దేశవ్యాప్త నిరసనల్లో పెద్దయెత్తున పాల్గొనాలని పిలుపు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో వ్యవసాయ, గ్రామీణ కార్మికులు పెద్దయెత్తున పాల్గొనాలని అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపునిచ్చింది. రైతులు, వ్యవసాయ కార్మికులు గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలో అంతర్భాగమని, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా ఇరువర్గాలూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు బి వెంకట్ (ఎఐఎడబ్ల్యూయు), జిఎస్ గోరియా (బికెఎంయు), ధీరేంద్ర ఝా (ఎఐఎఆర్ఎల్ఎ), అసిత్ గంగూలీ (ఎఐఎస్‌కెఎస్), ధర్మేంద్ర (ఎఐఎకెఎస్‌యు) మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు సాగించిన చారిత్రాత్మక పోరాటంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుందని పేర్కొంది. అయితే 2021 డిసెంబర్ 9న రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించింది. అన్ని పంటలకు సి2+50 శాతం ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించేందుకు నిరాకరిస్తోందని తెలిపింది. 2005లో అమల్లోకి వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని, దానిని బలహీనపరిచే మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం 200 రోజుల పని, రోజుకు రూ.700 కనీస వేతనం కల్పించాలని, వేసవిలో ప్రత్యేక అలవెన్స్ ఇవ్వడంతోపాటు ఇందుకు తగిన నిధులు కేటాయించాలని కోరింది. భూమిలేని వ్యవసాయ కార్మికులకు సాగు భూములు పంపిణీ చేయాలని, దళితులు, ఆదివాసీలు, మహిళా వ్యవసాయ కార్మికులపై సామాజిక వివక్ష, దాడులు, అణచివేతలను అరికట్టాలని పేర్కొంది. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను పూర్తిగా రద్దు చేసి, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, సామూహిక చర్చల హక్కు, కనీస వేతనాలు, సామాజిక భద్రతను పరిరక్షించాలని డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, దీని పేరుతో తొలగించిన కోట్లాది మంది ఓటర్ల పేర్లను ప్రతి పంచాయతీలో బహిర్గతం చేయాలని కోరింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, ఆయనపై విచారణ, చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.








కామెంట్‌లు (0)