న్యూఢిల్లీ : ఎస్‌ఐఆర్‌లో అవకతవకలకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) మద్దతును ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడంపై సిజెపి ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, అర్హుడైన ప్రతి పౌరుడు ఓటు హక్కును పరిరక్షించడమే భారత ఎన్నికల సంఘం బాధ్యత అని సిజెపి పేర్కొంది. రాజ్యాంగ సూత్రాలను, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ... సమాన రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించడం, ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడంపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుందని సిజెపి స్పష్టం చేసింది. "ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం ఏమిటంటే ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, అంతేగాని ప్రభుత్వం తన ఓటర్లను ఎన్నుకోవడం కాదు" అని సిజెపి విమర్శించింది. ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎన్నికల విధానంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆరోపించింది. “జ్ఞాను తప్పక వెళ్ళాలి! ఇండియా బ్లాక్ నవంబర్ 1 ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ తన మద్దతును అందిస్తోంది. దేశమే అన్నింటికన్నా ముఖ్యం!” అని సిజెపి పేర్కొంది.
దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం పోరాడుతున్న అన్ని సంస్థలకు మద్దతు ఇస్తామని సిజెపి తెలిపింది. ఈ ప్రకటనను “జై భీమ్”, “జై హింద్” అనే నినాదాలతో సిజెపి ముగించింది.








కామెంట్‌లు (0)