సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తరిగిపోతున్న జీవవైవిధ్యం

2 గంటల క్రితం

తరిగిపోతున్న జీవవైవిధ్యం
 52 ఏళ్లలో 73 శాతం తగ్గిన వన్యప్రాణుల జనాభా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 12:07 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- 52 ఏళ్లలో 73 శాతం తగ్గిన వన్యప్రాణుల జనాభా

న్యూఢిల్లీ : ఒకప్పుడు అడవులు, నదులు, సరస్సులు, సముద్రాలు అనేక రకాల వన్యప్రాణులతో కళకళలాడేవి. గత ఐదు దశాబ్దాల కాలంలో పరిస్థితి తారుమారైంది. మానవ తప్పిదాలు, ప్రకృతి వనరుల్ని విపరీతంగా, విచక్షణారహితంగా వినియోగించడం వల్ల వన్యప్రాణుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పర్యావరణ విధ్వంసం కారణంగా 52 ఏళ్లలో ప్రపంచం తన వన్యప్రాణుల సంపదలో మూడింట రెండొంతులకుపైగా కోల్పోయింది. ఈ సమస్య తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు జీవకళతో కిటకిటలాడిన అడవులు, నదులు, సరస్సులు, సముద్రాలు నేడు మూగజీవాల వేదన, రోదనలకు నిలయంగా మారుతున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్), లండన్ జులాజికల్ సొసైటీ సంయుక్తంగా విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్- 2026 నివేదిక ఈ భయాందోళనల్ని కలిగించే నిజాల్ని బయటపెట్టింది. 1970 నుంచి 2022 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల జనాభా 73.2 శాతం తగ్గి, అత్యంత ఆందోళనకర స్థాయికి పడిపోయింది. గడిచిన 52 ఏళ్లలో వన్యప్రాణుల జనాభా ఇంతలా పడిపోవడానికి అసలు కారణాలేంటి? అన్న దానిపై పరిశోధించింది.

ఈ నివేదికలో అత్యంత భయాందోళన కలిగించే అంశం ఏంటంటే, భూభాగం, సముద్రాల కంటే నదులు, చెరువులు, సరస్సుల్లో నివసించే మంచినీటి జీవుల మనుగడకే అత్యంత భారీ ముప్పు వాటిల్లింది. ఈ మంచినీటి సరస్సుల్లో నివసించే జీవుల జనాభానే ఏకంగా 85 శాతం తగ్గింది. భూమిపై నివసించే జీవులు 69 శాతం, సముద్ర జీవులు 59 శాతం మేర క్షీణించాయి. నదులు, జలాశయాల్లో పారిశ్రామిక కాలుష్యం పెరిగిపోవడం, మానవ అవసరాల కోసం అడ్డగోలుగా ప్రాజెక్టుల్ని నిర్మించడం, నదులు ఎండిపోవడం, ఆక్రమణల వల్ల జలచరాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్ని పరిశీలిస్తే- లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల్లో వన్యప్రాణులు ఎక్కువగా వినాశనానికి గురవుతున్నాయి. లాటిన్ అమెరికా అండ్ కరీబియన్‌లో 95 శాతం వన్యప్రాణులు అంతరించిపోగా, ఆఫ్రికా ఖండంలో క్షీణత 80 శాతంగా నమోదైంది. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో 49 శాతం తగ్గుముఖం పట్టాయి.

వన్యప్రాణుల వినాశనానికి ప్రధాన కారణాలు

సహజ ఆవాసాల విధ్వంసం - వ్యవసాయ భూముల విస్తరణ, పట్టణీకరణ కోసం అడవుల్ని విచ్చలవిడిగా నరికివేయడం వల్ల జంతువులకు నివాస స్థలాలే కరువయ్యాయి.

వనరుల అధిక వినియోగం - చేపల వేట, అటవీ వనరుల్ని తిరిగి కోలుకోలేని స్థాయిలో వాడటం, జంతువుల అక్రమ రవాణా వంటివి కూడా ప్రధాన కారణాలు.

వాతావరణ మార్పులు- ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో మార్పుల వల్ల పర్యావరణ వ్యవస్థల సమతుల్యత దెబ్బతింటోంది.

కాలుష్యం- నీరు, నేల, గాలి కలుషితం కావడం వల్ల జీవుల ఆరోగ్యం, మనుగడ దెబ్బతింటోంది.

వ్యవసాయ సబ్సిడీల ప్రభావం- ప్రపంచవ్యాప్తంగా ఏటా 470 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ రాయితీలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ఉచిత విద్యుత్, నీటి రాయితీల వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతుండగా, ఎరువులపై రాయితీలతో రసాయనాల వాడకం పెరిగి నేల సారం దెబ్బతింటుంది. మంచినీటి వనరులు కలుషితం అవుతున్నాయి. దీని వల్ల కూడా వన్యప్రాణుల సంఖ్య తగ్గుతోంది. ఇక్కడ రిపోర్ట్ ప్రకారం పర్యావరణ పరిరక్షణకు ఏటా ప్రపంచవ్యాప్తంగా కేవలం 220 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తుండగా, ప్రకృతికి హాని చేసే కార్యకలాపాలపై ఏకంగా 7.3 ట్రిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు.

చిగురిస్తున్న ఆశలు

వన్యప్రాణుల సంఖ్య వేగంగా క్షీణిస్తున్నప్పటికీ, సరైన సంరక్షణ చర్యలు తీసుకుంటే జీవుల సంఖ్యను పునరుద్ధరించవచ్చని నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రాంతాల వారీగా సమష్టిగా కృషి చేస్తే వన్యప్రాణుల్ని కాపాడుకోవచ్చని ఈ నివేదిక నిరూపిస్తోంది. 2010లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 3200 గా ఉన్న అడవి పులుల సంఖ్య నిరంతర పర్యవేక్షణ చర్యలతో 2025 నాటికి 5700కుపైగా చేరాయి. ఇక్కడ దాదాపు 70 శాతం పెరగడం విశేషం. దశాబ్దాలుగా క్షీణిస్తూ వచ్చిన బ్లూఫిన్ ట్యూనా చేపల సంఖ్య కూడా పుంజుకొని అంతరించిపోయే ప్రమాదకర జాతుల జాబితా నుంచి బయటపడింది. ఇంకా 80కిపైగా దేశాల్లో గత 50 ఏళ్లుగా సాగుతున్న పోరాటంతో గ్రీన్ సీ తాబేళ్ల మనుగడ కూడా మెరుగైంది.

జీవవైవిధ్య నష్టాన్ని 2030 నాటికి ఆపి, తిరిగి పునరుద్ధరించాలనే లక్ష్యంతో రూపొందించిన కున్మింగ్ - మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ నిర్దేశించిన 2030 నాటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ నివేదిక పలు కీలక సూచనలు కూడా చేసింది. ప్రకృతికి హాని చేసే సబ్సిడీలను పునఃసమీక్షించాలి. పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహిస్తూ, స్థానిక గిరిజన, అటవీ ప్రాంత ప్రజల్ని పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం కీలకం అని తెలిపింది. ఇవన్నీ జరిగితేనే మానవాళితో పాటు సమస్త జీవకోటికి సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని నివేదిక నొక్కిచెబుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్