కేంద్రం తీరును నిరసిస్తూ 23న లడఖ్ బంద్‌కు ఎల్‌ఎబి, కెడిఎ పిలుపు
శ్రీనగర్ : మే 22నాటి నిర్ణయాలపై కేంద్రం వెనక్కి తగ్గడాన్ని నిరసిస్తూ, జూన్ 23న లడఖ్ బంద్ పాటించాలని లడక్‌కి చెందిన పౌర సమాజ గ్రూపుల సమాఖ్య లడఖ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి), కార్గిల్ డెమ్రోకటిక్ అలయన్స్ (కెడిఎ) శనివారం పిలుపిచ్చాయి. ఆనాటి సమావేశంలో అంగీకారం కుదిరిన మినిట్స్‌ను విడుదల చేయడంలో జాప్యాన్ని ఖండించాయి. ‘23వ తేదీన లడఖ్‌లోని అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతబడతాయి. ప్రస్తుతం పర్యాటక సీజను నడుస్తున్నందున కేవలం రవాణా మాత్రమే అనుమతించబడుతుంది. అని ఎల్‌ఎబి చైర్మన్ త్సెరింగ్ డోర్జీ లక్రూక్ కెడిఎ సభ్యులతో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా సమావేశంలో తెలిపారు. మే 22న ఆరుగురు సభ్యులతోకూడిన సివిల్ సొసైటీ గ్రూపు కమిటీతో కేంద్ర హోం శాఖ జరిపిన సమావేశంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం వెనక్కి తగ్గినందు వల్లే ఈ పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని లక్రూక్ చెప్పారు. కొన్ని నిర్ణయాలపై కేంద్ర హోం శాఖ సబ్ కమిటీ అంగీకరించిందని, ఆ తర్వాత సమావేశం మినిట్స్‌లో అవి ప్రతిబింబించలేదని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అందువల్ల ముందుగా ఆ సమావేశంలో మినిట్స్ విడుదల చేయాలని, ఆనాటి నిర్ణయాలకు కేంద్రం కట్టుబడాలని కోరారు. ఈ పత్రికా సమావేశంలో లడఖ్ ఎంపి హనిఫా జాన్, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా పాల్గొన్నారు. లడఖ్‌లో దలైలామా రెండు నెలల పర్యటనను సాకుగా చూపి ఈ నిర్ణయాల అమలును వాయిదా వేయాలని కేంద్రం చూస్తోందని లక్రూక్ విమర్శించారు. లడఖ్‌కు రాజ్యాంగ రక్షణలపై మాట్లాడుతూ రాజ్యాంగంలోని 371 ఎ, ఎఫ్, జి అధికరణల కింద ప్రత్యేక అధికారాలను మంజూరు చేసేందుకు అంగీకారం కుదిరిందని కెడిఎ నేత కర్బాలై చెప్పారు. లడఖ్‌కు ప్రతిపాదిత 371కె అధికరణ కింద అత్యుత్తమ నిబంధనలు రూపొందించి, చేరుస్తామని చెప్పారని అన్నారు.








కామెంట్‌లు (0)