- భారతీయుల ప్రవేశాలు 6.5 శాతం తగ్గుదల..
- పిజి కోర్సుల్లో ఏకంగా 34 శాతం పతనం
న్యూఢిల్లీ : వీసా నిబంధనల కఠినతరం, ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి, పడిపోతున్న రూపాయి విలువ తదితర పరిణామాలు.. అమెరికా చదువులపై భారత విద్యార్థుల ఆసక్తిని దెబ్బతీస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఇ) నివేదిక ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు 6.5 శాతం తగ్గి 3,39,435కు పరిమితమయ్యాయి. ముఖ్యంగా పిజి కోర్సుల్లో ప్రవేశాలు ఏకంగా 34 శాతం పడిపోయి 1,16,609కు చేరాయి. మరోవైపు అమెరికాలో కొత్తగా ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 17.7 శాతం పడిపోయింది. అయితే చదువు పూర్తయ్యాక పని అనుభవం పొందేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి)లో భారతీయుల భాగస్వామ్యం మాత్రం 27 శాతం పెరిగి 1,82,201కు చేరింది. అలాగే 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికా వర్సిటీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 3,63,019గా ఉండగా, 2025-26లో 3,39,435కు తగ్గింది. పిజి కోర్సుల్లో ప్రవేశాలు 1,77,892 నుంచి 1,16,609కు పడిపోయాయి. అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మాత్రం ఒక శాతం తగ్గి 39,711గా నమోదయ్యాయి. అయినప్పటికీ అమెరికాలో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ 29.6 శాతం వాటాతో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య కూడా 4.3 శాతం తగ్గి 2,54,458కు చేరింది.








కామెంట్‌లు (0)