బెనారస్‌లో ఆయన నివాసం విధ్వంసాన్ని ఖండించిన సిపిఎం
న్యూఢిల్లీ : వారణాసిలో ప్రముఖ సంగీత విద్యాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పూర్వీకుల గృహాన్ని ధ్వంసం చేయడంపై సిపిఎం తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేసింది. ఆ ఇంట్లోనే ఆయన తన సంగీతాన్ని సాధన చేసేవారని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవడానికి బదులుగా మనకు, మన భావి తరాలకు కూడా వాటి అవశేషాలను కూడా దక్కకుండా చేస్తున్నామని, ఇది చాలా దురదృష్టకరమైన అంశమని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు తరలిపోయేందుకు, అక్కడ సంగీత పాఠశాల ఏర్పాటు చేసేందుకు అవకాశం వచ్చినపుడు, ఇక్కడ గంగ ప్రవహిస్తుంది, శివారాధన జరుగుతుందని అటువంటి బెనారస్‌ను అమెరికాలో తయారుచేయడానికి సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తూ ఉస్తాద్ ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారన్నారు. ఆయన సంగీతాన్ని, ఆయన ఎంతగానో ప్రేమించే బెనారస్ నుండి వేరు చేయడానికి అవకాశమే లేదని బేబీ పేర్కొన్నారు. ఆయన తుది ఊపిరి వరకు బెనారస్‌ను ఎన్నడూ వీడి వెళ్ళలేదన్నారు. కానీ ఇప్పుడు ఆయనకు బెనారస్‌లో చోటే లేకుండా పోయిందని బేబీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్తాద్ ఇంటిని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల గురించి, కమర్షియల్ డెవలపర్ల ప్రయోజనాలు గురించి ప్రజలకు ఎన్నో ఏళ్ళుగా తెలుసునని అన్నారు. చివరకు ఉస్తాద్ నివాసాన్ని ఒక వారసత్వ చిహ్నంగా నిలిపివుంచేలా చర్యలు తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన సొంత నియోజకవర్గంలోనే జోక్యం చేసుకోలేకపోవడం అత్యంత విచారించాల్సిన అంశమని అన్నారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌కు జన్మనిచ్చిన, ఆయన షెహనాయ్‌ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అనుమతించిన సుసంపన్నమైన, సమ్మిళితమైన సాంప్రదాయానికి మోడీ వికసిత్ భారత్‌లో విలువ లేకపోవడం అత్యంత చేదు వాస్తవం. ఫలితంగా మనందరం నిరుపేదలుగా మిగిలిపోయామని బేబీ వ్యాఖ్యానించారు.








కామెంట్‌లు (0)