29 స్థానాలు గెలిచి మున్సిపాలిటీ కైవసం
బిజెపి, కాంగ్రెస్‌లను కాదని ఎర్రజెండాకు పట్టం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో ఎర్రజెండాను ప్రజలు ఆదరించారు. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం మున్సిపాలిటీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. బికనీర్ జిల్లాలోని నోఖా నగరపాలిక (మున్సిపాలిటీ)లో మొత్తం 45 స్థానాలకు గాను 29 స్థానాలను కైవసం చేసుకుని, రాష్ట్రంలోనే తొలి మున్సిపల్ కౌన్సిల్‌ను ఆ పార్టీ ఒంటరిగా ఏర్పాటు చేసింది. పలు వార్డులలో పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోవడం గమనార్హం. 21వ వార్డులో సిపిఎం అభ్యర్థి నీలూ రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ప్రాంతంలోని రైతులు, కార్మికుల సమస్యలపై సిపిఎం ప్రజా పోరాటాలను నిర్వహించింది. దీంతో ప్రజల మద్దతును గెలుచుకుంది.
బిజెపి, కాంగ్రెస్‌లను ఢీకొట్టి గెలిచి..
బికనీర్ జిల్లా నోఖా నగరపాలిక (మున్సిపాలిటీ) ఎన్నికల్లో 29 స్థానాలను గెలుచుకుని నోఖా మున్సిపాలిటీపై పట్టు సాధించింది. బిజెపి 13 స్థానాల్లో విజయం సాధించగా, మిగిలిన మూడు స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, శ్రీ గంగానగర్, హనుమాన్‌గఢ్, ఝున్ఝును, సికార్, ఉదయ్‌పూర్ వంటి ప్రాంతాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం 40 మున్సిపల్ స్థానాలను గెలుచుకుంది. జోధ్‌పూర్ కార్పొరేషన్ వార్డులో కూడా ఆ పార్టీ విజయం సాధించింది. సికార్‌లోని దోడ్, లోసల్, పల్సానా నగరపాలిలో పార్టీ అభ్యర్థులు ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నారు. గతంలో నోఖా మున్సిపాలిటీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), బిజెపిలు వంతులవారీగా అధికారాన్ని చేపట్టే సంప్రదాయానికి ఇది తెరదించింది. ఈ నేపథ్యంలో సిపిఎం సాధించిన తాజా విజయం స్థానిక రాజకీయాల్లో కీలక మార్పుగా నిలిచింది. ఈ విజయంతో నోఖా మున్సిపాలిటీలో ఆ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. ఈ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శించిన తీరు, రాష్ట్రంలో దాని సంస్థాగత బలం, ఎన్నికల అవకాశాలపై అందరి దృష్టిని ఆకర్షిస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
చారిత్రాత్మక విజయం: ఎంఎ బేబీ
సిపిఎం చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. “నోఖా నగర పాలికలోనూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వార్డులలోనూ సిపిఎం సాధించిన చారిత్రాత్మక విజయానికి కార్యకర్తలకు, రాజస్థాన్ ప్రజలకు అభినందనలు. బిజెపి-ఆర్ఎస్ఎస్ల మతతత్వ విషాన్ని ఎదిరించి, ప్రజల సమస్యలపై పోరాడే ప్రతిచోటా ఎర్రజెండా రెపరెపలాడుతుంది” అని అన్నారు.
పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అభినందనలు: పినరయి విజయన్
నోఖా (రాజస్థాన్)లో సిపిఎం సాధించిన చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నందుకు పార్టీ కార్యకర్తలకు, విజయాన్ని అందించిన ప్రజలకు కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందనలు తెలిపారు. మొత్తం అత్యధిక స్థానాలను గెలుచుకుని మున్సిపాలిటీపై పట్టు సాధించడం సిపిఎంకు ఒక కీలక ముందడుగు. ఇది కార్యకర్తల అవిశ్రాంత కృషికి, నోఖా ప్రజలు వారిపై ఉంచిన నమ్మకానికి ప్రతిఫలం. ఈ విజయాన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు” అని పేర్కొన్నారు.
ఇది స్థానిక విజయం మాత్రమే కాదు: కిషన్ పారిఖ్
ఈ విజయంతో ఎర్రజెండాకు రాష్ట్రంలో రాజకీయంగా కొత్త అవకాశాలు లభిస్తున్నాయనడానికి సంకేతమని సిపిఎం రాజస్థాన్ రాష్ట్ర కార్యదర్శి కిషన్ పారిఖ్ పేర్కొన్నారు. బిజెపి పట్ల ఉన్న వ్యతిరేకత, ప్రజా, ఆర్థిక సమస్యలపై నిరంతరం సాగించిన పోరాటమే ఈ విజయానికి కారణమన్నారు. ‘‘మేము స్థానిక సమస్యలను లేవనెత్తాము. ప్రజలు సిపిఎంని ఒక బలమైన ప్రత్యామ్నాయంగా భావించి మాకు ఓటు వేశారు’’ అని పారిఖ్ అన్నారు. పార్టీకి ఉన్న ఆదరణ కేవలం స్థానిక సమస్యలకే పరిమితం కాలేదని అన్నారు. ‘‘ఆర్థిక సమస్యల కోసం, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడగల పార్టీ ఏదైనా ఉందంటే, అది సిపిఎం మాత్రమే’’ అని ఆయన అన్నారు.
బిజెపి అభ్యర్ధికి ఒకే ఒక ఓటు..
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలను గెలుచుకుంది. దిద్వానా కుచమన్ జిల్లాలోని పర్బత్సర్ మున్సిపాలిటీలో ఫలితం మాత్రం బిజెపి షాక్‌కు గురిచేసింది. డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రచారం చేసుకున్న బిజెపి అభ్యర్థి కైలాస్ చంద్రకు కేవలం ఒకే ఓటు రావడం చర్చనీయాంశమైంది.. పర్బత్సర్ మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి బిజెపి తరుఫున కైలాస్ చంద్ర పోటీ చేసి ఒకే ఒక ఓటు పోలైంది. ఆయనది పక్క వార్డు కావడంతో తన ఓటు కూడా వేసుకోలేకపోవడం గమనార్హం. ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి హీనా ఖాన్ 376 ఓట్లు సాధించి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి రషీద్ ఖాన్‌కు 195 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి కైలాష్ చంద్ర మాత్రం ఒక్క ఓటుతో సరిపెట్టుకున్నారు.








కామెంట్లు (0)