చెన్నయ్ : తమిళనాడులో బీర్ బాటిళ్లను నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మినందుకు మద్యం దుకాణాదారుడికి స్థానిక వినియోగదారుల కోర్టు ఏకంగా రూ.కోటి జరిమానా విధించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రాణిపేట జిల్లాలోని స్కడ్డర్ ప్రాంతానికి చెందిన శక్తివేల్ (28), గతేడాది మార్చిలో వేలూరులోని పాళారు ఫ్లైఓవర్ సమీపంలోని మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఒక్కోటి రూ.170 ధర కలిగిన మూడు బీర్ బాటిళ్లను కొనుగోలు చేశాడు. వీటి మొత్తం ధర రూ.510 కాగా, ఆయన నుంచి రూ.570 వసూలు చేశారు. దీంతో ఒక్కో బాటిల్‌పై రూ.20 చొప్పున మొత్తం రూ.60 అదనంగా చెల్లించాల్సి చెల్లించాడు శక్తివేల్. ఈ విషయంపై గతేడాది మే 12న వేలూరు జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఒక్కో బాటిల్‌పై రూ.20 ఎక్సట్రా వసూలు చేశారని కేసు దాఖలు చేశాడు.
ఈ కేసును జస్టిస్ మీనాక్షి సుందరం నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. బీర్ బాటిళ్లపై నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్లు తేలింది. ఈ నెల 27న జరిగిన తుది విచారణను వెలువరిస్తూ, సంబంధిత మద్యం దుకాణాన్ని తక్షణమే మూసివేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే దుకాణ విక్రేత, జిల్లా మేనేజర్‌పై రూ.కోటి జరిమానా విధించింది. అయితే ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించింది. అదనపు వసూళ్లపై ఫిర్యాదు చేసిన శక్తివేల్‌కు పరిహారంగా రూ.3,000, న్యాయపరమైన ఖర్చుల కింద రూ.1,000 కలిపి మొత్తం రూ.4,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే తమిళనాడులోని ప్రతి జిల్లాలో మాదకద్రవ్యాల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.








కామెంట్‌లు (0)