mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రిజర్వేషన్లను రద్దు చేయడమే బిజెపి అసలు లక్ష్యం : జైరాం రమేశ్‌

7 గంటల క్రితం

Jairam Ramesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 04:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : రిజర్వేషన్లను రద్దు చేయడమే బిజెపి అసలు లక్ష్యం అని కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‌విమర్శించారు. ఆయన తాజాగా పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలకాంశాల గురించి మాట్లాడారు. లోక్‌‌సభలో మూడింట రెండువంతుల మెజార్టీ కోసమే బిజెపి టిఎంసి, శివసేన (యుబిటి) పార్టీలను చీల్చి ఎంపీలను తమవైపుకి తిప్పుకుంటోందని జైరాం రమేశ్‌ ఆరోపించారు. మోడీ ప్రభుత్వానికి నిజంగా మహిళా రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత లోక్‌‌సభ స్థానాలు (543)ని పెంచకుండా వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

టిఎంసి, శివసేన (యుబిటి)లను చీల్చేందుకు హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్‌ 2024 ప్రచారాన్ని సమర్థిస్తున్నాయి. ఆ ఎన్నికల సమయంలో రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లను రద్దు చేసేందుకే బిజెపి 400 స్థానాలను కావాలని కోరుకుంటోందని కాంగ్రెస్‌ ‌ప్రచారం చేసింది. ఇప్పుడు రిజర్వేషన్లను రద్దు చేయడానికే ప్రాంతీయ పార్టీలను చీల్చి లోక్‌‌సభలో ఎంపీల సంఖ్యను పెంచుకోవడానికి అమిత్‌‌షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఈ ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు.

రిజర్వేషన్లపై మోడీ అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. స్వయానా బిజెపి నేతలు, ఆరెస్సెస్‌ ‌మాత్రం వాటిని ఒప్పుకోవడం లేదు. పూర్తిగా రద్దు చేయాలనే కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌రిజర్వేషన్లను రద్దు చేయాలని బహిరంగంగానే వెల్లడించారు. డిలిమిటేషన్‌ (‌నియోజకవర్గాల పునర్విభజన) అధిగమించడమే వారి మొదటి మైలురాయి. కానీ వారికింకా మూడేళ్ల సమయం ఉంది అని రమేష్‌ ‌గుర్తు చేశారు. అయితే పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ ‌సవరణ బిల్లులో డిలిమిటేషన్‌‌ను మాత్రమే ప్రతిపక్షం వ్యతిరేకించింది. మహిళా రిజర్వేషన్‌ను కాదు. బిజెపి నేతల అసలు లక్ష్యం రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలు) తొలగించడమే తప్ప, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాదు అని ఆయన అన్నారు.

రాజ్యాంగం వారికెప్పుడూ అసౌకర్యంగానే ఉంది. అందుకే దీన్ని పలు విధాలుగా సవరించాలని కోరుకుంటున్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు 'ఆర్గనైజర్' (ఆర్‌ఎస్‌ఎస్‌) దానిపై దాడి చేసిందని గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వాస్తవానికి అప్పటికే గాంధీజీ మరణించి ఉన్నారు, కానీ రాజ్యాంగ పరిషత్‌లో చేరేలా డాక్టర్ అంబేద్కర్‌కు స్ఫూర్తినిచ్చినందుకు గాంధీజీ కూడా విమర్శలకు గురయ్యారని మీకు తెలుసు కదా అని ఆయన అన్నారు.

ఒకవేళ ప్రతి రాష్ట్రంలోనూ లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే విధానం బిల్లులో భాగమైతే ప్రతిపక్షం దాన్ని అంగీకరిస్తుందా మీడియా ప్రతినిధి రమేష్‌‌ని ప్రశ్నించారు. ‘అసలు సమస్య నియోజకవర్గాల పునర్విభజనను ఏ విధంగా చేపడుతున్నారన్నదేనని’ రమేష్‌ ‌బదులిచ్చారు. వారు అస్సాంలో, జమ్మూకాశ్మీర్‌‌లో పునర్విభజన చేశారు. జ్ఞానేశ్‌‌కుమార్‌ ‌డిలిమిటేషన్‌ ‌చేస్తారా? లేదు కదా.. ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న జుగల్బందీని మీరు చూశారు అని రమేష్‌ అన్నారు.

ఇప్పటికే లోక్‌‌సభలో సుమారు 500 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశం దక్కడం లేదు. అలాంటిది వీరు 815 మంది ఎంపీలను తీసుకురావాలనుకుంటున్నారు. ఇది ఎవరి కోసం చేస్తున్నారు? ఇదిలా ఉంటే రాజ్యసభ పరిస్థితి ఏమిటి? దీనిపై ప్రశ్నలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది. అని ఆయన అన్నారు. టిఎంసిని, శివసేనను పార్టీలను చీల్చి ఎంపీల సంఖ్య మరో 26కి పెంచుకున్నారు. మొత్తంగా ఇప్పుడు ఎన్‌‌డిఎ ఎంపీల సంఖ్య 324కి పెంచుకున్నారు. అమిత్‌‌షా ఇలాంటివి చేసినప్పటికీ లోక్‌‌సభలో మూడింట రెండువంతుల మెజార్టీకి చేరుకుంటారనేది నమ్మకం లేదు. ఎందుకంటే భవిష్యత్తు ఎన్నికల్లో కూడా వారికి మూడింట రెండు వంతుల మెజారిటీ రాదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చడానికే ఆ మెజారిటీని కోరుకుంటున్నారని దళితులు, వెనుకబడిన వర్గాలు ఆదివాసులకు తెలుసు అని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జైరాం రమేశ్‌ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్