శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవ్యక్తిగత బంధం బెడిసికొట్టిన తర్వాత అత్యాచారం కేసు పెట్టలేరు

30 అక్టోబర్, 2026

వ్యక్తిగత బంధం బెడిసికొట్టిన తర్వాత 
అత్యాచారం కేసు పెట్టలేరు 
 - సుప్రీం కోర్టు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 07:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : ప్రేమ లేదా పరస్పర అంగీకారంతో కూడిన వ్యక్తిగత సంబంధాలు విఫలమైన తర్వాత, గతంలో సమ్మతితోనే జరిగిన శారీరక సంబంధాన్ని ఆ తర్వాత అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు శుక్రవారం నాడు కీలక తీర్పును వెలువరించింది. సంబంధాలు బెడిసికొట్టిన తర్వాత వాటిని క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణి పెరుగుతోందని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. నిజంగా అత్యాచారం, బలవంతం లేదా మోసంతో సమ్మతి పొందిన సందర్భాల్లోనే అత్యాచారం ఆరోపణను పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు చేస్తూ కేరళకు చెందిన ఓ వ్యక్తిపై నమోదైన అత్యాచారం, మోసం అభియోగాల నుంచి సుప్రీం కోర్టు విముక్తి కల్పించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అత్యాచారం తీవ్రమైన నేరం అని, కానీ ఇలాంటి కేసుల వల్ల నిజంగా లైంగిక వేధింపులు, అత్యాచారానికి గురైన బాధితుల కేసుల తీవ్రత తగ్గిపోతోందని ధర్మాసనం హెచ్చరించింది. గతంలో అంగీకారంతో జరిగిన సంబంధాన్ని, తర్వాత విడిపోయారనే కారణంతో నేరంగా మార్చడం సరికాదని స్పష్టం చేసింది. ‘పరస్పర సమ్మతితో సాగిన ఒక బంధం విఫలమైనంత మాత్రాన, ఆ తర్వాత కలిగే పశ్చాత్తాపం లేదా కోపం ఆధారంగా ఆ సంబంధాన్ని నేరంగా పరిగణించలేం. ప్రతి విఫలమైన సంబంధాన్ని నేరంగా చిత్రీకరిస్తే, అసలైన లైంగిక దాడి కేసుల తీవ్రత దెబ్బతింటుంది. నిజమైన లైంగిక హింస, భయపెట్టి లేదా మోసం చేసి అత్యాచారం చేసిన సందర్భాలకు మాత్రమే చట్టాన్ని వర్తింపచేయాలి.’ అని జస్టిస్‌ బివి నాగరత్న పేర్కొన్నారు. విడిపోయిన తర్వాత ఒకరి కోపం కారణంగా మరొకరిని నేరస్థుడిగా చిత్రీకరించలేమని ఆమె స్పష్టం చేశారు. అలాంటి విధానం నిందితుడి వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ప్రతిష్ఠకు కూడా భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. సమ్మతితో కూడిన బంధంలో ఒకసారి భాగస్వామి అయినంత మాత్రాన, తర్వాతి కాలంలో అత్యాచారం ఆరోపణలు వస్తాయనే భయంతో ఆ పురుషుడు ఆ బంధానికే జీవితాంతం కట్టుబడి ఉండాలని భావించడం సమంజసం కాదని సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఇలాంటి పరిస్థితుల్లో ఆ బంధం నుంచి బయటకు వచ్చే హక్కు పురుషుడికి ఉండదా?' ఆ నిర్ణయాన్ని మోసంగా ఎలా పరిగణిస్తారు? కచ్చితంగా అది మోసం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరస్పర అంగీకారంతో కొనసాగిన ప్రతి సంబంధం విఫలమైనప్పుడు దానిని అత్యాచారం ఆరోపణగా మార్చితే, ఆ నేరం తీవ్రత తగ్గిపోతుందని కూడా పేర్కొంది.

కేసు నేపథ్యం..

కేరళంకు చెందిన ఓ వ్యక్తి తనపై నమోదైన కేసు నుంచి విముక్తి కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేరళం హైకోర్టు గతంలో ఆయన డిశ్చార్జ్ పిటిషన్‌ను, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఫిర్యాదుదారురాలు గతంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. అనంతరం పిటిషనర్‌తో పరిచయం ఏర్పడింది. అయితే తనకు అప్పటికే వివాహమైందనే విషయాన్ని పిటిషనర్ దాచిపెట్టి తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. ఆపై తప్పుడు పద్ధతిలో లైంగిక సంబంధానికి తన సమ్మతిని పొందాడని బాధితురాలు ఆరోపించినట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. నిందితుడు తనపై అత్యాచారం, మోసం, నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించినట్లు తెలిపింది. కర్ణాటకలోని మైసూరులో తామిద్దరం వివాహం చేసుకున్నామని, ఆ తర్వాత 1996 నుంచి 2003 వరకు కలిసి కాపురం చేశామని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ నిందితుడికి కేసు నుంచి పూర్తిగా విముక్తి కల్పించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్