శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐడిబిఐ బ్యాంక్‌లో పెట్టుబడుల ఉపసంహరణను ఖండించిన సిఐటియు

2 గంటల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- దేశవ్యతిరేక నిర్ణయం

న్యూఢిల్లీ : ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్‌‌లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా ఖండించింది. ఐడిబిఐలోని 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) తీసుకున్న నిర్ణయం దేశ వ్యతిరేకమని విమర్శించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఒక దేశీయ బ్యాంకుకు చెందిన వాటాలను ఇంత భారీ స్థాయిలో విదేశీ కంపెనీకి విక్రయించడం ఇదే మొదటిసారని, రూ. 4.67 లక్షల కోట్ల నికర ఆస్తులు కలిగిన బ్యాంకును కేవలం రూ.52,878 కోట్ల నామమాత్రపు ధరకు విక్రయిస్తున్నారని పేర్కొంది. 2018లో రూ.36,915 కోట్ల హెచ్‌పిసిఎల్ వాటాల విక్రయం, 2022లో ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూప్‌కు రూ.18,000 కోట్లకు విక్రయించడాన్ని ఈ రూ. 52,878 కోట్ల విలువైన ఈ ఒప్పందం అధిగమించిందని తెలిపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకూ చేపట్టిన అతిపెద్ద వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ (జాతీయ ఆస్తుల బహిరంగ విక్రయం) ఇదే కానుందని విమర్శించింది.

ఈ ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్‌లో ప్రభుత్వ వాటాల విక్రయంతో ప్రస్తుత బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్న రూ. 80,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణను అధిగమించనున్నారని సిఐటియు పేర్కొంది. అయితే బడ్జెట్‌ ‌పేపర్లలో "పెట్టుబడుల ఉపసంహరణ" అనే పదానికి బదులుగా "ఇతర మూలధన రాబడులు" (ఎంసిఆర్‌) అనే పదాన్ని చేర్చిన విషయాన్ని సిఐటియు గుర్తు చేసింది. ఈ అమ్మకానికి ముందు ఐడిబిఐ బ్యాంకులో ఎల్ఐసికి 49.24 శాతం, కేంద్రానికి 45.48 శాతం వాటా ఉందని, దీని తర్వాత, ఎల్ఐసి వాటా 19 శాతం, కేంద్రం వాటా 15 శాతానికి దిగజారుతుందని తెలిపింది. దీంతో బోర్డులో ఎల్ఐసికి గానీ, కేంద్రానికి గానీ ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదని సిఐటియు పేర్కొంది. ఐడిబిఐ బ్యాంకులో కేంద్రం పెట్టుబడిని కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రి చెప్పడం దేశ ప్రజలను మోసం చేయడమేనని విమర్శించింది. ఒకవైపు ...ఓటు హక్కు రక్ష‍ణ కోసం దేశ ప్రజలంతా ఉద్యమిస్తుండగా.. మరోవైపు మోడీ మంత్రివర్గం జాతీయ ఆస్తులను విదేశీ, దేశీయ అనుచరులకు అమ్ముకోవడంలో నిమగ్నమై ఉందని సిఐటియు విమర్శించింది. ఇలాంటి దేశ వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా బహిరంగంగా ముందుకు రావాలని దేశభక్తి, ప్రగతిశీల శక్తులతో పాటు దేశంలోని శ్రామిక ప్రజలందరికీ సిఐటియు విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్