లక్నో : యుపిలో అధికార బిజెపి, సిఎం యోగిల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ శుక్రవారం పేర్కొన్నారు. యుపి సిఎం యోగి రాజకీయంగా బలహీన స్థితిలో ఉన్నారని అన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన ప్రమాదంలో ఒక చిన్నారి మరణించిన ఘటనకు సంబంధించి యుపి సిఎం చెప్పిన అసత్యాలు సిసిటివి ఫుటేజీ ద్వారా బయటకు రావడంతో, ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలవుతామనే భయంతో, యోగి ప్రభుత్వం పిడిఎ (మైనారిటీ, దళిత, వెనుకబడిన వర్గాలు) కార్యకర్తలను, వారి కుటుంబాలను వేధిస్తోందని అన్నారు. ఈ క్రూరత్వానికి, బెదిరింపులకు భయపడవద్దని ఆయన కార్యకర్తలకు తెలిపారు. యోగి ప్రభుత్వానికి మూడు నెలల కాలం మాత్రమే మిగిలి వుందని, ఆయన అధికారం ఎక్కువ కాలం నిలవదని అన్నారు. ఆయన ఘోర పరాజయంతో రాష్ట్రాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోతారని, అందుకే నిరాశతో ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. నవంబర్ 18న గోరఖ్‌పూర్‌లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో జరిగిన పిడిఎ ర్యాలీలో బుల్డోజర్ ఢీకొని ఒక మైనర్ బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మృతుని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. సిఎం యోగిని తరచుగా ఢిల్లీకి పిలిపిస్తున్నారని, సొంత గడ్డపైనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నుండి బెదిరింపులు ఎదుర్కొంటున్నారని, కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకు లేదని అఖిలేష్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి రూపొందించిన అభ్యర్థుల జాబితాను తిరస్కరిస్తూ, రాష్ట్రంలోని బిజెపి పార్టీ ఒక 'తిరస్కరణ లేఖ'ను విడుదల చేసిందని అన్నారు.
యోగి పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. పెట్టుబడిదారుల నుండి 5 శాతం, కాంట్రాక్టర్ల నుండి 50 శాతం ముందస్తు కమీషన్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కమీషన్ల దోపిడీ కారణంగానే రహదారులు కుంగిపోవడం, వంతెనలు, నీటి ట్యాంకులు కూలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. పోలీస్స్టేషన్లు, కోర్టులు, తహసీల్ కార్యాలయాలు అవినీతికి కేంద్రాలుగా మారాయని, పన్నుల అధికారులు, పోలీసులు వ్యాపారులు, సామాన్య ప్రజలను వేధిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. లక్నో అగ్నిప్రమాదంలో మరణించిన యువకుడి తల్లి పట్ల యోగి దురుసుగా ప్రవర్తించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆగ్రహం కలిగించిందని అఖిలేష్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు, ఉద్యోగాల విషయంలో యోగి వైఖరిని యువత వ్యతిరేకిస్తోందని అన్నారు. ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, అధికారులు, న్యాయవాదులను అవమానిస్తున్నారని, యశ్ భారతి అవార్డులను నిలిపివేయడంతో కళాకారులు, రచయితలు, వైద్యులు, ఇంజినీర్లు, క్రీడాకారులు కూడా ఆయనకు దూరమయ్యారని విమర్శించారు. ఎరువుల కొరత, ధాన్యం బస్తాల చోరీ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాత్రిళ్లు పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్మికులు, కూలీలు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు. సత్ప్రవర్తన పేరుతో ఇటీవల ఓ హత్య దోషిని విడుదల చేయడంపై ఆయన యోగి ప్రభుత్వాన్ని నిలదీశారు. పట్టపగలు హత్యకు పాల్పడిన వ్యక్తిని సత్ప్రవర్తన పేరుతో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో దళితులు, మహిళలపై నేరాలు పెరిగాయని, నకిలీ ఎన్కౌంటర్లు, పోలీసు కస్టడీలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్)లో ఒకే కులానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, బుల్డోజర్ పాలన క్రమశిక్షణకు బదులుగా అరాచకానికి చిహ్నంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024, 2026 ఎన్నికల్లోనే పిడిఎ ఐక్యతను చాటిందని అఖిలేష్ పేర్కొన్నారు. సిఎం తనపై ఉన్న కేసులను తానే కొట్టివేయించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ పరిస్థితుల్లో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఓటమి తప్పదని అన్నారు. యోగిని పదవి నుండి తప్పించాలని బిజెపి నేతలు, ఆ పార్టీ అభ్యర్థులే కోరుకుంటున్నారని అన్నారు.








కామెంట్లు (0)