శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'పోరు' భయం.. విద్యార్థి సంఘాల నేతల అరెస్టులు

1 గంట క్రితం

poere
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పోలీసుల తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ ఆగ్రహం

న్యూఢిల్లీ: అక్టోబర్‌ 10న ఢిల్లీలో జరగనున్న ‘ఓట్‌ చోరీ’ వ్యతిరేక నిరసనకు ముందు పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ఆగ్రహించింది. నిరసనలో పాల్గొనకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. పుణె నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌)కు చెందిన సుమారు 22 మంది విద్యార్థినులను మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని ఓ హోటల్‌కు తరలించారు. అలాగే, ఎస్‌ఎఫ్‌ఐ గుజరాత్‌ రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారత ఉపాధ్యక్షురాలు సత్యేషా లేవాను గుజరాత్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ ఆరిఫ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు, ఢిల్లీలోని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ కార్యాలయం ఉన్న హర్కిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌కు పోలీసులు చేరుకున్నారని ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది. నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి వస్తున్న విద్యార్థి కార్యకర్తల వివరాలను కార్యాలయ సిబ్బంది, స్థానిక నివాసితుల నుంచి సేకరించేందుకు ప్రయత్నించారని తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లోనూ ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర ప్రజాస్వామ్య సంఘాల కార్యకర్తల ఇళ్లకు పోలీసులు వెళ్లి తనిఖీలు చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ ఆగ్రహించింది. కార్యకర్తలను నిర్బంధిస్తూ, వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని విమర్శించింది. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్‌ వహాబ్‌తో పాటు పలువురు కార్యకర్తలకు ఫోన్‌ చేసి వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారని పేర్కొంది.

ఈ పరిణామాలపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకు ముందు పోలీసులు భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల చర్యలకు తాము భయపడబోమని, అక్టోబర్‌ 10న జరిగే నిరసనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్