారు. ఎన్‌‌టిఎ అధికారుల సమాచారం ప్రకారం 95,000కు పైగా పరీక్షా గదులలో మొత్తం 1,38,560 సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని జాతీయ, రాష్ట్ర, మంత్రిత్వ శాఖల స్థాయిలో వర్చువల్‌గా పర్యవేక్షిస్తున్నామని ఎన్‌‌టిఎ అధికారులు తెలిపారు. 51,311 జామర్‌‌లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్‌లను, అదనపు సిబ్బందిని నియమించారు. ఓఖ్లాలోని ఎన్‌‌టిఎ ప్రధాన కార్యాలయం నుంచి పరీక్ష సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్షించారు.

బుర్ఖా ధరించారని అనుమతి నిరాకరణ

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో బురఖా ధరించిన ఒక అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. బేవార్‌ ‌నుంచి వచ్చిన బాధిత అభ్యర్థి కుల్సుమ్ బానో మాట్లాడుతూ తాను మే 3న జరిగిన పరీక్షకు కూడా బురఖా, దుపట్టా ధరించి హాజరయ్యానని, ఇప్పుడు లోనికి అనుమతించ లేదని చెప్పారు. ఎన్‌‌టిఎ అనుమతి ఇచ్చినప్పుడు, తనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. చివరికి ఆమెను కేంద్రంలోకి అనుమతించారని ఎన్‌‌టిఎ తరువాత స్పష్టం చేసింది.

కొల్‌‌కతాలో వర్షాలతో ఇక్కట్లు

కొల్‌‌కతా, దాని పరిసర ప్రాంతాలను శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు ముంచెత్తాయి. పలుచోట్ల రహదారులు జలమయమై, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో నీట్‌ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు రావడానికి ఇబ్బందిపడ్డారు. మహారాష్ర్టలో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ బృహన్‌ ‌ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సంస్థ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కారణంగా విద్యార్థులు, ఇతరులు ఆదివారం కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్