శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజాస్వామ్యానికి విషాదకరమైన రోజు

5 గంటల క్రితం

ప్రజాస్వామ్యానికి విషాదకరమైన రోజు
- శాంతియుత నిరసనలపై క్రిమినల్‌ ‌కేసులా?
-  బాంబే హైకోర్టు వ్యాఖ్యలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 11:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • శాంతియుత నిరసనలపై క్రిమినల్‌ ‌కేసులా?

  • బాంబే హైకోర్టు వ్యాఖ్యలు

​న్యూఢిల్లీ: శాంతియుత ఆందోళనలను అణచివేయడానికి క్రిమినల్ కేసులను ఉపయోగిస్తే అది ప్రజాస్వామ్యానికి విషాదకరమైన రోజవు తుందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో రోడ్ల దుస్థితిపై జరిగిన నిరసనలో పాల్గొన్నందుకు ఒక వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్, చార్జిషీట్‌ను కోర్టు కొట్టివేసింది. హింసకు పాల్పడకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయకుండా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేసింది. నాగ్‌పూర్ ధర్మాసనానికి చెందిన జస్టిస్ ఎంఎం చాందవానీ అక్టోబర్ 29న ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో చంద్రపూర్ జిల్లా నందగావ్ గ్రామంలో దెబ్బతిన్న రోడ్డుపై గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఆ రోడ్డుపై ఒక వాహనం ప్రమాదానికి గురైన తర్వాత ఈ నిరసన జరిగింది. రోడ్డు కాంట్రాక్టర్‌పైనా, ప్రజాపనుల శాఖ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆందోళనలో పాల్గొన్నందుకు చంద్రపూర్ జిల్లాకు చెందిన నిష్కర్ష్ నిమ్‌గడేపై కేసు నమోదైంది. నిరసనకారులు చట్టవిరుద్ధంగా గుమిగూడి రోడ్డును దిగ్బంధించారని పోలీసులు ఆరోపించారు. దీంతో నిమ్‌గడే తనపై నమోదైన ఎఫ్ఐఆర్, చార్జిషీట్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

​శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు..

పిటిషన్‌ను అనుమతిస్తూ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును ఆర్టికల్ 19(1)(బి) పౌరులకు కల్పిస్తోంద ని కోర్టు పేర్కొంది. ఈ ప్రాథమిక హక్కుపై సహేతుక ఆంక్షలు విధించవచ్చని, కానీ అస్పష్టమైన ఆరోపణలతో ఈ హక్కును నీరుగార్చడం లేదా అణచివేయడం తగదని వ్యాఖ్యానించింది. ​“నిరసన తెలిపే రాజ్యాంగ హక్కుకు, శిక్షార్హమైన కేసులు పెట్టడానికి మధ్య ఉన్న గీత చెరిగిపోకూడదు. ఇలాంటి ఆలోచనా ధోరణికి ఆదరణ పెరిగితే అది ప్రజాస్వామ్యానికి విషాదమే,” అని హైకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్య ఆందోళనలను అణచివేయడానికి క్రిమినల్ కేసులు పెట్టరాదని, నిరసనకారులు హింసకు పాల్పడకుండా, ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయకుండా ఉన్నంతవరకు ఇది వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్