తిరువనంతపురం : సుమారు 50 మంది విద్యార్థులు తీవ్రమైన శ్వాస ఇబ్బందులు, వికారం, వాంతులతో ఆస్పత్రి పాలయ్యారు. కేరళలోని కొల్లాం జిల్లా కొట్టియంలోని ఆక్సిలియం ఐఎస్‌సి పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. అత్యవసర పరిస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం తరగతి గదులను ఖాళీ చేయించారు. పాఠశాలకు సమీపంలో ఉన్న తారు మిక్సింగ్ యూనిట్ నుండి వెలువడిన విషపూరిత వాయువుల కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు, తల్లిదండ్రులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆ యూనిట్‌ను తిరిగి ప్రారంభించిన కొద్దిసేపటికే, దట్టమైన పొగ పాఠశాల ప్రాంగణంలోకి వ్యాపించిందని అన్నారు.
అయితే తారు మిక్సింగ్ యూనిట్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఇది మొదటిసారి కాదు. గతంలో అదే పాఠశాలకు చెందని పది మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఆగ్రహించిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలు చేపట్టారు. దీంతో ఈ యూనిట్‌లో కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశిస్తూ పంచాయితీ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయితీ ఉత్తర్వులపై కోర్టుకు వెళ్లిన ప్లాంట్ యాజమాన్యం బుధవారం తిరిగి ప్రారంభించింది. యంత్రాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తరుచూ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ ప్లాంట్‌ను శాశ్వంగా మూసివేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు.








కామెంట్‌లు (0)