- బెయిల్ వచ్చిన మరుసటిరోజే ఎన్‌ఎస్‌ఎ
- కేంద్రం, అస్సాం ప్రభుత్వాల తీరుపై సర్వత్రా ఆగ్రహం
గౌహతి, న్యూఢిల్లీ : అస్సాం ఆదివాసీ హక్కుల కార్యకర్త ప్రణబ్ డోలీకి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే ఆయనపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాజిరంగా జాతీయ పార్కు సమీపంలోని హతిఖులి ప్రాంతంలో విలాసవంతమైన ఫైవ్‌స్టార్ రిసార్ట్ ఏర్పాటుకు ప్రతిపాదించి, తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ గోలాఘాట్ జిల్లాలోని ఆదివాసీ గ్రామస్థులు గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. వారి ఆందోళనకు మద్దతిస్తున్న డోలీని జులై 12న బొకాఖత్ పోలీసులు అరెస్టు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేశారు. సెషన్స్ కోర్టు జులై 29న బెయిల్ మంజూరు చేసినా విడుదల చేయకుండా ఆ మరుసటి రోజే ఆగమేఘాలపై ఎఎస్‌ఎ కింద కేసు నమోదు చేసింది.
ఎవరీ డోలీ....
ప్రణబ్ డోలీ అస్సాంకు చెందిన ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు. మిస్సింగ్ సంఘం సభ్యుడు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిఐఎస్‌ఎస్) నుంచి ఎంఎస్‌డబ్ల్యులో పట్టభద్రుడు. దశాబ్దాలుగా ఆదివాసీల భూ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, స్థానికుల హక్కుల కోసం పోరాడుతున్నారు. 'గ్రేటర్ కాజిరంగా భూ, మానవ హక్కుల పరిరక్షణ కమిటీ' (జికెఎల్‌హెచ్‌ఆర్‌సి), 'జీపాల్ కృషక్ శ్రమిక్ సంఘ' (జెకెఎస్‌ఎస్) వంటి సంస్థలకు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కాజిరంగా జాతీయ ఉద్యానవనం సమీపంలో నిర్వాసితులైన ఆదివాసీ, రైతు కుటుంబాల తరపున ఆయన న్యాయస్థానాల్లో చేసిన పోరాటం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కర్బీ ఆంగ్లాంగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు ప్రభావిత ప్రజల హక్కుల కమిటీ (కెఎఎస్‌పిఎపిపిసి) కన్వీనర్‌గా పోరాడిన ఆయన వెయ్యి మెగావాట్ల సోలార్ పార్కు కోసం 434.25 మిలియన్ డాలర్ల రుణాన్ని గత ఏడాది మేలో రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. 20 మంది ఆదివాసీ కుటుంబాల పిటిషన్ నేపథ్యంలో అస్సాం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎటిడిసి)కి ఈ ఏడాది జూన్‌లో గౌహతి హైకోర్టు, నోటీసులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ ఆదివాసీల మనుగడ కోసం పోరాడుతున్న వారిని, స్థానికుల ఆందోళనలను అణచివేయడానికి క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించకూడదని పేర్కొంటూ జులై 29న గోలాఘాట్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఒకరోజు తరువాత జులై 30న అస్సాం ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం కింద ఆయనను నిర్బంధంలో ఉంచింది. ప్రణబ్ డోలీకి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే ఆయనపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించడం ప్రభుత్వ అధికార దుర్వినియోగమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ విమర్శించారు.








కామెంట్‌లు (0)