- 600 కేసులు ఉపసంహరిస్తూ విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం
- స్వాగతించిన సిపిఎం
చెన్నై: తమిళనాడులో తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు చేసిన రైతులు, ఉపాధ్యాయులపై గతంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 92 వేల మందికి పైగా రైతులు, ఉపాధ్యాయులకు కేసుల నుండి విముక్తి కలగనుంది. 2021 మే నుంచి 2026 ఏప్రిల్ వరకు నమోదైన కేసులను ప్రభుత్వం పరిశీలించింది. ఈ క్రమంలో మొత్తం 600 కేసులను గుర్తించి వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏళ్లుగా కేసులను ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించనుంది. సెప్టెంబర్ 2వ తేదీన తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
నిరనన ప్రజాస్వామ్య హక్కు : పి షణ్ముగం
రైతులు, ఉపాధ్యాయులపై దాఖలైన నిరసన కేసులను ఉపసంహరించుకోవాలన్న విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తమిళనాడు కార్యదర్శి పి షణ్ముగం స్వాగతించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతి యుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పేదలు, మధ్యతరగతి, కార్మికులు చేపట్టిన నిరసనలు వెనకు ఉన్న స్ఫూర్తిని పాలకులు గ్రహించాలన్నారు. వీటితో పాటు మిగిలిన కేసులను ఉపసంహరించుకోవాలని షణ్ముగం కోరారు.









కామెంట్‌లు (0)