తిరువనంతపురం : సిఇసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా మాత్రమే లక్ష్యం కాదని, ప్రజాస్వామిక హక్కులను తిరిగి సాధించుకోవడమూ పోరాటంలో భాగమేనని సిపిఐ(ఎం) ఎంపి జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. ‘ఓట్ల చోరీ’పై దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనలు కేవలం సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌కు మాత్రమే పరిమితం కాలేదని, ప్రజాస్వామ్య స్వేచ్ఛను తిరిగి పొందాలని కూడా కోరుకుంటున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం జంతర్ మంతర్ నిరసనలపై ఆయన శుక్రవారం తిరువనంతపురంలో జాతీయ మీడియా ‘ద హిందూ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సమస్యలు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయనే భావన విస్తృతంగా ఉందని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ లేదా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరగకపోతే, ప్రతీదీ నిరుపయోగం అవుతుందని, రాజకీయ పార్టీ అయినా, సామాజిక కార్యకర్త అయినా దానికి విలువ ఉండదని అన్నారు. ప్రస్తుతం సమాజంలోని ప్రతి వర్గం ఇబ్బంది పడుతోందని అన్నారు. దేశం సాధించిన ప్రగతి, దాని ప్రగతిశీల ఆదర్శాలన్నీ తిరోగమనంవైపు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇక చాలు’ అని ప్రజలు ధైర్యంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రారంభించారని అన్నారు. మత విద్వేషాలతో, ముస్లిం-హిందూ చర్చతో బిజెపి ఇంకెంత కాలం అధికారంలో ఉండగలదని ప్రశ్నించారు. బిజెపికి ఓటు వేసిన వారు కూడా ఈ నిరసనకు మద్దతుగా పెద్ద సంఖ్యలు ముందుకు వస్తున్నారని అన్నారు.
దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని తలకిందులు చేసిన జంతర్ మంతర్ నిరసనలు
నీట్-యుజి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ జంతర్‌మంతర్ వద్ద జరిగిన మొదటి నిరసన తర్వాత విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్‌తో పోలీస్తే.. సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా అంత సులభంగా జరిగే విషయం కాదని, మోడీ ప్రభుత్వం ఆయనను అంత తేలిగ్గా వదులుకోలేదని తెలుస్తోందని అన్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాల ఎన్నికల ప్రణాళికలన్నింటినీ జ్ఞానేష్ కుమార్ అమలు చేస్తున్నందున, ఒక మంత్రిలా ఆయనను అంత సులభంగా వదిలించుకునేందుకు సిద్ధపడరని అన్నారు. దేశంలో పారదర్శకమైన, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగాలని వారు కోరుకోవడం లేదని అన్నారు. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించిన క్షణమే, పరిస్థితులు అదుపు తప్పడం మొదలవుతాయని అన్నారు. అలాగే డిమాండ్లు మరింత పెరగవచ్చనే భయంతో ప్రస్తుతం మోడీ, షాలు సందిగ్ధంలో ఉన్నారని అన్నారు. ఈసమస్యలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపుతాయనేది కూడా కీలకంగా మారిందని అన్నారు. రెండవ విడత నిరసనల పట్ల మోడీ ప్రభుత్వంమరింత అణచివేత ధోరణిని అవలంబించిందని అన్నారు. కేంద్రం వెనక్కి తగ్గితే అది తీవ్ర పరిణామాలకు దారితీసే విపత్తుగా మారుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారని అన్నారు. అందుకే దేశ సరిహద్దులను కాపాడాల్సిన వారందరినీ (సిఆర్పిఎఫ్) ఢిల్లీలో మోహరించారని అన్నారు. ప్రజా నిరసనలను అదుపు చేయడంలో ఎటువంటి శిక్షణ లేని కేంద్ర పారామిలిటరీ బలగాలను భారీ సంఖ్యలో రంగంలోకి దించారని, దీంతో పరిస్థితులు క్రూరంగా మారాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాంప్రదాయ పార్టీలు లేదా కూటములకు అతీతంగా, ప్రతి ఒక్కరి పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. ఈ ఉద్యమం తమకు ప్రయోజనం చేకూరుస్తుందా లేదా, కొత్తగా ఉద్యమంలోకి వచ్చిన వారు ఇతరుల రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతారు వంటి సంకుచిత లెక్కలన్నింటినీ పక్కనపెట్టాలని అన్నారు.
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయని అన్నారు. సామాజిక చర్చా ధోరణులు మారాయని, ఇళ్లలో జరిగే సంభాషణలు కూడా మారాయని తాను భావిస్తున్నానని అన్నారు. ఒక ‘రాజకీయ ప్రణాళిక’ కంటే ఒక 'మీమ్' ఎంతో శక్తివంతమైనదని ఇప్పుడు అర్థమవుతోందని అన్నారు. సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరడం, ప్రధాని మోడీ ఒక 'రీల్' లో కనిపించాల్సి రావడం వంటి పరిణామాలు, జెన్ జెడ్ చేపట్టిన నిరసనలు సాంప్రదాయ రాజకీయాలపై ఎంతటి ప్రభావాన్ని చూపాయో తెలియజేస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల పరంగా అత్యంత బలహీనంగా ఉన్నప్పటికీ, ఇటీవలి నిరసన ఉద్యమాల్లో ప్రజలను సమీకరించడంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఇది ఆశించదగిన పరిణామమని అన్నారు. ఒక రాజకీయ శక్తిగా వామపక్షాలు ప్రస్తుతం బలహీనంగా ఉండవచ్చు, కానీ దాని వెనుక ఉన్న ఆలోచనా విధానం, అది ప్రజలను ప్రేరేపించే తీరు, నిరసనకారులకు ఒక దిశానిర్దేశం చేసే విధానం వేరని అన్నారు. తన దృష్టిలో సంఖ్యలు అంత ముఖ్యమైనవి కావని, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, లేదా ఒక పరిస్థితిని ఎలా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేదే ముఖ్యమని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ కూడా గుర్తించారని, అందుకే ఆయన వామపక్షాలను పూర్తిగా నిర్మూలించాలని కోరుకుంటున్నారని అన్నారు.
మాజీ జర్నలిస్టుగా, అధికార బిజెపి, ఆర్ఎస్ఎస్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాన స్రవంతి మీడియా (గోడీ మీడియా )లోని చాలా సంస్థల విశ్వసనీయత ప్రస్తుతం ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. సాంప్రదాయ మీడియాపై ఇంతటి తీవ్రమైన దాడిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. నిరసన జరుగుతున్న ప్రాంతాల నుండి మీడియాను వెళ్లగొట్టారని అన్నారు. వారిని కేవలం ప్రచార సాధనాలుగా లేదా ఒక వర్గం వాదనలను మోసేవారిగా చూస్తున్నారని, ఇది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమని అన్నారు. కార్పొరేట్ ప్రయోజనాలు, సంకుచిత లక్ష్యాలు ముఖ్యమైనప్పటికీ, ప్రజలు కూడా గమనిస్తున్నారన్న అంశాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం నిరసనల్లో కొంత ప్రశాంతత నెలకొన్నట్లు అనిపించవచ్చని, కానీ ఇది తుఫానుకు ముందున్న నిశ్శబ్దం మాత్రమే అని జాన్ బ్రిట్టాస్ స్పష్టం చేశారు.







కామెంట్లు (0)