- హోరెత్తిన పార్లమెంట్
- జోరు వర్షంలోనూ ప్రతిపక్షాల ఆందోళన
- చైర్మన్ ఆదేశించినా మోఖం చాటేసిన హోం మంత్రి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు చేసిన క్రూరమైన దాడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని, అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీపై ఉభయ సభల్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో ప్రతిపక్షాలు జోరు వర్షంలో తమ ఆందోళనను కొనసాగించారు. ఆందోళన చేస్తున్న సమయంలో భారీగా వర్షం పడుతున్నా ఎంపిలు వెనక్కి తగ్గలేదు. వర్షంలోనే తడుస్తూనే ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడుగులు, ప్లకార్డులు పట్టుకుని, పార్లమెంట్ మకర ద్వార్ ముందు ‘ఛందా చోర్, గడ్డి చోర్’, ‘అమిత్ షా జవాబ్ దో’ వంటి నినాదాలతో ఎంపిలు హోరెత్తించారు. పార్లమెంట్ సమావేశాలకు కేంద్ర హోం మంత్రి, ప్రధాని మోడీ సభకు హాజరుకాకపోవడంపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. హోం శాఖ పరిధిలోని పోలీసుల చర్యలపై అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే అమిత్ షా పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు హాజరుకాకపోవడం గమనార్హం.
ఎంఎస్ఎంఇ సవరణ బిల్లు లోక్‌సభ ఆమోదం
క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గుర్తుచేసుకోవడంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభ ప్రారంభమైన నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళన మధ్య కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. 2006 చట్టం స్థానంలో వచ్చిన ఈ బిల్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) ఉచిత, స్వచ్ఛంద నమోదు కోసం ఒక జాతీయ డిజిటల్ వేదికను నోటిఫై చేయడానికి వీలు కల్పిస్తుంది. ఎంఎస్ఎంఇల నుండి వస్తువులు, సేవలను సేకరించడానికి సంబంధించిన ఇన్వాయిస్ సెటిల్మెంట్లను ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టిఆర్ఇడిఎస్) ద్వారా నిర్వహించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను (సిపిఎస్ఇఎస్) తప్పనిసరి చేస్తుంది. ఈ బిల్లును ఎటువంటి చర్చ లేకుండా నిమిషాల్లోనే మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
ఆయన (అమిత్ షా) రావాలి, సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ
రాజ్యసభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ గత నెల 20న నిరసనకారులపై పోలీసుల దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ప్రకటన విడుదల చేయాల్సిందేనన్నారు. ‘‘ఆయన పార్లమెంటుకు రావడానికి భయపడుతున్నారు. ఆయన రావాలి, సమాధానం చెప్పాలి, ప్రకటన చేయాలి. అందులో అంత పెద్ద విషయం ఏముంది? ఏదైనా తప్పు జరిగితే, బాధ్యత తీసుకోవాలి’’ అని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ అన్నారు.
అమిత్ షా అహంకారాన్ని ప్రజలు చూస్తున్నారు : సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్
అమిత్ షా సభకు హాజరుకావాలంటూ రాజ్యసభ చైర్మన్ స్వయంగా అభ్యర్ధించిన సంగతి తెలిసిందే. అయితే చైర్మన్ సూచనను కూడా ఆయన పట్టించుకోలేదని, ఇది ఉపరాష్ట్రపతిని అవమానించడమేనని ప్రతిపక్ష ఎంపిలు విమర్శించారు. అయితే, సభాపతి ఆదేశాలను కూడా పాటించని అమిత్ షా అహంకారాన్ని ప్రజలు చూస్తున్నారని సిపిఎం రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ అన్నారు. ఆయన సభకు హాజరుకాకుండా పరారయ్యారని ఎద్దేవా చేశారు. సభకు హాజరుకాకుండా తన సొంత కార్యాలయంలో కూర్చుని టీ తాగడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా? అని బ్రిట్టాస్ ప్రశ్నించారు. అయితే, దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు మరింత ఆగ్రహం తెప్పించాయి. అమిత్ షా పగలు, రాత్రి పార్లమెంటులోనే ఉంటారని, ఆయన ఎప్పుడు సభకు రావాలో ప్రతిపక్షాలు నిర్దేశించలేవంటూ రెచ్చగొట్టారు. అంతేకాకుండా ఆయన వచ్చి సమాధానం చెబితే మీరు భరించలేరు, ఉగ్రవాదులు సైతం వణికిపోతారంటూ చెప్పుకొచ్చారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. అమిత్ షా సభకు రావాలనే నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. వివాదాస్పద ఎఫ్‌సిఆర్ఎ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా తమ పార్టీకి చెందిన భయ సభల ఎంపిలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఎఫ్‌సిఆర్ఎ సవరణ బిల్లుపై ప్రభుత్వం చర్చ చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ కాంగ్రెస్ ఎంపిలు తప్పనిసరిగా హాజరు కావాలని అధిష్ఠానం స్పష్టం చేసింది.








కామెంట్‌లు (0)