ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జంతర్‌మంతర్‌ నిరసనలో పాల్గొన్న యువతకు సిపిఐ(ఎం) అభినందనలు

11 అక్టోబర్, 2026

ragavulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 01:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలిపిన వేలాది మంది యువత, విద్యార్థులకు సిపిఐ(ఎం) అభినందనలు తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకు యువత చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనలో పాల్గొన్న యువత, విద్యార్థులకు సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని, భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) అనుసరిస్తున్న నిరంకుశ, అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో వేలాది మంది యువత, విద్యార్థులు ఆందోళన చేపట్టారని అన్నారు. బిజెపి ఆదేశాల మేరకు కోట్లాది మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించేందుకు ఈసిఐ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను చేపట్టిందని విమర్శించారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో యువత చేపట్టిన నిరసన విజయవంతమైందని అన్నారు. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని విమర్శించారు. భారీగా పోలీసులను మోహరించినప్పటికీ, బారికేడ్లను సైతం లెక్కచేయకుండా వేలాది మంది నిరసన ప్రదేశానికి చేరుకున్నారని తెలిపారు. వందలాది మంది యువకులు, విద్యార్థులను, ముఖ్యంగా మహిళా విద్యార్థినులను పోలీసులు అరెస్టు చేశారని, వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. పోలీసుల చర్యల్లో పలువురు యువత గాయపడ్డారని తెలిపారు. పోలీసుల అణచివేతను ఎదుర్కొంటూనే ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడుకునేందుకు యువత, విద్యార్థులు వీధుల్లోకి వచ్చారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో పోరాడిన యువతకు దేశ ప్రజల తరఫున సిపిఐ(ఎం) అభినందనలు తెలియజేస్తోందన్నారు. ముందు తరాల నాయకులు ప్రజాస్వామ్యాన్ని సుస్థిరం చేసి, ఇప్పటివరకు పరిరక్షించారని, దాన్ని కాపాడే బాధ్యతను నేటి యువత చేపట్టాలని రాఘవులు పిలుపునిచ్చారు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రభుత్వ సంస్థలను వినియోగిస్తోందని విమర్శించారు. ఈ చర్యలను అడ్డుకునేందుకు యువత ముందుకు రావాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతోపాటు మరింత బలోపేతం చేసే బాధ్యతను చేపట్టాలని కోరారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేసేంతవరకు, బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమిని ఓడించే లక్ష్యంతో దేశ యువత, విద్యార్థులు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారు సాగిస్తున్న పోరాటానికి సిపిఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్