న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన భారత ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తుందని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ అన్నారు. పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినట్లే, నియోజకవర్గాల పునర్విభజన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని విమర్శించారు. న్యూఢిల్లీలోని జవహర్ భవన్లో జరిగిన జాతీయ రచయితలు, కళాకారుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని చూస్తోందని అరుంధతి రాయ్ మండిపడ్డారు. అయితే, దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. కులం, మతం, వర్గాల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం ద్వారా అధికార పార్టీకి లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అస్సాం, కాశ్మీర్లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉపయోగించుకుంటూనే ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీయడమే నేటి రాజకీయ పరిస్థితి అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపైనా అరుంధతి రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ భారీగా నిధులు సేకరించిందని, ఆర్థిక బలాన్ని ఉపయోగించి ఎన్నికల వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ఆమె ఆరోవిమర్శించారు. గెర్రీమాండరింగ్ అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్ల విభజన, నియోజకవర్గాల సరిహద్దుల మార్పు చేయడమని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఆమె విమర్శించారు. 2016లో పెద్ద నోట్ల రద్దు, 2019లో కాశ్మీర్లో ఆంక్షలు, 2020లో నాలుగు గంటల వ్యవధిలో ప్రకటించిన కరోనా లాక్డౌన్ను ఉదాహరణలుగా ప్రస్తావించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయని, ప్రజాస్వామ్య వ్యవస్థపై కూడా ప్రభావం చూపాయని అరుంధతి రాయ్ అన్నారు.








కామెంట్లు (0)