20 జెడ్‌పిలలో కాంగ్రెస్, 5 జెడ్‌పిలలో కమలం గెలుపు
రెండు పంచాయతీ సమితుల్లో అధికార పీఠం సిపిఎం కైవసం
ఏడు జెడ్‌పి సభ్యులు, 50 పంచాయతీ సమితి సభ్యుల విజయం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/ రాజస్థాన్ : రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి ఘోరపరాజయం పాలైంది. ఆ పార్టీపై పెల్లుబుకిన ప్రజాగ్రహం ఫలితాల్లో ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలోని 37 జిల్లా పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 20 జిల్లా పరిషత్‌లను గెలుచుకుంది. ఐదు చోట్ల మాత్రమే బిజెపికి మెజారిటీ లభించింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సొంత జిల్లా అయిన భరత్‌పూర్‌లో కూడా బిజెపిపై కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది. హనుమాన్ బెనివాల్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పి) ఒక జిల్లా పరిషత్‌ను గెలుచుకుంది. మరో 11 జిల్లా పరిషత్‌లలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. వీటిలో నాలుగు చోట్ల కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. బిజెపి ఒకటి, భారత ఆదివాసీ పార్టీ (బిఎపి) రెండు జిల్లా పరిషత్‌లలో అతిపెద్ద పార్టీగా ఉన్నాయి. నాలుగు జిల్లా పరిషత్‌లలో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కీలకం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,275 జిల్లా పరిషత్ స్థానాలకు, 7,543 పంచాయతీ సమితి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం రాజస్థాన్ ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 686 స్థానాలు గెలుచుకోగా, బిజెపి 318 స్థానాలకే పరిమితమైంది. ఆర్‌ఎల్‌పి 42, బిఎపి 22 స్థానాల్లో విజయం సాధించగా, సిపిఎం ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. పంచాయతీ సమితి ఎన్నికల్లో కాంగ్రెస్ 3,733 స్థానాలతో ముందంజలో నిలిచింది. బిజెపి 2,210 స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పి) 496, భారత ఆదివాసీ పార్టీ (బిఎపి) 276, బిఎస్‌పి 60 స్థానాలు సాధించాయి. స్వతంత్ర అభ్యర్థులు 627 స్థానాల్లో విజయం సాధించారు.
సత్తాచాటిన సిపిఎం
పంచాయతీ సమితుల్లో 50 స్థానాలు, జిల్లా పరిషత్‌లలో ఆరు స్థానాలను గెలుచుకుని సిపిఎం సత్తాచాటింది. హనుమాన్‌గఢ్ జిల్లా భాద్రా, రాజ్‌పూర్ పంచాయతీ సమితులను సిపిఎం కైవసం చేసుకుంది. భాద్రాలో 19 స్థానాలకు గాను 15 స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు విజయం సాధించారు. బిజెపి మూడు, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. రాజ్‌పూర్‌లోనూ 19 స్థానాలకు గాను సిపిఎం 14 స్థానాలను దక్కించుకుంది. బిజెపి నాలుగు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దోడ్ గ్రామీణ పంచాయతీలో సిపిఎం ఆరు స్థానాలు గెలుచుకుంది. దోడ్, హనుమాన్‌గఢ్ జంక్షన్, హనుమాన్‌గఢ్ టౌన్, నోహర్ రీడ్డి పంచాయతీల్లో రెండేసి స్థానాల్లో విజయం సాధించింది. పల్లూ, కచరియావాస్, నీంకా థానా, తారానగర్, శ్రీడూంగర్‌గఢ్ పంచాయతీల్లోనూ ఖాతా తెరిచింది. భాద్రా పంచాయతీ సమితి పరిధిలో సిపిఎంకు దాదాపు 40 వేల ఓట్లు లభించాయి. రాజ్‌పూర్‌లో సుమారు 38 వేల ఓట్లు సాధించింది.
హనుమాన్‌గఢ్‌లో నాలుగు జిల్లా పరిషత్ స్థానాలు
హనుమాన్‌గఢ్ జిల్లాలో సిపిఎం నాలుగు జిల్లా పరిషత్ సభ్యత్వ స్థానాలను గెలుచుకుంది. ఈ జిల్లాలో పార్టీ అభ్యర్థులకు దాదాపు లక్ష ఓట్లు లభించాయి. బికనీర్, సికర్ జిల్లాల్లో ఒక్కో స్థానంలో విజయం సాధించింది. చురు జిల్లాలోనూ సిపిఎం తొలిసారి జెడిపి స్థానాన్ని గెలుచుకుంది. సెప్టెంబర్‌లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బికనీర్ జిల్లా నోఖా నగరపాలికలో మొత్తం 45 వార్డులకు గాను 29 వార్డులను గెలుచుకుని సత్తా చాటిన సంగతి తెలిసిందే.
ప్రజాసమస్యలపై పోరాటాలకు మద్దతు : సిపిఎం
గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సాధించిన విజయాలు స్థానిక ప్రజా సమస్యలపై నిర్వహించిన పోరాటాలకు లభించిన ప్రజా మద్దతుగా సిపిఎం పేర్కొంది.
బిజెపి మొండిచేయికి వ్యతిరేకంగా ప్రజల సందేశం : కాంగ్రెస్
బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యం, నెరవేర్చని హామీలకు వ్యతిరేకంగా ప్రజల సందేశానికి ఈ ఫలితాలు సంకేతమని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఫలితాలు అంచనాలకు తగ్గట్టుగా లేవని, పార్టీ పనితీరును సమీక్షిస్తామని బిజెపి తెలిపింది.








కామెంట్‌లు (0)