కారణం చెప్పని కేంద్ర సాంస్కృతిక సంస్థ
కార్యక్రమానికి ఐదు రోజుల ముందు ప్రకటన
కోల్‌కతా: సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఫౌండేషన్ నిర్వహించనున్న సింపోజియంకు కేటాయించిన వేదికను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ ఈస్టర్న్ జోనల్ కల్చరల్ సెంటర్ ( ఇజెడ్‌సిసి) కార్యక్రమానికి కేవలం ఐదు రోజుల ముందు రద్దు చేసింది. ఈ నెల ఆదివారం(22) కోల్‌కతాలో జరగాల్సిన కార్యక్రమానికి సంబంధించి, ఫౌండేషన్‌కు సోమవారం పంపిన ఈమెయిల్‌లో ఇజెడ్‌సిసి డైరెక్టర్ ‘‘అనివార్య పరిస్థితులు’’ కారణమని పేర్కొన్నారు. అంతకుమించి ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు. ఈ కార్యక్రమంలో ‘‘నూతన సామ్రాజ్యవాదం’’ అంశంపై సదస్సు జరగాల్సి ఉంది. ‘జెన్ జెడ్ ఎదురుతిరుగుతోంది, భారత భవిష్యత్తును నిర్మిస్తోంది’’ అనే అంశంపై ఎస్ఎఫ్ఐ నాయకురాలు ఐషీ ఘోష్ సహా విద్యార్థి నేతల ప్రసంగాలున్నాయి. ‘‘సామ్రాజ్యవాదం, నూతన ముప్పులు, నేటి ప్రతిఘటన’’ అనే సెషన్‌లో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, చరిత్రకారుడు ముకుల్ కేశవన్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, మాజీ ఎంపీ మాలినీ భట్టాచార్య పాల్గొనాల్సి ఉంది. ఏచూరి జీవితంపై ఆడియో విజువల్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
దీనిపై ఫౌండేషన్ వివరణ కోరింది. ‘‘ఈ చర్య వివరణకు అందనిదే కాక, చిత్తశుద్ధితో తీసుకున్నట్లు కనిపించడం లేదు, ఏకపక్షంగా ఉంది’’ అని ఫౌండేషన్ పేర్కొంది. అయితే ఈ ప్రశ్నకు ఇజెడ్‌సిసి నుంచి స్పందన రాలేదు. జులైలోనే వేదికను బుక్ చేసి, చెల్లింపు కూడా పూర్తి చేసినట్లు ఫౌండేషన్ తెలిపింది. ఇజెడ్‌సిసి పాలక మండలిలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇదిలా ఉండగా, ఫౌండేషన్ మరో వేదికను ఏర్పాటు చేసుకుందని, కార్యక్రమం ముందుగా నిర్ణయించిన ప్రకారమే జరుగుతుందని తెలిపింది.
రాజకీయ జోక్యంతోనే వేదిక రద్దు : ఎంఎ బేబీ
ఇజెడ్‌సిసి వేదికను నాలుగు నెలల ముందే బుక్ చేసి, చెల్లింపులు కూడా చేసినా ఎలా రద్దు చేస్తారని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ ప్రశ్నించారు. రాజకీయ జోక్యం కారణంగా ఇటీవలి కాలంలో బహిరంగ వేదికలపై కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ఇదే మొదటిసారి కాదని బేబీ విమర్శించారు. సాంస్కృతిక సంస్థలను బిజెపి, సంఘ్ పరివార్ తమ ఆధీనంలోకి తీసుకుని, తమకు అనుకూలంగా నడుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుణెలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ) క్యాంపస్ ఆడిటోరియంలో సినిమా, చిత్ర నిర్మాణాలతో సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థకు కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతించారని ఆయన పేర్కొన్నారు. ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకించిన విద్యార్థులపై ఆ సంస్థ సభ్యులు దాడి చేశారన్నారు. ఇజెడ్‌సిసి నిర్ణయం సీతారాం ఏచూరి ఫౌండేషన్ కార్యకలాపాలను అడ్డుకోలేదని బేబీ స్పష్టం చేశారు. సీతారాం ఏచూరి గౌరవార్థం ఫౌండేషన్ చేపట్టే పనులు కొనసాగుతాయని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఫౌండేషన్ కంటే ఇజెడ్‌సిసి ప్రతిష్ఠకే నష్టం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.








కామెంట్‌లు (0)