శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాణిజ్య ఒప్పందంలో వివాదం: భారత ఓడరేవులలో రూ. 600 కోట్ల స్కాచ్ విస్కీ నిలిపివేత

10 గంటల క్రితం

వాణిజ్య ఒప్పందంలో వివాదం: భారత ఓడరేవులలో రూ. 600 కోట్ల స్కాచ్ విస్కీ నిలిపివేత
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 04:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ:

భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో తలెత్తిన వివాదం కారణంగా దేశంలోని వివిధ ఓడరేవులలో సుమారు రూ. 600 కోట్ల విలువైన స్కాచ్ విస్కీ నిలిచిపోయింది. బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీపై 162.5 శాతం సుంకం మరియు పన్నులు విధించడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. ఒప్పందం ప్రకారం కొన్ని స్కాచ్ విస్కీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించారు. అయితే, భారీ పరిమాణంలో చేసే దిగుమతులకు ఈ రాయితీ వర్తించదన్న కస్టమ్స్ వైఖరితో అధిక సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో దేశీయ మద్యం తయారీ రంగంలోనూ ప్రతిష్టంభన ఏర్పడింది.


భారీ పరిమాణంలో స్కాచ్ విస్కీని సాధారణ విస్కీగా కాకుండా, మద్యం తయారీకి వినియోగించే ప్రత్యేక ముడిసరుకుగా పరిగణిస్తూ 150 శాతం సుంకం విధిస్తున్నారు. అదనపు పన్నులు కూడా కలిపితే మొత్తం సుంకం 162.5 శాతంగా ఉంటోంది. అయితే, బాటిళ్ల రూపంలో అయినా లేదా బల్క్ రూపంలో అయినా దిగుమతి చేసుకునే అన్ని రకాల స్కాచ్ విస్కీకి వాణిజ్య ఒప్పందంలోని 75 శాతం సుంకమే వర్తిస్తుందని మద్యం కంపెనీలు వాదిస్తున్నాయి.


ఈ వివాదం నేపథ్యంలో పెర్నో రికార్డ్, డియాజియో, బకార్డీ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన 80కి పైగా కంటైనర్లలో వేలాది లీటర్ల స్కాచ్ విస్కీ భారత ఓడరేవులలో నిలిచిపోయింది. సరుకులను తాత్కాలికంగా విడుదల చేయించుకోవాలంటే 75 శాతం సుంకాన్ని ముందుగా చెల్లించి, మిగిలిన మొత్తానికి బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి వస్తోంది. ఇది తమపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


బ్రిటన్ నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న స్కాచ్ విస్కీలో దాదాపు 80 శాతం బల్క్ రూపంలోనే ఉంటోంది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం (IMFL) ఉత్పత్తిలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ వివాదం మరింత కాలం కొనసాగితే మద్యం తయారీ వ్యయం పెరిగి, దేశీయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.


ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ అంశంపై సమీక్ష ప్రారంభించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్