శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ ఎత్తుగడలతో ప్రజలు విసిగిపోయారు : తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై

20 గంటల క్రితం

మోడీ ఎత్తుగడలతో ప్రజలు విసిగిపోయారు : తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

మోడీ ఎత్తుగడలతో ప్రజలు విసిగిపోయారు : తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 04:28 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ:

కేంద్రంలోని అధికార బిజెపి ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తమిళనాడు బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నయా విధానాలను, చర్యలను ప్రశ్నించే పౌరులను 'దేశద్రోహులు', 'విదేశీ ఏజెంట్లు' అని ముద్రవేసి వేధించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా జాతీయ జెండాతో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపిన యువకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.


ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపిన సీజేపీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు ఏడు రోజుల పాటు జైలులో బంధించారు. అక్టోబర్ 13న అదుపులోకి తీసుకున్న వీరిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ జుడీషియల్ కస్టడీని చట్టవిరుద్ధంగా పొడిగించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21న సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం, పోలీసుల కక్షసాధింపు చర్యలను అన్నామలై నిలదీశారు.


2011 నాటి మోడీ వ్యాఖ్యలను గుర్తుచేసిన అన్నామలై:

నిరసనకారులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ అణచివేస్తున్న కేంద్ర వైఖరిపై విరుచుకుపడిన అన్నామలై, 2011లో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ, ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో అవినీతి వ్యతిరేక నిరసనకారులపై నాటి కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి చేపట్టిన పోలీసు చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. "తన చేతులు కట్టేయకపోతే ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసేవాడిని" అని ఆనాడు మోడీ వ్యాఖ్యానించారని అన్నామలై గుర్తుచేశారు.


నాడు ఆందోళనలకు పిలుపునిచ్చి, మద్దతు తెలిపిన అదే మోడీ... ఈరోజు ప్రధానమంత్రి పీఠంపై కూర్చుని, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న యువకులకు తీహార్ జైలు శిక్షను, తీవ్రమైన వేధింపులను బహుమతిగా ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.


కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి అన్నామలై లేవనెత్తిన 5 కీలక ప్రశ్నలు:


1. సీజేపీ కార్యకర్తలు నిరసన కోసం అనుమతి కోరిన వెంటనే జంతర్ మంతర్ 'గుర్తింపు పొందిన నిరసన వేదిక' హోదాను ఎవరి ఆదేశాల మేరకు నిలిపివేశారు?

2. పోలీసులే ఫిర్యాదుదారులుగా ఉన్న కేసులో, నిరసనకారులను కస్టడీలో ఉంచాలో లేదో నిర్ణయించే అధికారాన్ని అసిస్టెంట్ కమిషనర్‌కు 'స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్' హోదా ఇచ్చి పోలీసు శాఖే చేతుల్లోకి తీసుకోవడంలో నిష్పాక్షికత ఎక్కడ ఉంది?

3. అక్టోబర్ 19న యువకుల బెయిల్ పిటిషన్‌ను విచారించాల్సిన స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆలస్యంగా రావడం, తన ప్రాణానికి ముప్పు ఉందనే నాటకమాడి విచారణ నుండి తప్పుకోవడం ఎవరి ఒత్తిడి వల్ల జరిగింది?

4. యువకులకు బెయిల్ ఇచ్చేందుకు వచ్చిన ఎనిమిది మంది షూరిటీలను నిరాకరించి, వారిని విచారణకు గురిచేసిన చట్టవిరుద్ధమైన చర్యకు ప్రామాణికం ఏమిటి?

5. గతంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ప్రభుత్వాల హయాంలో బిజెపి కార్యకర్తలు ఢిల్లీలో పోలీసుల నిషేధాజ్ఞలన్నింటినీ ఉల్లంఘించి ఆందోళనలు చేయలేదా? నాడు బిజెపి నాయకులతో ఢిల్లీ పోలీసులు ఇలాగే వ్యవహరించారా?


"బిజెపి కుట్రలు మనుషులకి విసుగు తెప్పిస్తున్నాయి":

కేంద్రంలో పన్నెండేళ్లకు పైగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం, తన విఫల విధానాలను, ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం కొత్త 'శత్రువులను' సృష్టిస్తోందని అన్నామలై ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎలుగెత్తే ప్రతి నిరసనను దేశవ్యతిరేక చర్యగా, విదేశీ కుట్రగా చిత్రీకరించే బిజెపి తంత్రాలు ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయన్నారు.


కేంద్ర హోంశాఖ పూర్తి నియంత్రణలోనే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA), ఇతర పరిశోధనా సంస్థలు పనిచేస్తున్నప్పటికీ, దేశంలో ఏ సాధారణ ఆందోళన జరిగినా... దాని వెనుకైనా విదేశీ శక్తులను వెతకడం బిజెపి భయానికి, రాజకీయ ఓటమికి నిదర్శనమని స్పష్టం చేశారు. 2026 జూన్ 5నే తాను బిజెపికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేసిన అన్నామలై, నీట్ (NEET) నిరసనకారులపై పెల్లెట్ తుపాకులు ఉపయోగించిన బిజెపి ప్రభుత్వ క్రూరత్వాన్ని కూడా పునరుద్ఘాటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్