ఓపెన్ టాప్ బస్సులో రామ్‌లీలా మైదాన్‌కు ఇండియా బ్లాక్ నేతలు
న్యూఢిల్లీ : ఇండియా బ్లాక్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఖర్గే నివాసం నుంచి బహిరంగ బస్సులో రామ్‌లీలా మైదాన్‌కు చేరుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ఆదివారం ‘చలో ఢిల్లీ’ మార్చ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మైదానంలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


రామ్‌లీలా మైదాన్‌కు చేరుకుంటున్న ఇండియా బ్లాక్ నేతలు
న్యూఢిల్లీ : రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ చేపట్టిన 'చలో ఢిల్లీ' నిరసన ప్రదర్శన కోసం దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర ప్రతిపక్ష నేతలు, వేలాది మంది మద్దతుదారులు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి ) నేత తేజస్వి యాదవ్, కూటమిలోని సీనియర్ నాయకులతో సహా పలువురు ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నుండి బయలుదేరారు. "ఓటును కాపాడండి, దేశాన్ని కాపాడండి" (వోట్ బచావో, దేశ్ బచావో) అనే నినాదంతో కూడిన బ్యానర్లను చేతబట్టుకుని, ఓటర్ల జాబితాలో అవతవకలకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనకు చేపడుతున్నారు. సిఇసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియను నిలిపివేయాలని ఇండియా బ్లాక్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మింటో రోడ్–కన్నాట్ ప్లేస్ కూడలి నుంచి రామ్‌లీలా మైదాన్ వైపుగా ఈ యాత్ర ప్రారంభమైంది.
జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడటంపైనే మోడీ ప్రభుత్వం దృష్టి : పంజాబ్ కాంగ్రెస్ ఎంపి
దేశానికి ద్రోహం చేసి, ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించి, రాజ్యాంగాన్ని ధిక్కరించిన సిఇసి జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడటంపైనే మోడీ ప్రభుత్వం దృష్టి సారించిందని పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిక్కులను గౌరవిస్తూ వచ్చిందని, రాహుల్ గాంధీకి సిక్కు సమాజం పట్ల ప్రగాఢమైన అభిమానం ఉందని అన్నారు. మోడీ ప్రభుత్వం సిక్కుల గురించి, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి మాట్లాడుతున్నారని, అది నిజంగా ఒక విషాదకరమైన సంఘటన అని, ఆ ఘటనను ఖండిస్తున్నానని అన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం 12 ఏళ్లుగా అధికారంలో ఉందని, మీరెందుకు న్యాయం అందించలేదని ప్రశ్నించారు. ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడే, సిక్కులకు జరిగిన అవమానాన్ని ఎందుకు అకస్మాత్తుగా గుర్తుచేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ర్యాలీ గురించి బిజెపి ఎందుకంత ఆందోళన చెందుతోందని కాంగ్రెస్ ఎంపి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ప్రశ్నించారు. వారు కుర్చీలను లెక్కపెడుతున్నారన్న విషయం నిన్న వెలుగులోకి వచ్చిందని, ఈ ర్యాలీకి బిజెపి భయపడుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా సిఇసి జ్ఞానేశ్ కుమార్‌పై ఆగ్రహం ఉందని, ఆ ఆగ్రహానికి బిజెపి భయపడుతోందని అన్నారు. వేలాది మంది కార్మికులు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు సభాస్థలికి తరలివస్తుండటంతో, శాంతిభద్రతలను కాపాడేందుకు సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 10,000 మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.

ఇండియా బ్లాక్ ర్యాలీ చారిత్రాత్మక నిరసన : జాన్ బ్రిట్టాస్
న్యూఢిల్లీ : రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం జరగనున్న ఇండియా బ్లాక్ ర్యాలీ దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న చారిత్రాత్మక నిరసన అని సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. ఈ ర్యాలీకి 10 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం ప్రారంభం కాకముందే రామ్‌లీలా మైదాన్ జనంతో కిక్కిరిసిపోయిందని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ ర్యాలీ పప్రధాన మోడీ, అమిత్ షాలకు గట్టి సందేశాన్ని పంపుతుందని బ్రిట్టాస్ అన్నారు. ఈ డిమాండ్‌పై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరిన్ని రాజకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

