- నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : అయోధ్య రామమందిరం విరాళాల కుంభకోణానికి బాధ్యులైనవారిని శిక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడతామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని రోహిణి జపనీస్ పార్క్‌లో ఆప్ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించింది. రామమందిరంలో విరాళాల దొంగతనానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా హనుమంతుడిని ప్రార్థిస్తామని, ఆయన ఆశీస్సులతో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజల మద్దతు కూడగట్టేందుకే ఈ ఉద్యమం చేపడుతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. సుందరకాండ పారాయణ అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ ఆక్షేపించారు. ‘ప్రధానమంత్రి మోడీ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తారని దేశ ప్రజలు ఆశించారు. కానీ, ఆ దొంగలను, దోపిడీదారులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. భూ కుంభకోణం, ఆలయ నిర్మాణంలో జరిగిన కమీషన్ల దందాపై ఎలాంటి విచారణ జరగలేదని, నకిలీ సిట్ ఏర్పాటు చేసి..చేతులు దులిపేసుకున్నారని ఆయన వాపోయారు. దేవుడి పేరిట లక్షల, కోట్ల మంది భక్తులు ఇచ్చిన డబ్బును దోచుకున్నారని విమర్శించారు. రామ మందిరం నిర్మాణ సమయంలోనూ పెద్ద ఎత్తున కమీషన్లు దోచుకున్నారన్నారు. అలాగే, ఢిల్లీలో ఆప్ నిర్వహించిన ‘సుందరకాండ పారాయణం’ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ఈ అంశంపై ప్రధాని మోడీ ఎందుకు నోరు విప్పటం లేదని కాంగ్రెస్ నిలదీసింది. భక్తుల నమ్మకాన్ని వమ్ముచేసిన బిజెపి, ఆర్ఎస్ఎస్ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సోషల్ మీడియా ఎక్స్‌లో తెలిపారు.








కామెంట్‌లు (0)