డబుల్-ఇంజిన్ ప్రభుత్వం డబుల్ జీరోగా మారింది : అఖిలేష్ యాదవ్
న్యూఢిల్లీ : డబుల్-ఇంజిన్ ప్రభుత్వం డబుల్ జీరోగా మారిందని సమాజ్‌వాది (ఎస్‌పి) పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆదివారం రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి చేపట్టిన 'చలో ఢిల్లీ' మార్చ్‌లో పాల్గొనడానికి ముందు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బిజెపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతే 1.27 కోట్ల ఓట్లు తొలగించినట్లు యుపి సిఎం యోగి అంగీకరించారని పేర్కొన్నారు. ‘‘అన్యాయానికి హద్దులు దాటాయి" అని అఖిలేష్ యాదవ్ అన్నారు. డబుల్-ఇంజిన్ ప్రభుత్వం గురించి మాట్లాడిన వారే డబుల్ జీరోగా మారారని, ఓట్లకు సంబంధించిన డేటాను ప్రభుత్వం ఎక్కడ నుండి సేకరించిందని ఆయన ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల నుండి లక్షలాది మంది లబ్ధిదారులు గల్లంతయ్యారని అన్నారు. ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీ ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, ఆ ఎన్నికల్లో బిజెపి ఆరు సీట్లు, ఎస్‌పి ఐదు సీట్లు గెలుచుకున్నాయని యాదవ్ అన్నారు. కీలక నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు, రీకౌంట్ల కారణంగా అధికార పార్టీ యొక్క "డబుల్ ఇంజిన్" నినాదం "డబుల్ జీరో"గా, "డబుల్ డిఫీట్"గా కుప్పకూలిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత 1.27 కోట్ల ఓట్లు తగ్గాయని యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ అంగీకరించారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. అన్యాయానికి, తప్పుడు వాగ్దానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంగా ఆయన అభివర్ణించారు. వారందరూ రామ్‌లీలా మైదానానికి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
‘చలో ఢిల్లీ’ మార్చ్ .. భారీగా భద్రతా బలగాల మోహరింపు
న్యూఢిల్లీ : రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం భారీగా భద్రతా బలగాలను మోహరించింది. ఎన్నికలలో అవకతవకలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ‘చలో ఢిల్లీ’ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల నుండి ప్రతిపక్ష నేతలు, మద్దతుదారులు ఢిల్లీకి చేరుకోవడం ప్రారంభించారు. రామ్‌లీలా మైదాన్‌లో భారీ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ఒక పోస్ట్‌లో పేర్కొంది.
ఇండియా బ్లాక్ చేతులు పైకెత్తి ఓటుతో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, ప్రధానఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతీకాత్మక "ప్రజా అభిశంసన"ను చేపట్టింది. ఓట్లను దొంగిలించడానికి అధికార బిజెపితో కుట్ర పన్నడం, ఓటర్ల సర్ ద్వారా 13.2 కోట్ల మంది ఓటర్లను తొలగించడం, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు సిఇసి వ్యవహరించడం వంటి ఆరు అభియోగాలను వారు నమోదు చేశారు. మరోవైపు, కేంద్రం ఢిల్లీలో భారీగా బలగాలను మోహరించింది.
ట్రాఫిక్ ఆంక్షలు
‘చలో ఢిల్లీ’ మార్చ్ నేపథ్యంలో ఆదివారం సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ మార్గ్ టీ-పాయింట్, రాజ్‌ఘాట్, ఢిల్లీ గేట్, ఐటీఓ ఏ-పాయింట్, అజ్మేరీ గేట్ రెడ్‌లైట్, బారాఖంబా రోడ్డులోని రంజీత్ సింగ్ ఫ్లైఓవర్, భవభూతి మార్గ్-డీడీయూ మార్గ్ రెడ్‌లైట్, ఝండేవాలన్ రౌండ్‌అబౌట్, తుర్క్‌మన్ గేట్, మీర్‌దార్డ్ చౌక్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.









కామెంట్‌లు (0)